కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చక్కని సరసపు శిశువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
చక్కని సరసపు శిశువు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : చక్కని సరసపు శిశువు
సంఖ్య : 151
పుట : 109
రాగం : కన్నడగౌళ
కన్నడగౌళ
28 చక్కని సరసపు శిశువు
పెక్కుమాయల పెనుశిశువు
||పల్లవి||
చిమ్మెడి విషములు చేఁపినరొమ్ములు
కొమ్మని యిచ్చినఁ గుడిచేని
బొమ్మరపోవఁడు పూతకిఁ బొరిగొని
అమ్మరో గయ్యాళి శిశువు
॥చక్కని॥
చుట్టమువలెనే సుడిగాలినిఁ గని
బెట్టుగఁ గౌఁగిట బిగించేని
పుట్టఁడు వొడమఁడు బూమెలే చేసీ
పట్టరే పసి బాల శిశువు.
॥చక్కని॥
పాదము చాఁచటు బండి జాతురకు
ఆదిగొనుచు తా నలరీని
వేదవేద్యుఁడగు వేంకటగిరి పై
మోద మందిన మున్నిటి శిశువు
॥చక్కని ॥
అవతారిక:
పెక్కు మాయల పెను శిశువు అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారు. అన్నమాచార్యులవారు. పల్లవి తేలికగా వుంటే చరణాలు మరణాలే అన్నమయ్య కీర్తనలలో. స్వామి మున్నిటి శిశువుట అంటే అనాదియైన శిశువు. బొమ్మర పోవడు అంటే దిమ్మతిరిగేట్లు చేయడమన్నమాట. “పుట్టడు వొడమడు బూమెలే చేసీ” అంటే ఏమిటి? తేలికగా కనిపించే అతి క్లిష్టమైన కీర్తన ఇది. సాధ్యమైనంత పొందికగా దీని భావవివరణ కూర్చాను.
భావ వివరణ:
ఓ ప్రజలారా! శిశువు (పొత్తిళ్ళ బాలుని) వలె వున్న ఇతడు చక్కని, సరసమైన (లలితమైన) వాడు. చాలా మాయలు నేర్చిన గొప్ప శిశువు ఈతడు. ఈయన లీలలు వినండి.
ఒకనాడు పూతకి అనే రాక్షసి అందమైన యువతి వలెవచ్చి విషములు చిమ్మెడి రొమ్ములలో పాలు చేపిన (చేపినవని) కొమ్మని (త్రాగునాయనా!) అని ఇచ్చిన వెనువెంటనే, కుడిచేని (పీల్చినాడు). బొమ్మరపోవడు (దిమ్మదిరిగిన ఆ రాక్షసి పారిగొనినది (నశించినది). అమ్మరో! (అయ్యబాబోయ్) వీడు గయ్యాళి శిశువు (రండగొండి పిల్లవాడు).
ఒకనాడు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో చుట్టపు చూపుగా అనుకోకుండా వున్నట్లుండి వచ్చాడు. వచ్చి, బెట్టుగ కౌగిట బిగించేని (అతిశయించి కౌగిటిలో బిగించినట్లు చుట్టేశాడు). అప్పుడు వీడు మాత్రం తక్కువవాడా? బూమెలే చేసీ (మోసాన్ని మోసంతోనే వంచాడు). పైగా వాడు పుట్టడు వొడమడు (పుట్టుకే లేని మగాడు). (పసిబాల శిశువుగా) వున్నంతమాత్రాన పట్టరే! (వీనిని పట్టుట సాధ్యమా?)
ఒకనాడు శకటాసురుడు అనే రాక్షసుడు ‘బండి’ రూపంలో వీడిని చంపాలని వచ్చాడు. అప్పుడు, ఆదిగొని (వాడిపై కన్నువేసి) తాను (ఆ శిశువు) అటు పాదము చాచి, జాతురకు నలరీని (మిక్కిలి చాతుర్యంతో అతిశయించి) బండిని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసి శకటాసురుని చంపేశాడు. ఎందుకంటే ఆ శిశువు యెవ్వరనుకొన్నారు? వేదవేద్యుడు (వేదముల చేతనే తెలియశక్యమైన) దేవదేవుడు. శ్రీవేంకటాద్రి మీద సంతోషంగా వున్న శ్రీవేంకటేశ్వరుడే ఈ మున్నిటి (అనాదియైన మఱియాకు శిశువు).
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: