ఈ పోస్ట్ లో రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 10-2
కీర్తన: రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
సంఖ్య : 82
పుట: 00
రాగం: ఝుంఝూటి
ఝుంఝూటి
68 రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
రార ముద్దులాఁడ రారోరి బాలకృష్ణ
||పల్లవి||
కిందిచూపుల గిలిగించి ఆల-
మంద గొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్లవూర
వింద వైనయట్టి వేడుకకాఁడ
||రారా||
కొదలుమాఁటలనె గొణఁగుచు భూమి
సుదతుల శిగ్గులు చూరాడి
చిదుగుచేఁతలనె చెనకుచుముద్దుఁ
బెదవిచవులు చూపిన జాణకాఁడ
||రారా||
కలికితనముననె కరఁగించి కాచె
చెలుల కాఁగిటనె చెలఁగి
లలనామణియైన లకిమమ్మఁ
గలసుక శ్రీవేంకటనాథుఁడైనవాఁడ
||రారా||
అవతారిక:
అన్నమయ్య మనుమడు, చినతిరుమలాచార్యులవారు చెప్పిన బాలకృష్ణునిపై మధుర కీర్తన వినండి. ఈయన కీర్తనలు జానపదుల శైలిలో జనప్రియంగా వుంటాయి. గిలిగించి అంటే చక్కిలిగింత పెట్టటం. అయితే, కింద చూపులు చూచే ఆవులమందకు గిలగించడమేమటి? అంటే మనం గిలిగింతలు పెడితే పాపాయిలెలా సంతోషిస్తారో రేపల్లెలో ఆవులు కూడా కృష్ణను చూచి సంతోషంతో పరవశించాయన్నమాట. ఆ పిల్లాడు కొదలుమాటలు రహస్యంగా గొణుగుతాడట. దానికి ఆడాళ్ళంతా సిగ్గుతో చితికిపోతారట. ఈ చినతిరుమలయ్య అచ్చం తాతగారే. కవిత్వంలోనూ అదే చలాకీతనం. భావ వివరణ చదివి పరవశించండి.
భావ వివరణ:
మా చిన్నన్నా!! రారా! ఓ చిన్నవాడా! రారా! ఓరి బాలకృష్ణా! నిన్ను ముద్దాడెదను రారా!
నీ లీలలను యేమని వర్ణించమయ్యా! నువ్వు, కిందిచూపుల ఆలమంద (అలవాటుప్రకారం క్రిందికి చూస్తూవెళ్ళే ఆవులమందకు గిలిగించేవు (పులకరింపు కలుగచేస్తావు… అంటే… సంతోషపెడతావు). గొల్లెతల మరగించేవు (గోపికలను విరహంతో వేపుతావు). వూర జవరాండ్రను (జవ్వనులైన మీవూరి ప్రియురాండ్రను బాహాటంగానే వలపు ముగ్గులోకి దింపుతావు. కృష్ణా! నీవు విందవైనయట్టి (సంతోషపరచు) వేడుకాడవు (భోగివి).
కృష్ణా! నీవు కొదలు మాటలనే (లోపభూయిష్టమైన మాటలను) గొణుగుచు (రహస్యంగా పలుకుచూ) సుదతుల శిగ్గులు (స్త్రీల సిగ్గును) చూరాడేవు (చితుకునట్లు చేసెదవు), కొంటె వేషాలు వేస్తూ మధురాధరముల రుచి చూపిన జాణకాడవు (రసిక శేఖరుడవు).
ప్రభూ! నీవు చెలుల కౌగిళ్ళలో చెలగి (అతిశయించి) నీ కలికితనముల (నేర్పరితనమున) పరవశింపజేసెదవు. నేడు ఈ తిరుమల శిఖరాలపై లలనామణియైన లకిమమ్మ (లక్ష్మిదేవి)ని కలిసినవాడవై మా ఆరాధ్యదైవమైన శ్రీవేంకటేశ్వరుడవైనావు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: