ఈ పోస్ట్ లో సర్వేశ్వరా నీతో సరియెవ్వరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
సర్వేశ్వరా నీతో సరియెవ్వరు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : సర్వేశ్వరా నీతో సరియెవ్వరు
సంఖ్య : 303
పుట: 203
రాగం: ముఖారి
ముఖారి
56 సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు
పూర్వపువారు చెప్పఁగాఁ బూఁచి కొలిచిఏఁగాని
||పల్లవి||
చేరి వేదములు నిన్నుఁ జెప్పఁగా వినుటేకాని
నీరూపము దర్శించేవార లెవ్వరు
ధారుణిలో నీ యవతారాలే చూచుట
ధీరత నీమహిమలు తెలిపేవారెవ్వరు
||సర్వే||
భూమివాకరిఁ జూచి నిన్నుఁ బూజలు సేయుటగాని
కామించి నీతో మాటాడే ఘను లెవ్వరు
దీమసాన నీదాసుల ద్రిష్ట మెరుఁగుటగాని
యీమేర నీదైవిక మెరిఁగేనా రెవ్వరు
||సర్వే||
వరములు నీవియ్యఁగా వచ్చి సేవించుటగాని
కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌటగాని
ఆరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు
||సర్వే||
అవతారిక:
భూమి మీద ఇంతమంది ‘దేవుడు’ అని కొలిచే వాడిని చూసిందెవరు? పోనీ ఆ దేవుడి మాటలను విన్నదెవరు? పూర్వము వారు చెప్పగా ఔనేమో అనుకోవడమే కాని ఆయన అనుభవం పొందినవాడెవడు? సర్వేశ్వరుడైన ఆయనతో సరియైనవారు లేరు. ఆయననుంచి ఏవో వరాలు ఆశించి సేవించే వారేగాని వారేగాని ఆయనను తెలుసుకోవాలని తెలుసుకోవాలని వెదకేవారేలేరు అంటున్నారు అన్నమాచార్యులవారు. ఇదికూడా తేలిక అనిపించే అతి క్లిష్టమైన కీర్తన. ఈ కీర్తన పాడినప్పుడు ఆచార్యులవారి మనోభావాలు సులభగ్రాహ్యం అనిపించుటలేదు. జాగ్రత్తగా పరిశీలిద్దాం.
భావ వివరణ:
ఓ సర్వేశ్వరా! నీతో సరియైన వారలెవ్వరు? పూర్వపువారు (మా పెద్దలు) చెప్పగా ఔనేమో నని పూచి (ప్రయత్నపూర్వకంగా) కొలుస్తున్నాను. కానీ నిన్ను తెలుసుకోలేకున్నాను.
ప్రభూ! వేదము నీగురించి వర్ణించగా వినుటయే కాని నీ రూపమును దర్శించినవారలెవ్వరు? ధారుణి (భూలోకంలో) నీయవతారాలను చూచిన వారు ఆయా యుగాలలో వున్నారేమో గాని ధీరతతో (గాఢమైన నమ్మకంతో) నీ మహిమను తెలిసినవారెవ్వరు?
దేవా! ఈ భూమి మీద వున్న మాతోడి మానవులనుచూచి వారుచేసినట్లే నిన్ను పూజిస్తున్నాను. నిజానికి కావాలని ప్రయత్నించి నీతో మాట్లాడిన మానవమాత్రుడెవడు? అంతటి ఘనులెవ్వరైనా ఉన్నారా? దీమసాన (నేర్పుతో) నీదాసులయొక్క ద్రిష్టము (అదృష్టము) యెంతగొప్పదో తెలుసుకోవటమేకాని, యీమేర (వైపున నీ దైవికము (దివ్యశక్తిని) యెరిగే వారెవరున్నారు? అనుభవేక వేద్యమైన నీ మహిమ తెలియుటెట్లు సాధ్యము?
దేవా! నీవు కోరిన వరములిస్తావనే ఆశతో దూరభారమునెంచక నీవద్దకు వచ్చి సేవించేవారేగాని, కెరలి (అతిశయించి) నీ మూర్తిని (దివ్యమంగళ రూపాన్ని) వెదకే వారెవ్వరున్నారు? ఓ శ్రీహరీ! ఓ శ్రీవేంకటేశ్వరా! అంతా నీ కరుణ పొందాలనుకొనేవారే కాని, నిన్ను అరసి (నీపై దృష్టి సారించి) నీ సుద్దులు (నీపుణ్యకథలు) అడిగేవారెవ్వరు? (వినాలని తహతహలాడేదెవరు?) హతవిధీ! నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా వున్నది తండ్రీ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు:
- ఎన్నిమహిమలవాడె యీ దేవుడు
- మియునెఱగని పామరులను మమ్ము
- అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
- శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
- నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
- వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు