ఈ పోస్ట్ లో మలసీ చూడరో మగ సింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
మలసీ చూడరో మగ సింహము – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 1
కీర్తన : మలసీ చూడరో మగ సింహము
సంఖ్య: 13
పుట: 9
రాగం: హిందోళ
హిందోళ
66 మలసీ చూడరో మగ సింహము
అలవి మీరిన మాయల సింహము
||పల్లవి||
అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంత తతులు
కదిసి కానగలేని ఘనసింహము
||లలల||
మెచ్చిమెచ్చి చూడరో మితిమీరినయట్టి
చిచ్చరకంటితోడి జిగి సింహము
తచ్చిన వారధిలోన తరుణి కౌగిట జేర్చి
నచ్చిన గోళ్ళ శ్రీనరసింహము
||లలల||
బింకమున చూడరో పిరితియ్యక నేడు
అంకపు దనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలము పై
కింక లేక వడి పెరిగిన సింహము
||లలల||
అవతారిక:
మలసి చూడరో (ఉద్యమించి చూడండయ్యా!) అంటున్నారు అన్నమాచార్యులవారు. ఎవరిని చూడాలి? ఈ మగసింహమును. అది మామూలు మగ సింగము కూడా కాదు అలవి మాలిన మాయల సింగమట. అహెూబల నృసింహునిపై చెప్పిన ఈ కీర్తనలో యెన్నో తెలియని విశేషాలున్నాయి. జాగ్రత్తగా చదివి ఆకలనం చేసికొనండి. చిచ్చరకంటితో అంటే అగ్నిని కురిపిస్తున్న కన్నులతో, జిగి సింహము మెరిసిపోతున్న సింహమట. వేంకటగిరి (తిరుమల) లోనూ వేదాచలంలో (అహెూబలం) లోనూ వున్నదొక్కరేనట. ఈయన, కింక లేక (కోపమును విడనాడి) వడి పెరిగిన సింహమట. అంటే యేమిటో!
భావ వివరణ:
ఓ భక్తులారా! ఈ మగసింహము (మొండెము మగవాడు, తల సింహపుది అయిన నరసింహుడు) కనువిందు చేయుచున్నాడు. ఈయనను చూడరో (చూడండయ్యా!) ఈయన అలవిమీరిన (అశక్యమైన) మాయల సింహము (లీలలు కలిగిన నరసింహుడు).
అదిగో ఈ ఆదిపురుషుని చూడండయ్యా! ఈయనే నారాయణుడు, ఈయన ఇప్పుడు పెదయౌబళమున (అహెూబలమునందు) పెనుసింహము (పెద్ద నరసింహుని) వలెనున్నాడు. బ్రహ్మాది దేవతలుగాని వేదాంత తతులు (వేదవేదాంగములు) గాని, వెదకి (ఆయనకోసం గాలించినా) కదిసి కానలేని (సరిగ్గా కనుగొనలేకపోయిన) నరసింహము.
ఈ జిగిసింహము (కాంతులు వెదజల్లు నృసింహుడు) చిచ్చర కంటితో (అగ్నిశిఖలు వెదజల్లు ఫాలనేత్రముతో వుజ్వలముగా ప్రకాశించుచుండగా మితిమీరియున్నాడు (అతిశయించినాడు). మెచ్చి మెచ్చి (బాగుగా కీర్తించుచూ) చూడరో (ఈ స్వామి దర్శనం చేసికోండి). తచ్చిన (కిక్కిరిసియున్న) వారధిలోన (నది రెండు ఒడ్డులను కలుపు వంతెనలో) నచ్చిన తరుణిని (తన హృదయేశ్వరి అయిన శ్రీలక్ష్మిని గోళ్ళతో గిలిగింతలిడుచున్న నృసింహుని చూడండి.
ఈయన ఉగ్రనరసింహుడే, కాని భక్తవత్సలుడు. నేడు పిరుదియ్యక (భయపడక) బింకమున చూడరో (ధైర్యంగా చూడండయ్యా!) దనుజుని (హిరణ్యకశిపుని) అంకమున (ఒడిలో కూర్చొనబెట్టుకొని సంహరించాడు. ఈ నృసింహుని కొలవండి. ఈయన కింకలేక (కోపమును వుపసంహరించుకొని) వడి పెరిగెను (త్వరగా ప్రీతిపాత్రుడైనాడు). తిరుమలవేంకటేశ్వరుడు ఈయనే అహెూబల నరసింహుడు ఈ దేవుడే.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు:
- సమమతినని నీవే చాటుదువు
- నారాయణుని శ్రీనామమిది
- స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే
- కలిగె మాకిదె కైవల్యసారము
- హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
- హరిహరి నీ మాయామహిమ
- ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు