ఈ పోస్ట్ లో ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
సంఖ్య : 463
పుట: 312
రాగం: శ్రీరాగం
శ్రీరాగం
62 ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
కొంత నాకుఁ తదెలుపరో గురువులాల
||పల్లవి||
తనువూ హరియే తలఁపూ హరియే
వినికి మనికియును విష్ణుడే
కనుఁగొనుచూపులు కమలనాభుఁడే
యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో
||ఇంత||
లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే
వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే
చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే
యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో
||ఇంత||
వెనకను కృష్ణుఁడే వెస ముం దచ్చుతుఁడే
కొనమొదలు నడుము గోవిందుఁడే
యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను
అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో
||ఇంత||463
అవతారిక:
“అంతయు నీవేహరి పుండరీకాక్ష” అని అన్నమాచార్యులవారు హరి శరణాగతి తెలిపారు. ఇప్పుడీ కీర్తనలోనూ “ఇంతటా హరినే (శ్రీహరియే)… కాని (అంతేకాని) నన్ను యెందుననుగాన” అంటున్నారు. “గురుతుల్యులైన పెద్దలారా! ఇప్పుడు కొంత నాకు దెలుపరో (నాక్కొంచెం వివరంగా చెప్పండయ్యా!) అంటున్నారు. పుట్టిన దేహానికి పెరుగుట తరుగుట మరణించుట యే శక్తివలన జరుగుతున్నది? ఆ శక్తి యెక్కడుంది? “నేను” అని పిలుచుకుంటున్నవాడు యెక్కడవున్నాడు? మొదలు, నడుము, కొన – అన్నీ గోవిందుడే. వెనుకా వాడే, ముందునా వాడే అచ్చుతుడు. ఇంతాను (ఇదంతా శ్రీవేంకటేశుని మయము. ఇక నా స్వతంత్రం యెక్కడుందయ్యా! అంటున్నారు.
భావ వివరణ:
ఓ గురువులాల! (గురు పుంగవులారా!) కొంత నాకు దెలుపరో (నాకు కొంచెము వివరించండయ్యా!) ఇంతటా హరినే (ఈ సృష్ఠిలోని ఇదంతా శ్రీహరియే వున్నాడు). కాని (అంతేకాని నన్ను యెందునను గానను.
తనువు పుట్టినదాది పెరిగి, ముసలిదై నశిస్తున్నది. దీంట్లో శ్రీహరి వుండకపోతే అది సాధ్యమా? కనుక తనువు హరియే ఒక క్షణంలో లెక్కించలేనన్ని ఆలోచనలలో హరిలేడనగలమా? కనుక తలమపులోనూ హరియే. వినికి (శ్రవణశక్తి), మనికి (జీవనాధారము) విష్ణువే. కనుగొనుచూపులలో కూడా కమలనాభుడైన హరివుండబట్టే అంతగొప్ప దృష్టిజ్ఞానం కలుగుతున్నది. ఎనసి (వ్యాపించు స్వభావముగల) జీవుని శక్తి ఏయేరూపాలలో వుంటుందో యెవరికి తెలుసు?
ఈలోకమంతా మాధవుడే. లోనెల్లా (నాలో అంతా) మాథవుడే, వాకును కర్మము (చేయించిన కర్మయు) వైకుంఠుడే (విష్ణువే). చేకొని (నిర్వహించి) మా చైతన్యము (చేతనాశక్తి) అంతా శ్రీనారాయణ మూర్తియే. ఈకడ (ఇదిట్లయిన) ‘నేను’ అనేవాడు నాలో యెక్కడున్నాడో కదా! ఎందుకంటే చేతనలేని సుషుప్తి (గాఢనిద్ర)లో నాగురించిన జ్ఞానమే నాకులేదే. మరి అప్పుడు ఆ ‘నేను’ ఏడీ. ఎవరన్నా తట్టి లేపగానే, నన్నెందుకు లేపావు అంటున్నానే… ఎవడా “నేను”?
నా వెనుకనున్నదీ కృష్ణుడే. ముందరవున్నదీ కేశవుడే. నామొదలు, మధ్య, తుది గోవిందుడే. ఆ విధంగా నన్నంతా ఆవరించి అచ్యుతుడే అయి వున్నాడు అతిశయించగా, ఇదంతా శ్రీవేంకటేశుని మయమే. ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేసినా, నేనేం ఆలోచించినా, నేనేం మాట్లాడినా నేను కర్తనా? కానే కాదు. నా అనుగు స్వతంత్రము (నాకు ప్రియమైన స్వేచ్ఛ) యేదీ? లేనే లేదు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు:
- మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
- ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
- అంగనకు విరహమే సింగారమాయ
- మలసీ చూడరో మగ సింహము
- నిద్దిరించి పాల జలనిధివలెనే
- రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ