Jagamulelevadavu Janardanudavu In Telugu – జగములేలేవాడవు జనార్దనుడవు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో జగములేలేవాడవు జనార్దనుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

జగములేలేవాడవు జనార్దనుడవు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : జగములేలేవాడవు జనార్దనుడవు
సంఖ్య : 229
పుట : 153
రాగం : ముఖారి

ముఖారి

22 జగము లేవాఁడవు జనార్దనుఁడవు
తగ నీవారమై (మే?) నేము ధర నెట్టుండినాను,

||పల్లవి||

గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసినతప్పులు లోఁగొనవే.

॥జగ||

తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు
యెల్లవారికిఁ బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము
చల్లఁగా మానేరములు సైరించుకొనవే.

॥జగ||

దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము
శరణుచొచ్చితి మిఁక క్షమియించుకొనవే.

||జగ|| 229

అవతారిక:

జనుల ‘అర్ధన’ (వేడికోలు) వినేవాడు జనార్దనుడు. “దేవా! నీవు జనార్దనుడవై జగము లేలుతుంటే, మేము నీవారమై, నీదాసులమై ఈలోకంలో పూనికతో వుంటామయ్యా!” అని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. మా తల్లియు దండ్రియును దాతయునూ నీవే ప్రభూ! “అన్యధా శరణం నాస్తి” అని నిన్ను ఆశ్రయించినాము. మాకు నీవే దిక్కు. అసలు సంగతి యేమిటంటే, అవతారికలో కనుపించినంత తేలిక కాదు, దీని భావము. అంతు చిక్కని, చిక్కుముళ్ళు చాలావున్నాయి, అంటే నన్ను నమ్మండి. “కాణాచి” అంటే యేమిటో? చదవండి. రెండేళ్ళ క్రితం ఇదే కీర్తన నేను చేయలేకపోయాను, నేడు చేయగలుగుతున్నాను. ఇదే స్వామి ‘దయ’ అంటే.

భావ వివరణ:

ఓ జనార్దనా! నీవు జగములు (పదినాలుగు భువనములను) పరిపాలించు బ్రహ్మాండనాయకుడవు. నేము (మేము) ఈ ధరన్ (భూమిపై) తగన్ (తగినట్లు) నీవారమై (నీ పరివార భృత్యులమై) నెట్టుండినాము (పూనికతోయున్నాము).

ప్రభూ! నీవే మాకు గతివి (దిక్కైన ఆధారానివి). నీవే మాకు మతివి (మంచీ చెడు విచక్షణ కలిగించే మేధస్సువి). నీవే మాకు కాణాచియైన చోటువు (చిరకాలవాసస్థానమైనవాడవు… అందుచేతనే మన ఆత్మలన్నింటికీ ఆ పరమాత్మ చిరంతనుడు). అన్నిటికీ నీవే సతమైన (శాశ్వతమైన) సాక్షివి (ఆయన నిష్పక్షపాతమైన సాక్షీభూతుడు). మాకు అప్పుడప్పుడు చతురత వలసితే (తెలివితేటలు అతి అయిపోయి) నిన్ను జరతుము (నిందించెదము). తరువాత నీవే దిక్కని కొలుతము (కాళ్ళు పట్టుకొంటుంటాం). తతి (అసాధారణంగా) మేము చేయుచున్న తప్పులను మన్నించుము తండ్రీ!

ఓ దేవా! నీవే మాకు తల్లివి, తండ్రివీ నీవే. మా ప్రాణదాతవు పరమాత్మవూ నీవే. నీవు ఆత్మరూపువవైననూ అందరికీ నివాసస్థానమైన వాడవు. మాకు ఇహమున కోర్కెలు దీర్చి, పరమున మోక్షమునిచ్చేవాడవు నీవే. మల్లడి (నీతో పోట్లాడి) ఒక్కొక్కవేళ నిన్ను మఱచిపోయి తలుచుకోను కూడా తలుచుకోము. మా నేరములను చల్లగా (నెమ్మదిగా) సైరించి కొనవే (క్షమించి మమ్మల్ని కాపాడవయ్యా!)

ఓ జగన్నాథా! నీవు మా దరిదాపువు (సమీపములోనే వున్న గమ్యానివి). అంతులేని దయాస్వరూపుడవు. నీవు విలసిల్లిన శ్రీవేంకటపతివి. ఏదియేమైనా మేము నిన్ను విరివిగా (విస్తృతముగా) వేడుకొని నుతించెదము. నిన్ను శరణుచొచ్చితిమి. ఇక క్షమించుకొనవే (మమ్మల్ని క్షమించి అనుగ్రహించుము తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment