Anganaku Virahame Singaramaya In Telugu – అంగనకు విరహమే సింగారమాయ

ఈ పోస్ట్ లో అంగనకు విరహమే సింగారమాయ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 21
కీర్తన: అంగనకు విరహమే సింగారమాయ
సంఖ్య : 415
పుట: 277
రాగం: చారుకేశి

చారుకేశి

65 అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవేయిది చిత్తగించవయ్యా

||పల్లవి||

కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల చెమరించి జలకమాడే
బలు తమకాన నీకు పక్కన నెదురువచ్చి
నిలువున కొప్పు వీడి నీలి చీర గప్పెను.

||అంగన||

సుదతి నిన్ను చూచి సోయగపు సిగ్గులను
పొదలి చెక్కుల దాకా పూసె గంధము
మదన మంత్రములైన మాటల మర్మము సోకి
ముదురు పులకలను ముత్యాలు గట్టెను.

||అంగన||

గక్కన కాగిట నిన్ను కలసి ఈ మానిని
చొక్కి చంద్రాభరణపు సొమ్ములు వెట్టే
అక్కున శ్రీ వేంకటేశ అలిమేలుమంగ నీకు
దక్కి సరసములను తలబాలు వోసెను.

||అంగన||

అవతారిక:

నీ అగ (అలిమేల్మంగ)కు విరహతాపమే గొప్ప సింగారమయ్యిందయ్యా శ్రీనివాసా! ఆమెను సమీపించి నీవే యిది గమనించవయ్యా! అని నచ్చచెబుతున్నారు అన్నమాచార్యులవారు. అమలిన శృంగారంతో జగతికి ఆదిదంపతులను కీర్తించటం మధురభక్తి క్రింద పెద్దలు తార్కాణించారు. వారు యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియులు కాదు, శృంగార సామ్రాజ్యాన్ని యేలే సామ్రాట్టు, సామ్రాజ్ఞి.
అమ్మవారికి ముదురు పులకల ముత్యాల సరాలు పేర్చిన పదకవితాపితామహునికి జోహారు అనకుండా యెలవుండగలము చెప్పండి. శృంగారాన్ని గోప్యత కొంతకప్పాలనే నా ఉద్దేశ్యము కూడా.

భావ వివరణ:

ఆహా! ఈ అంగనకు (యువతికి) తను పొందే విరహమే సింగారమై (గొప్ప అలంకరణ వలె) భాసించుచున్నది. ఓ ప్రభూ! చెంగట (ఆమెను చేరి) నీకు నీవే ఇది చిత్తగించవయ్యా (అర్థం చేసికొనుమయ్యా!)

ఈ కలికి (యువతి) లోలో నిన్ను దలచి గక్కున (వెంటనే) కరగి (పరవశించి) జలజల చెమటతో జలకమాడినట్లయినది. నీకు యెదురువచ్చినప్పుడు బలవత్తరమైన తమకాన, నిలువున కొప్పు (నిట్టనిలువుగానున్న సిగకొప్పు) ముడివీడి, నీలిచీరె గప్పెను (నల్లని వస్త్రము వంటికి కప్పినట్లుండెను).

ఈ సుదతి (యువతి) నిన్ను చూచినదే తడవుగా ఎరుపెక్కిన చెక్కిళ్ళను తెలియకుండా దట్టముగా గంధమును పూసినది. మదనమంత్రములవంటి నీ నర్మగర్భమైన మాటల భావము భామ మనస్సును తాకి శరీరము పులకలుదేరినది ఆ పులకల విస్తరింపు ముత్యాల వానవలె దట్టముగా నాక్రమించెను.

అంతలో నీవా మానినిని కౌగిట జేర్చితివి. అలసిన ఆమె నీ మెడలోని చంద్రహారమువలె భాసించినది. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ దేవి అలమేలుమంగ ఆపై నీ అక్కున దక్కి (సందిట జిక్కి) తన సరస సల్లాపములను తలంబ్రాలు పోసి నిన్ను మురిపించి తానునూ మురిసినది.

ఓ జగజ్జననీ జనకులారా! మిమ్మట్లు భావించగల ఆచార్యులవారిదే భాగ్యము. వారి కృపవలన మేమూ ధన్యులమైతిమి కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment