మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చ్యవన మహర్షి – జాలరులు నీతికథ.
చ్యవన మహర్షి – జాలరులు
భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచి మహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా ౧౨ యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.
“ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి” అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.
జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి “మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండి” అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు “రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు” అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడు “అయితే అర్ధరాజ్యమిస్తాను” అని అన్నాడు. “నీ మంత్రులతో సంప్రదించి చూడు” అన్నాడు చ్యవనుడు. “ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తాను” అని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.
ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని “గోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.
ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు “ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి “అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి” అని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకో మన్నారు. వినయముతో నహుషుడు “స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదు” అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదవిని అనుగ్ర హించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
- తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
- జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
- సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
- గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి..
- ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.
మరిన్ని నీతికథలు మీకోసం: