కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 4
కీర్తన : అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
సంఖ్య : 416
పుట : 279
రాగం : బౌళి
బౌళి
18 అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
తడతాఁకులతాపత్రయము మానుపుటకు
||పల్లవి||
శరణు శరణు వోసర్వేశ్వర నీకు
మరణభయములెల్ల మానుపుటకొఱకు
మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ
దురితములన్నియుఁ దొలఁగించుటకు
||ఆడియ||
దండము దండము నీకు దైవశిఖామణి
పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు
అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి
నిండు నీకరుణ నాపై నించేటి కొరకు
||అడియ||
అభయ మభయము శ్రీయాదినారాయణ
వుభయకర్మము నాకు నూడుచుట కొరకు
విభుఁడ శ్రీవేంకటేశ వినుతిసేసెద నిన్ను
శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు
||అడియ॥ 416
అవతారిక:
అద్భుతమైన శరణాగతి వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అడియను అడియను అయ్యా! అంటే నీదాసాను దాసుణ్ణి ప్రభూ! అని అర్థం. ఈ లోకంలో మూడు విధములైన తాపత్రయములు జీవిని బాధిస్తున్నవి. అవే అధ్యాత్మికము, ఆధిభౌతికము మరియు ఆధిదైవికము. ఇవి తడతాకుతుంటాయి… అంటే తత్తరపడేట్లు చేస్తాయి. ఓ అఖిలలోక నాయకా! శరణు దండము దండము, అభయం అభయం అని వేడుకొంటున్నారు. మరి శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహిస్తే అన్నీ శుభములే కదా!
భావ వివరణ:
ఓ అఖిలలోకైక నాథా! (లోకములన్నింటికీ ఒకే ఒక నాయకుడవైన శ్రీహరీ!) నేనునీ, అడియను అడియను అయ్యా! (దాసానుదాసుడను తండ్రీ!) నాకు తడతాకులు (తత్తరపాటు) కలిగించే తాపత్రయములను మాన్పుటకు నీకు మ్రొక్కెదను.
ఓ సర్వేశ్వరా! నిన్ను శరణుచొచ్చెదను. నా మరణభయములు నెల్ల (నశింపజేయు శంకలనన్నీ) మాన్పుటకు శరణు వేడెదను. ఓ ముకుందా! మాధవా! నా దురితములన్నింటినీ (పాపములన్నీ) తొలగించుటకు మొరవెట్టుచున్నాను.
ఓ దైవశిఖామణీ! (దేవతలందరిలో తలమానికమైన స్వామీ!) పండియుపండని నామతి (పరిపక్వము అయిందీ అనలేము, పరిపక్వము కానిదీ అనలేము అట్టి నా మనస్సును) పాకముసేయుట కొరకు (పరిపక్వత నొందించుటకు) దండము దండము (అనేక నమస్కారములు), అండనే (నిన్నాశ్రయించి) నీకు దాస్యము చేయువాడనైతిని. నీ కరుణ నాపై నింపి నన్ను అనుగ్రహించుటకు నీదాసుడనైతినయ్యా!
ఓ శ్రీ ఆదినారాయణా! నా ఉభయ కర్మములను (సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అనే రెండు రకముల కర్మలను) వూడుచుటకు (తొలగిపోవునట్లు చేయుటకు) నీ అభయమును వేడెదను. నాకు అభయమునిమ్ము. ఓ శ్రీవేంకటపతీ! నిన్ను వినుతి చేసెదనయ్యా! (ప్రార్థించెదను ప్రభూ!) మాకు శుభములన్నింటినీ చూపుటకు నిన్ను యెల్లవేళలా ప్రార్థించెదను తండ్రీ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: