ఈ పోస్ట్ లో చూచి మోహించకుందురా సురలైన నరులైన కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
చూచి మోహించకుందురా సురలైన నరులైన – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: చూచి మోహించకుందురా సురలైన నరులైన
సంఖ్య : 403
పుట: 272
రాగం: తెలుగు కాంబోది
తెలుఁగు కాంబోది
60 చూచి మోహించకుందురా సురలైన నరులైన
తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను
|| పల్లవి||
భాగీరథి పుట్టినపాదపద్మములు
భోగపు మరునిజన్మభూమి నీతొడలు
యోగపు నవబ్రహ్మలుండిన నీనాభి
సాగరకన్యకలక్ష్మి సతమైనవురము
||చూచి||
అందరి రక్షించేటి అభయహస్తము
కంద నసురలఁజంపే గదాహస్తము
సందడిలోకముల యాజ్ఞాచక్రహస్తము
చెంది ధ్రువు నుతియించఁజేయుశంఖహస్తము
||చూచి||
సకలవేదములుండే చక్కనినీమోము
వొకటై తులసిదేవివుండేటిశిరసు
ప్రకటనపు మహిమలఁ బాయనినీరూపము
వెకలిశ్రీవేంకటాద్రివిభుఁడ నీభావము
||చూచి||
అవతారిక:
జగన్మోహనుడైన ఈ వేంకటేశ్వరుడే కళ్ళముందు ప్రత్యక్షమైతే మోహించని వాడెవడన్నావుంటాడా? వాడు నరుడాసురుడా అనే తేడానేవుండదు. అందరూ చేష్టలుడిగి అలా చూస్తూనే వుండిపోతారు… నఖశిఖ పర్యంతం, ఇదిగో ఈ భావమునే అన్నమాచార్యులవారు మధురమైన కీర్తనవలె నావిష్కరిస్తున్నారు. “ప్రకటపు మహిమల బాయని నీరూపము వెకలి శ్రీవేంకటాద్రి విభుడ నీ భావము” అని అంటున్నారు. ఆయన భావము ఆయన రూపంలోనే పాయని మహిమలను ప్రకటిస్తున్నదని అర్థం. భావాలను వివరించటానికి మాటలక్కరలేదు చూపులు చాలు కదా! జాగ్రత్తగా చదవండి మరి.
భావ వివరణ:
ఓ దేవదేవా! తాచి (పూనుకొని నీవు యెవరికన్నులముందైన ప్రత్యక్షమైతే, నిన్ను చూచి సురులైనా, నరులైన మోహించి తీరుతారు. జగన్మోహనుడవైన నిన్ను చూచి మోహించకుండుట యెట్లు సాధ్యము?
నిన్ను ఆపాదమస్తకం వొకసారి చూచే భాగ్యం దక్కితే ఆ జన్మ తరించదా? అదిగో నీ పాదపద్మాలు… పవిత్రమైన భాగీరధి (గంగాదేవి) పుట్టినిల్లు అదేకదా! అవిగో నీతొడలు.. జీవులకు భోగాసక్తిని కలిగించే మరునికి (మన్మధునికి) జన్మభూమి నీవూరువులే. అదిగో నీ నాభి, చతుర్ముఖుడే కాక యోగమున నిష్ణాతులైన నవబ్రహ్మలకు (భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, మరీచి – తొమ్మిదిమందిని నవబ్రహ్మలు అంటారు. వీరినుంచి రకరకాల జీవులు సృష్టించబడ్డాయి). ఇక జగద్విఖ్యాతమైన సాగరపుత్రిక లక్ష్మికి సతమైన (శాశ్వతమైన స్థానము నీ వురము (వక్షస్థలము).
ఇక నేడు మా దగ్గరకు వస్తే… అదిగో ఆ నడుముపైనున్న అభయహస్తము నీ శరణాగతులకు భయపడకండి మీకు నేనున్నాను అని అభయమిస్తున్నది. అందరినీ రక్షిస్తున్నది. అసురులను కందునట్లు (తపించునట్లు) చేయు నీగద (కౌమోదకము) నీహస్తములలో కానవచ్చుచున్నది. నీ ఆజ్ఞాచక్రము, నీ ఆజ్ఞపైలోకములను సందడించగల (తత్తరబెట్టగల నైపుణ్యమున్న దివ్యాయుధము. అది అదిగో నీ కుడిచేతిలోనున్నది. ధ్రువునికి నీ దారి చూపుటకు నినదించిన పాంచజన్య శంఖము, అదే నీ యెడమ చేతనున్నది.
ప్రభూ! సకల వేదములకు నెలవైన నీ ముద్దులొలుకు చక్కని వదనము అదిగో. తులసీదేవికి ఒకేఒక స్థిరనివాసమైన నీ శిరస్సు అదే కన్నులకు విందుజేయుచున్నది. ఆవిధంగా అనేక మహిమలను ప్రకటించుచున్న పాయని (విడువలేని) నీ దివ్యమంగళ విగ్రహము ఏ భావముతో చూస్తే ఆ భావముతో కనబడుతున్నది. వెకలి శ్రీవేంకటేశా! (ఆసక్తిని కలిగించు ఏడుకొండలవాడా!) శరణాగతులకు చల్లనిచూపులే, కుత్సితులకు క్రూరంగా కనుపిస్తాయి. అదే అత్యద్భుతం తండ్రీ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: