Niddirinchi Pala Jalanidhivalene In Telugu – నిద్దిరించి పాల జలనిధివలెనే

ఈ పోస్ట్ లో నిద్దిరించి పాల జలనిధివలెనే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నిద్దిరించి పాల జలనిధివలెనే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: నిద్దిరించి పాల జలనిధివలెనే
సంఖ్య : 343
పుట: 233
రాగం: మధ్యమావతి

మధ్యమావతి

67 నిద్దిరించి పాల జలనిధివలెనే
వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు

||పల్లవి||

వేగుదాఁకా చిత్తగించి విద్యలెల్ల నాదరించి
బాగుగా కృపారసము పంచి పంచి
యేగతిఁ బవ్వలించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని పూఁచ వుయ్యాలను

||నిద్ది||

వాలుఁకన్నుల రెప్పల వడదాఁకి తనుతావి
చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత-
కాలము కన్నులఁ దిప్పక (ప్పీఁగ?) ప్పరే దోమతెర

||నిద్ది||

సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ
కరుణించ తలచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుడయి మించి (చీ?)
విరివి నాలవట్టాలు విసరరే సతులు

||నిద్ది||

అవతారిక:

పరమాత్ముడైన శ్రీమన్నారాయణునికి వుయ్యాలలూపుతూ మధురమైన కీర్తనతో నిద్రబుచ్చుతున్నారు అన్నమాచార్యులవారు. ఉప్పునీటి సముద్రాలు ఉవ్వెత్తు తరంగాలతో భీకరంగా వుంటే క్షీరసాగరం అలలు లేకుండా ప్రశాంతంగా వుంటుందట. ఈ దేవదేవుడు పాలజలనిధి వలెనే నిద్దిరించీ… ఈయనకి ఒద్దికతో పాదాలు ఒత్తండమ్మా! అని శ్రీదేవికి భూదేవికి చెబుతున్నారు. “సకల లోకములచే ఆరాధ్యుడై అతిశయించుచున్న ఈ శ్రీరమణుని ఓ సతులారా ఆలవట్టములు విసరండమ్మా!” అంటున్నారు.
“స్వామి మధ్య మధ్య కళ్ళు తిప్పుతున్నాడు, దోమతెర సరిగా కప్పండి” అంటున్నారు. తినబోతూ రుచియెందుకు? ఆస్వాదించండి.

భావ వివరణ:

ఓ తల్లులారా! (శ్రీదేవి, భూదేవి) ఈ శ్రీరమణుడు పాలజలనిధివలెనే (క్షీరసాగరము మాదిరి) ప్రశాంతంగా (వువ్వెత్తు తరంగాలు లేక వున్నట్లు, నిశ్చలంగా నిద్రిస్తున్నాడు). ఈయనకు ఒద్దికతో (అణుకువతో) పాదములను వొత్తండమ్మా!

వేగుచుక్క కనుపించేదాకా ఈయన నిద్రపోడు. మాబోటివారి విద్యలెల్లా ఒకపక్క ఆలకిస్తూనే మమ్మల్ని తరింపజేస్తుంటాడు. మాలోవున్న శరణార్థులపై అమితదయాళువై కృపారసమును పంచిపంచీ ఇంకా అలిసిపోతాడు. పాపం ఎట్లా పడుకొన్నాడో చూడండమ్మా! ఈ యోగీంద్రవరదుడు ఎట్లు భోగించేనోకాని ఆయన వుయ్యాల నెమ్మదిగా వూచరే (వూపండమ్మా!) అప్పుడుగాని ఆయన నిద్రించడు.

స్వామి, వాలు కన్నులరెప్పలు అరమోడ్చి నిద్రిస్తున్నాడు. మీ ఒంటి వేడిమి ఆయన ఒంటికి తాకి నిద్రాభంగం కావచ్చునమ్మా! చూడండి నిద్రలో కూడా చాలుకొన్న వూర్పులు చల్లిచల్లీ (అతిశయించిన నిట్టూర్పులు) యెలా విడుచుచున్నాడో! ఆయన భక్తుల బాధలు యెప్పుడూ వుండేవే. ఈ నీలవర్ణుని గుణం మీకు తెలుసుకదమ్మా!! ఆయనకు నిద్రపట్టదు. కొంచెంసేపు ఆ కళ్ళమీద వెలుతురు పడకుండా దోమతెరకప్పి కళ్ళు తిప్పకుండా జాగ్రత్తపడ్డారంటే నెమ్మదిగా నిద్రపడుతుందమ్మా!

ఇంకాసేపట్లో మళ్లీ సుప్రభాతం అంటూ తగులుకొంటారు. వీళ్ళు వచ్చేలోగా కాస్త నిద్రపట్టితే బాగుండును. ఈ వేంకటగిరిపై సరుగున (వెంటనే) యోగనిద్ర చాలించి లోకాన్నంతా కరుణించాలని ఆయనకెప్పుడూ ఆరాటమే. సకలలోకారాధ్యుడైన ఈ శ్రీవేంకటేశ్వరుడు అరుదుగ మించీ (అపూర్వమైన ఔన్నత్యంకలవాడు) ఓ సతులారా! ఈ స్వామి సుఖంగా నిద్రించుటకు ఆలవట్టుములు (వింజామరలు) విరివి విసరరే (కాస్తగట్టిగా వీయండమ్మా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment