Vimdivo Lakshmipati Vimdivo Sarvesumdu In Telugu – వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
సంఖ్య : 402
పుట : 271
రాగం : రామక్రియ

రామక్రియ

23 వీఁడివో లక్ష్మీపతి వీఁడివో సర్వేశుఁడు
వీఁడివో కోనేటిదండవిహరించేదేవుఁడు.

||పల్లవి||

కొండ గొడగుగ నెత్తి గోవులఁ గాచె నాఁడు
కొండవంటిదానవునిఁ గోరి చించెను
కొండ శ్రీవేంకట మెక్కి కొలు వున్నాఁ డప్పటిని
కొండవంటి దేవుఁ డిదే కోనేటికఱుతను.

||వీఁడ||

మాఁకులమద్దులు దొబ్బి మరి కల్పభూజమనే-
మాఁకు వెరికి తెచ్చెను మహిమీఁదికి
మాఁకుమీఁద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి
మాఁకులకోనేటిదండ మరిగినాఁ డిదివో.

||వీఁడ||

శేషునిపడగెనీడఁ జేరి యశోదయింటికి
శేషజాతి కాళింగుఁ జిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై
శేషమై కోనేటిదండఁ జెలఁగీని దేవుఁడు.

||వీఁడ|| 402

అవతారిక:

తాళ్ళపాకలో వెలసిన ‘కోనేటిరాయనిపై’ చక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. వీడివో (వీడే) లక్ష్మీపతి, వీడే సర్వేశ్వరుడు అని కీర్తిస్తున్నారు. భావ వివరణనంతా చదివాక మీకు అంతులేని ఆనందం కలుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసము. శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై శేషమై కోనేటిదండ చెలగీని దేవుడు అంటే యెన్నైనా అర్థములు చెప్పవచ్చును. ఈ స్వామి తీయటి నీటి బావి. తోడుకున్న వారికి తోడుకొన్నన్ని నీళ్ళు. అవునా?

భావ వివరణ:

ఓ ప్రజలారా! వీడివో (ఈతడే లక్ష్మీపతి, వీడివో సర్వేశుడు (సర్వమునకు ప్రభువు), ఈతడే ఈ కోనేటి ఒడ్డున విహరించే దేవదేవుడు. ఈయన ఘన కార్యములనాకర్ణించండి.

పూర్వం ఈయన కొండను గొడుగుగనెత్తి (నంద వ్రజమున గోవర్ధన పర్వతమును తన చిటికిన వ్రేలి పై గొడుగువలె యెత్తి గోకులమును రక్షించినాడు). కోరి, కొండవంటి దానవుని (శకటాసురుని) చించెను (ముక్కలు ముక్కలు చేశాడు). అప్పటిని (మరల ఈ కలియుగంలో శ్రీవేంకటగిరి అనే కొండనెక్కి కొలువు దీరియున్నాడు. నిజముగా ఈ స్వామి ఇదే ఈ కోనేటి కఱుతను (ఒడ్డున… అని… భావిస్తున్నాను) కొండవంటి అండయైయున్నాడు.

పూర్వం ఈయన మద్దిమాకులను (రేపల్లెలో నందుని ప్రాంగణమున వున్న రెండు మద్ది చెట్లను) దొబ్బి (త్రోసివేసి) కూల్చినాడు (మద్దిచెట్లవలెనున్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు). ఈ శ్రీకృష్ణుడే స్వర్గలోకంనుండి కల్పవృక్షము అను మాకును (దేవవృక్షమును) వారికి (పెకలించి) మహిమీదకు (భూలోకానికి) తెచ్చెను. ఈయనే గొల్లమగువల చీరెలెత్తుకొనిపోయి మాకుమీదనెక్కి (యమునానది ఒడ్డునవున్న చెట్టునెక్కి వారు శరణన్న తరువాత తిరిగి ఇచ్చినాడు. ఇదిగో నేడు ఈ కోనేటి ఒడ్డున మాకుల మధ్య మరిగినాడు (పరిచితమవుచున్నాడు).

వసుదేవుడు బాలకృష్ణుని యమునానది దాటిస్తుంటే కుండపోతగా వానవచ్చింది. అప్పుడు శేషుడు తన పడిగెలను గొడుగులాకప్పినాడు. స్వామి ఆ పడిగెల నీడలో యశోద ఇంటికి చేరినాడు. శేషజాతి సర్పమైన కాళింగు శిరసుల ద్రొక్కి రక్తం కక్కించి అతను శరణన్నాక కరుణించి విడిచిపెట్టాడు. ఇదే దేవుడు శేషాచలము అనే శ్రీవేంకటాద్రిపైనున్న కోనేటిదండ (కోనేటి ఒడ్డున) చెలగీనీ దేవుడు (శ్రీవేంకటేశ్వరుడై శోభిల్లుతున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment