కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
సంఖ్య : 54
పుట : 46
రాగం : శ్రీరాగం
శ్రీరాగం
25 చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
మరగె నిన్నలమే ్మంగ నాచారి.
॥పల్లవి||
నిలువుఁదురుము మీఁది నెమలిపాదపుడాలు
తొలి మెఱంగుల మించి దొలఁకఁగాను
అలరుచు నినుఁ జూచి అప్పుడె వెరగువడి
మలయుచు నలమేలుమంగ నాచారి.
॥చిఱు||
పరగునీమెడ సరపణులవుయ్యాలలో
ఉరుటు మురిపమున నూఁగుచును
గిరికొన్న తమకాన కిందుమీఁదెఱుఁగక
మరచె మే నలమేలు మంగనాచారి.
||చిఱు||
కంచము గని మోవి కమ్మఁదేనే లారగించి
లంచముగఁగస్తూరి లప్పలు రాల
యెంచఁగఁ దిరువేంకటేశుఁడు నీ పాఁపసజ్జ
మంచమెక్కె నలమేల్మంగనాచారి.
||చిఱు||
అవతారిక:
అలమేల్మంగ నాంచారి మీద అన్నమాచార్యులవారు చెప్పిన సరస శృంగార కీర్తన నాస్వాదించండి. వైష్ణవుల పరిభాషలో దేవిని నాంచారి అంటారు. నాచారి అని కూడా అంటారు. అందులో అమ్మవారి కొన్ని ఆభరణాల పేర్లను గానంచేస్తున్నారు. నెమలిపాదపుడాలు, సరపణలవుయ్యాలలు, మంచమున కలంకరించిన పాపసజ్జలు – ఇత్యాదివి నేటి కాలంలో లేనందువల్ల కొన్ని మన వూహాతీతం. ఊంజలేసేవ సందర్భంగా పాడిన కీర్తన అయివుంటుంది. “సిగ్గులు చిందించే చిరునవ్వు మెఱుపులొలికే మోముగల, ఈ అలమేల్మంగనాచారి నిన్ను మరగెనయ్యా తిరుమలేశా!” అంటున్నారు. నేటితరం వారికి ఈ భాషే ఒక తమాషా జాగ్రత్తగా చదవండి.
భావ వివరణ:
ఓదేవదేవా! నీ దేవేరి అలమేల్మంగ నాచారి నిన్ను మరగె (ఆశించుచున్నది). మనోహరమైన ఆ నాచారి (దేవి) సిగ్గుల చిరునవ్వు మెఱుగార (మెరపులు కురిపిస్తున్న) మోముతో (వదనముతో) శోభలీనుచున్నది.
ఆమె, నిట్టనిలువుగానున్న తురుము (సిగకొప్పు) మీద “నెమలి పాదపుడాలు” ధరించినది. అది తళతళ మెరుగులను మించి (అధికముగా) దొలకె (చిందించుచున్నది). ఆ దేవి వెరగువడి (అత్యధికమైన ఆశ్చర్యముతో మలయుచున్నది (నీకొరకు ఆరాటపడుచున్నది). ఆమె జగజ్జననియైన అలమేల్మంగనాచారి.
ప్రభూ! నీ మెడలో “సరపణులు” వుయ్యాలలూగుచున్నవి. ఉదటు మురిపెమున (గొప్ప మురిపెముతో) వూగుచున్న వాటిని, గిరికొన్న తమకాన (తారా స్థాయికి చేరిన పారవశ్యముతో) కింద మీదెరుగక (ఆశగా చూడవచ్చునో చూడ కూడదో తేల్చుకోలేక) ఆ అలమేల్మంగ నాచారి, మేను మరచె (తన తనువును తానే మరచినది స్వామీ!)
దేవా! కంచము మోవిగని (తేనెలూరు మధురాధరమును) గాంచి లంచముగా కమ్మని తేనెలారగించితివి. అప్పుడు దేవి అలదుకున్న కస్తూరిలప్పెలుగా రాలిపడినది. ఆపైన ఓ శృంగారరాయా! యెంచగా తిరువేంకటేశుడైన నీవు అలమేల్మంగ నాచారితో నీ “పాపసజ్జ మంచమునెక్కి” ఆదేవిని నీ సరసశృంగారముల నలరించితివి. (ఓ జగద్రక్షకా! భావాతీతమైన మిమ్ముభావించుట బావిలో కప్పవంటి నా తరమా!! నా అశక్తతకు అజ్ఞానానికి మన్నించి నీవు అలా నవ్వుతూనే వుండు ప్రభూ!)
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: