Uppavadamu Gavayya Uyyala Mancham Meeda In Telugu – ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
సంఖ్య : 102
పుట : 74
రాగం : కాంబోధి

కాంబోధి

26 ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా.

||పల్లవి||

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంకమేనితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీసతిచూపు నాటినచిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా.

॥ఉప్ప||

నిద్దిరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దు వొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరుసతులు నీకు నేచినతాళగతుల
గుద్దేటిపాదములతో గోవిందరాజా.

॥ఉప్ప||

మెండుగ మేలికొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా.

॥లలల||

అవతారిక:

‘ఉప్పవడము’ అవటం అంటే రాజీకి రావడం అన్నమాట. ఉయ్యాలమంచం మీద నీకు నీ దేవేరుల మాట వినక తప్పదు. గొప్ప గొప్ప కన్నులున్న గోవిందరాజువి నీవు. అయినా సరే, అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో వేంకట మకుటం లేకపోవటం విశేషమే.

ఇటువంటి శృంగార కీర్తనల భావవివరణలో చిక్కేమిటంటే “యద్భావం తద్భవతి” – అంటే నీ భావన నీ భావానుగుణ్యంగానే వుంటుంది. కొండల కోనేటిరాయుడే ఈ గోవిందరాజు అంటున్నారు. కొండుకపాయపుసిరి అంటే చిన్నపిల్లవంటి శ్రీదేవి, కోపించిందట స్వామిపైన… యెందుకో? జాగ్రత్తగా చదివి భావించి పరవశించండి.

భావ వివరణ:

ఓ గోవిందరాజా! నీ విప్పారిన గొప్ప గొప్ప నయనాలు నీ భావములను తెలుపుతూనే వున్నాయి. నీవు ఈ ఉయ్యాలమంచము మీద భూదేవి, శ్రీదేవి సమేతుడవై వూగుచున్నావు. ఇప్పుడైనా, ఉప్పవడము గావయ్య (రాజీ మార్గానికి రావయ్యా!)

ఓ గోవిందరాజా! ఈ వైపునకు వచ్చి నీ అలసట దీరునట్లు ముచ్చట దీరగా, మువ్వంకమేనితో (మూడు అవస్థలను పొందుతున్న దేహముతో) నిదురించవయ్యా! చిరునవ్వులొలుకు శ్రీసతి చూపులు నీ చిత్తము పై నీ నాటుకొంటుండగా నీ వామె మెడలో క్రువ్వని కలువదండైనావు (వాడని కలువపూలహారమైనావు స్వామీ!)

ఈడ వచ్చి ప్రొద్దు వొద్దునకు (పూట పూటకు) నిలుచున్న అలు పెల్లదీర (అలసట యంతయు దీరునట్లు) భోగీంద్రునిపై (ఆదిశేషునిపై) విశ్రాంతిగా నిదురించవయ్యా! నీకు భూదేవి, శ్రీదేవి అను ఇద్దరు భార్యలు, యేచిన తాళగతుల (అతిశయించిన తాళానుగుణముగా) గుద్దేటి పాదములతో తన సతులను తనపాదములతో తేలికపాటి తాడనములిచ్చుచున్నాడు. ఈ గోవిందరాజస్వామి చిలిపి చేష్టలేమని వర్ణింతుము?

ప్రభూ! నీవు మెండుగా (మేలుగా) మేలుకొనినది కూడా, కొండొక ప్రాయపుసిరి కౌగిటిలోననే (లేబ్రాయపు చిన్నదైన శ్రీదేవిని గాఢాలింగనముననే) ఆమె నిదుర చెడి ఆమె నీపై కోపించినదాయెను. అయినదేమో అయినదని ఆమెను వూరడించి ఉడివోని ప్రియమున (తరగని అనురాగముతో) సుఖలీల (సుఖముగా) వుండవయ్యా! ఓ గోవిందరాజా! నీవే కొండలకోనేటిరాయుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment