Idanindariki Nelikaivunnadu In Telugu – ఈడనిందరికి నేలికైవున్నాడు

ఈ పోస్ట్ లో ఈడనిందరికి నేలికైవున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: ఈడనిందరికి నేలికైవున్నాడు
సంఖ్య : 289
పుట: 194
రాగం: శుద్ధవసంతం

శుద్ధవసంతం

43 ఈడ నిందరికి నేలికై వున్నాఁడు
వాడల రేపల్లె వాఁడా వీఁడు

||పల్లవి||

భారపువుట్లపాలుఁ బెరుగులు
వారలు వట్టినవాఁడా వీఁడు
కోరి గొల్లెతల కొలనిలోపల
చీరలు దీసిన శిశువా వీఁడు

||ఈడు||

ఆవులఁ బేయల నందరియిండ్ల
వావిరిఁ గాచిన వాఁడా వీఁడు
వావు లొక్కటిగా వనితలఁ గూడి
వేవేలు నేర్చిన విటుఁడా వీఁడు

||ఈడు||

అరుదై శ్రీవేంకటాద్రిమీఁద నుండి
వరము లిచ్చేటి వాఁడా వీఁడు
మరిగెనలమేల్మంగతో మమ్మేలె
సరసుఁడై వుండే జాణా వీఁడు

||ఈడు||

అవతారిక:

ఈ తిరుమలలో అందరికీ యేలికయైవున్న ఈ భగవానుడూ అలనాడు రేపల్లె వాడలలో అల్లరి కిట్టయ్య ఒక్కరేనా? వాడా వీడు!! అని ఆశ్చర్యపోతున్నారు అన్నమాచార్యులవారు. అలవాటు ప్రకారం (రామకథ కృష్ణ కథ- దశావతారాల కథ చెప్పటం ఆయన మానుకోలేని అలవాటు) కృష్ణ లీలలు గానం చేస్తున్నారు. ఆ రేపల్లె చిత్త్చోరుడే ఈ అలమేల్మంగపతి కూడా. అవునా? ఆ జాణా వీడు… అంటున్నారు. ఎన్నిసార్లు పాడినా తనివి తీరని కృష్ణగానామృతం వినండి.

భావ వివరణ:

ఈడు ఇందరికి యేలిక (ప్రభువై వున్నాడే. ఆనాడు వాడల రేపల్లె వీధులలో తిరిగిన వాడే (ఆ గొల్లపిల్లవాడే), వీడా? అదెలా సాధ్యం?

భారపువుట్ల మీద (బరువైన వుట్లలో వున్న) పాలు పెరుగులు వారలు వట్టినవాడు (ధారలుగా కార్పించి యేడిపించిన ఆ కొంటె కోణంగియేనా) వీడు (ఈ శ్రీవేంకటేశ్వరడు), ఏమిచిత్రం!! కోరి కావలెనని (పొరబాటున కాదు) గోపికల చీరెలను కొలను గట్టున దీసి దాచి వాళ్ళ మానం మంట గలిపిన శిశువు గుర్తున్నాడా? వాడా వీడు!!

బ్రహ్మదేవుడు రేపల్లెలోని ఆవులను పెయ్యలను గోపాలురను మాయంచేస్తే తానే అవన్నీ అయిపోయి రేపల్లెలో ఒక్కరికీ తెలియకుండా నడిపి బ్రహ్మకు బుద్ధివచ్చేట్లు చేసినది ఇతడేనా? ఆ తరువాత ఆ పరమేష్టిని మన్నించి వావిరిగాచిన (ఉత్కృష్టుడై రక్షించిన వాడా, వీడు (ఈ శ్రీనివాసుడు). వావులొక్కటిగా (వావివరుసా లేకుండా) తల్లీకూతుళ్ళిద్దరినీ తన ప్రియురాండ్రను చేసికొన్న, వేవేలు నేర్చిన (అనేక రతిమర్మాలు నేర్చిన) ఆ విటుడా, వీడు (ఈ వేంకటరమణుడు) ఆహా!!

అరుదైన శ్రీవేంకటాద్రిమీద కొలువై వుండి అనేక వరములొసగే ఆ శ్రీవేంకటేశ్వరుడు వీడా (ఈ శ్రీకృష్ణుడా), వీడేనా? మరిగే (అనురాగంతో తలమునకలయ్యే) అలమేల్మంగతో మమ్ము యేలునట్టి సరసుడై వుండే ఆ జాణా (జగజ్జెట్టియా) వీడు (ఈ శ్రీకృష్ణుడు)?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment