Itani Kitadaekaaka Yitarulu Sariyaa In Telugu – ఇతని కితడేకాక యితరులు సరియా

ఈ పోస్ట్ లో ఇతని కితడేకాక యితరులు సరియా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇతని కితడేకాక యితరులు సరియా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఇతని కితడేకాక యితరులు సరియా
సంఖ్య : 405
పుట: 273
రాగం: నాట

నాట

58 ఇతని కితఁడేకాక యితరులు సరియా
మితి లోకా లితనిమేనిలోనేకావా

||పల్లవి||

కమలనాభుని భయంకర కోపముతోడ
రమణ వేరొకరివరంబులు సరియా
తమితోడఁ దల దుంచి తగినవరము లిచ్చె
అమరఁగ నరకాసురాదులకు నితఁడు

||ఇత||

కరివరదుని పేరుగలసిన తిట్లతో
పరదేవతలమంత్రపఠనలు సరియా
నిరతి శిశుపాలునినిందకు శిక్షించి
పరలోక మిచ్చినట్టిభావము వినరా

||ఇత||

చలిమి శ్రీవేంకటేశు శరణాగతితోడ
బలిమి మించిన బ్రహ్మపట్టము సరియా
నొలిసిన ధ్రువునకు వున్నతలోక మిచ్చె
అలబ్రహ్మలోకమున కదె మీఁ దెఱఁగరా

||ఇత||

అవతారిక:

అనుగ్రహించుటలో ఇతనికితడే సాటి. లోకాలన్నీ ఈయనలోనే వున్నాయి కనుక ఇతనికి మరొకరు సరియెట్లగుదురు? అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈయన కోపగించిన అన్యదేవతల అనుగ్రహంకంటే నయమే; ఈయనకు నిందకూడా పరదేవతల మంత్రపఠనకన్నామేలు చేస్తుంది; ఈయన శరణాగతి బ్రహ్మపట్టముకంటే బలమైనది. ఈ నా మాటలు నోటిమూటలు కావు సాక్ష్యంకూడా వున్నది. నరకాసురుడు, శిశుపాలుడు, ధ్రువుడు… వీళ్ళంతా సాక్షులే అని తన వాదనను వినిపిస్తున్నారు. అన్నమయ్య వైష్ణవ పక్షపాతి అనిపించినా ఆయనవాదన అమోఘం. హరి మురిసెడి కీర్తనములు అమ్మకు చెల్లా!!

భావ వివరణ:

ఓ భక్తులారా! ఇతనికితడే సాటి. ఇతరులు ఈతని సరియౌదురా? పరిమితిలేని లోకములన్నియును ఇతని మేనిలోనివే (దేహంలో వున్నాయి) కావా? (వున్నవి కదా! అని అర్థం)

ఆ పద్మనాభుని భయంకరమైన కోపముతో, అన్యదేవతల వరదానములకంటే మంగళమే జరుగుతుంది. వారి వరములు ఈయన ఆగ్రహంతో సమానం కాదు. ఎందుకంటే నరకాసురుడి విషయంలో యేం జరిగిందో చూడండి. తమితో (ఆసక్తితో) శ్రీకృష్ణుడు నరకుని తల తెగనరికినా ఆయన వరప్రభావముచే నరకచతుర్దశి ఒక పండుగై జత్ప్రసిద్ధమైనది. కాబట్టి ఈ శ్రీహరి అమరిన ఆగ్రహమే గొప్ప మేలు చేస్తుంది.

కరివరదుడు (గజేంద్రరక్షకుడు) అయిన శ్రీహరి పేరుతో జతకలిసిన వారినిందలే మనకు అధికమైన మేలు కలుగజేస్తాయి. పరదేవతల మంత్ర పఠనం హరినింద చేసే పాటి మేలు కూడా చేయదు. నిరతి (విశేషంగా) శిశుపాలుడు శ్రీకృష్ణుని తిట్టీ తిట్టీ చివరికి మేలే పొందాడు కదా! శిశుపాలుని శిరస్సు సుదర్శన చక్రంతో తెగిక్రిందపడ్డా వాడికి హరిద్వార – పాలకపదవీ వైకుంఠ ప్రాప్తి దక్కాయి కదా!

చలిమి (చల్లని) శ్రీవేంకటేశ్వరుని శరణాగతితో, మించిన (శ్రేష్ఠమైన) బ్రహ్మపట్టము (బ్రహ్మపదవి) కూడా సరిపోదు. ఒలిసిన ధ్రువునకు (తనకు కావలసిన ధ్రువునకు) శ్రీహరి ఉన్నత లోకాలిచ్చాడు. ఎందుకంటే బ్రహ్మలోకముపైనున్న ధ్రువమండలాన్ని స్థిరలోకంగా తన భక్తునికిచ్చాడు ఆ నారాయణుడు. నేటికీ పలువురికి మార్గదర్శకమయ్యాడు ఆ చిన్నారి బాలుడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment