Peru Narayanudavu Bembaadichetalu Neevi In Telugu – పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి

ఈ పోస్ట్ లో పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి
సంఖ్య : 162
పుట: 109
రాగం: సాళంగనాట

సాళంగనాట

57 పేరు నారాయణుఁడవు బెంబాడిచేఁతలు నీవి
నోరు మూసుకున్నఁ బోదు నున్నని నీసుద్దులు

||పల్లవి||

వేసులు మాకుఁ జెప్పె విన భారతముగాఁగ
మోస నీపాలముచ్చిమి మొదలుగాను
రాసికెక్క శుకుఁడు రవ్వగాఁ బొగడఁ జొచ్చె
ఆసలఁ బరకాంతల నంటిననీసుద్దులు

||పేరు||

రంతున వాల్మీకి చెప్పె రామాయణముగాను
సంతగాఁ దాటకాదులఁ జంపినదెల్లా
అంతకముందె నారదుఁ డవి దండెమీటి చెప్పె
యింతటా వేఁటాడి జీవహింసలు సేసినది

||పేరు||

వేడుక నజుఁడు చెప్పె వేదముగా నీవు దొల్లి
వోడక మీనై కొన్నాళ్ళుండితివంటా
తోడనే సప్తరుషులు తొల్లియునుఁ జెప్పి రదె
యీడనే శ్రీవేంకటాద్రి నిరవైతి వనుచు

||పేరు||162

అవతారిక:

నారాయణుడు అంటే నరశరీరమును పొందు భగవంతుడు అని అర్థం. ఈయన పేరు నారాయణుడు కాని ఈయన చేతలు మాత్రం బెంబాడి చేతలు. బెంబేలెత్తిపోయే పనులు చేస్తాడట ఆయన. ఆ నున్నని సుద్దులు నోరుమూసుకుంటే మాయమైపోవు. యుగయుగాలుగా అవి ప్రచారమవుతూనే వుంటాయి. భారతం వ్రాసిన వేసులు (వ్యాసులవారు), భాగవతం చెప్పిన శుకుడు, రామాయణ కావ్యకర్త వాల్మీకి, వాటిని అంతకుముందె గానంచేసి నారదుడు శ్రీహరి లీలలు పొగిడారు. సప్తఋషులు కూడా తిరుమలలో ఆయనను సేవిస్తూనేవున్నారుకదా! నీకథలు యెన్నని చెప్పగలము యెంతని చెప్పగలం, అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

ఓదేవదేవా! నీపేరు నారాయణుడు. అంటే నరరూపం ధరించినవాడవు. కాని నీ చేతలు (పనులు) బెంబాడి చేతలు. (బెంబేలెత్తించే పనులు). నున్నని నీ సుద్దులు (మనోహరమైన నీ కథలు) నోరుమూసుకున్నన్ పోదు (ఇంకొకరికి చెప్పనంతమాత్రాన తెలియకుండాపోవు). ఎందుకంటే యుగానికి ఒకడు పుట్టి వాటిని ప్రచారం చేస్తూనే వుంటాడు.

ద్వాపరయుగంలో వేసులు (వేదవ్యాసులవారు) పుట్టి మాకు వినుటకు భారతగాధను చెప్పినారు. నీవు పాలు వెన్న దొంగిలించటం, మోసంతో యుద్ధంలో పాండవులకు సాయం చేయటం మొదలైన కథలన్నీ చదివాం. రాసికెక్క (ప్రసిద్ధుడైన) శుకమహర్షి రవ్వగా (నాణ్యమైన విధమున) ఆసల (వ్యామోహంతో) నీవు పరకాంతలనంటిన సుద్దులు (పరాయిస్త్రీల పొందునాసించితివని కథలు కథలుగా) బొగడ జొచ్చె (కీర్తించాడు). అదే భాగవతమై జగత్ప్రసిద్ధమైనది.

త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి సంతగా (వల్లెవేసినట్లు) నీవు రామచంద్రునిగా తాటక మొదలైన రాక్షసులను జంపినదెల్లా రామాయణములో రంతున (పెద్దగా ధ్వనించునట్లు) చెప్పినాడు. (అంతకు ముందే (కృతయుగారంభంలోనే) నారదుడు బ్రహ్మమానసపుత్రుడై అవతరించి దండె మీటి (మహతి అనే తన వీణను మీటుతూ) నీవు వేటాడి జీవహింస (దుష్టసంహారం) చేస్తావని, యింతటా (ఈలోకమంతా) చాటినాడు.

అసలు వేదకాలంలోనే అజుడు (బ్రహ్మ) వేదమువలె నీవు మీనై కొన్నాళ్ళుండితివంటా మత్స్యపురాణంలో నీ చేతలన్నీ వోడక (వదలక) కీర్తించాడు. తోడనే (దానితోపాటే) తొల్లియును (అనాదిగా) సప్తఋషులు, యీడనే ఈ తిరుమల శిఖరాలమీద, ఈ శ్రీవేంకటాద్రిపై ఇరవైతివని (నెలకొంటివని) అనుచూ అదె (ఆ మాటనే) చెప్పిరి. మరి ఈ నాటికీ మేము తెల్లవారింది మొదలు నీపై పాడుతున్నామంటే… అది వారందరి చలువవల్లనే తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment