ఈ పోస్ట్ లో విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు సరియా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
సంఖ్య : 345
పుట: 232
రాగం: నాట
నాట
59 విష్ణుఁ డొక్కఁడే విశ్వాత్మకుఁడు
వైష్ణవమే సర్వంబును
||పల్లవి||
పరమేష్ఠి సేయు బ్రహ్మాండసృష్టియు
హరునిలోని సంహారశక్తి
పరగఁగ నింద్రుని పరిపాలనమును
అరిసిచూడ శ్రీహరిమహిమ
||విష్ణుఁ||
యిలఁబంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరఁగ నారాయణుని మహిమలే
||విష్ణుఁ||
అంతటఁ గలమాయావిలాసములు
పొంతఁ బరమపదభోగములు
మంతుకునెక్కి నమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే
||విష్ణుఁ||
అవతారిక:
ఈ విశ్వమే తన ఆత్మవలె వున్న సర్వేశ్వరుడు విష్ణువు ఒక్కడే. సృష్ఠిలో సమస్తమూ ఆయనచే, ఆయన కొఱకు ఆయనదే అయివున్నది. అందుకనే సర్వమూ వైష్ణవమే అంటున్నారు అన్నమాచార్యులవారు. హరుడు, విరించి, సురపతీ… వారివారి బాధ్యతలను శ్రీహరిమహిమవల్లనే నెరవేరుస్తున్నారు. పంచభూతాలు, నవగ్రహాలు, త్రికాలములూ, నారాయణుని మహిమవల్లనే తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. ఆఖరికి పరమపదప్రాప్తి దక్కాలన్నా తిరుమలేశుని దీవెన వుండాల్సిందే. ఇంతయూ శ్రీవేంకటేశుమహిమ అంటున్నారు.
భావ వివరణ:
అనంతమైన ఈ విశ్వమంతా, అణురూపుడై ఆత్మరూపుడై విలసిల్లుతున్నది విష్ణువు మాత్రమే. స్థావరజంగములన్నింటిలో అనగా కదలికవున్న వాటిల్లోను కదలిక లేనివాటిల్లోనూ కూడా ఆ విశ్వాత్మకుడే. సర్వమూ వైష్ణవమే (విష్ణువునకు సంబంధించినదే).
పరమేష్ఠి (బ్రహ్మదేవుడు) బ్రహ్మాండమున సృష్ఠి వ్యాపారము చేయుచున్నాడు. హరునిలోని సంహారశక్తి చేత జీవకోటి నశించుచున్నది. పరగగా (ఒప్పుగా) ఇంద్రుడు జగత్పరిపాలనా బాధ్యత చేపట్టినాడు. ఆయన క్రింద వివిధ దేవతలు వివిధ శాఖలను నిర్వహింతురు. హరునికి కూడ కాలుడు, యముడు, నవగ్రహములు, భూతపిశాచగణములు ఇత్యాదివి లయకార్యమున సహకరించును. అరసి చూడ (పరికించి చూడగా) ఈ నియమబద్ధపాలనమెల్లా శ్రీహరి మహిమయే అనుననది సుస్పష్టము.
విశ్వరచనా నిర్వహణములలో పంచభూతములదే (భూమి, గాలి, నీరు, కాంతి, ఆకాశము) ప్రధానపాత్ర. ఆ పంచభూతముల గుణములన్నియు నిబద్ధతతోవున్న కారణము విష్ణువే. నవగ్రహముల విహారము (గమనకు) నియంత్రింపజేయుచున్నదీ విష్ణువే. భూత, వర్తమాన భవిష్యత్కాలములను కాలత్రయమందురు. తలకొను (పూనుకొను) ఆ కాలధర్మములను నియంత్రించుచున్నదీ ఈ నారాయణుని దివ్య మహిమయే.
అంతటగల (ఈజగమునందంతా నెలకొన్న) మాయ విష్ణుమాయ. దాని విలాసము (తీరు) తెలియుట యెవరికీ సాధ్యముకాదు. పరమపదభోగము యెవరికి, యెప్పుడు, యెలా దక్కుతుందో, యే పొఒత (యెక్కడైనా) తెలియలేరు. మంతుకునెక్కిన (ప్రసిద్ధికెక్కిన) సమస్తమూ శ్రీవేంకటేశ్వరుని మహిమవల్లనే ఆస్థితిలో వున్నవని తెలుసుకోండి. దాన్ని తెలుసుకోటానికే ఒక జీవితకాలం చాలదు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: