Chekoni Koluvaro Sri Narasinhamu In Telugu – చేకొని కొలువరో శ్రీనరసింహము

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చేకొని కొలువరో శ్రీనరసింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చేకొని కొలువరో శ్రీనరసింహము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : చేకొని కొలువరో శ్రీనరసింహము
సంఖ్య : 567
పుట : 381
రాగం : సాళంగనాట

సాళంగనాట

19 చేకొని కొలువరో శ్రీనరసింహము
శ్రీకరమగు నిదె శ్రీనరసింహము

||పల్లవి||

వెడలేటివూర్పుల వేఁడిమి చల్లీ
చిడుముడికోపపు శ్రీనరసింహము
గడగడవడఁకేటిగండస్థలములు
జెడలు గదలిచీ శ్రీనరసింహము

||చేకొ||

వంకరగోళ్లవైపులు వెదకీ
చింకచూపులను శ్రీనరసింహము
హుంకారంబుల నుదధులు గలఁచీ-
నంకెల శ్రీపతియగు నరసింహము

||చేకొ||

వదనము దిప్పుచు వడి నసురమేను
చిద్రుపలు చేసెను శ్రీనరసింహము
అదివో శ్రీవేంకటాద్రి యెక్కి యిటు
చెదరక నిలిచెను శ్రీనరసింహము,

||చేకొ|| 567

అవతారిక:

అన్నమాచార్యులవారికి భజన అంటే ప్రత్యేకమైన ప్రీతి అని నా నమ్మకం. ఉగ్రనరసింహునిపై వారు చెప్పిన ఈ భజన మీ మనస్సులను ప్రక్షాళన చేస్తుంది. నిశితమైన వర్ణన అంటే (మైన్యూట్ డిస్క్రిప్షన్) అది యెలావుంటుందో ఇది వింటే తెలుస్తుంది. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టి ఈ స్తంభములో వాడిని (శ్రీహరిని) చూపించకపోతే స్వయంగా, తనే ప్రహ్లాదుని చంపేస్తానన్నాడు హిరణ్యకశిపుడు. ఆవేశం కట్టలు తెంచుకొని, పగిలిన స్తంభంలోంచి వెడలివచ్చిన శ్రీనరసింహుడు యెలావున్నాడయ్యా! అంటే… “శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు) శ్రీసతివల్లభా”! అని ప్రార్థించండి.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఇదే శ్రీనరసింహము. ఈ దేవదేవుని చేకొని (పూనుకొని) కొలువరే (మ్రొక్కి సేవించండి). ఈ నరసింహము మనకు శ్రీకరుడు (శు భములనొసగు మహానుభావుడు).

ఈ శ్రీనరసింహము చిడుముడి కోపమువాడు (తొట్రుపాటు కలుగజేసే కోపధారి). చూడండి తన కోపము చేత వెడలేటివూర్పులు (బయల్వెడలు ఉచ్ఛ్వాస నిస్వాసములతో) వేడిసెగల నెట్లా వెదజల్లుతున్నాడో గమనించండి. ఆయన గండస్థలము (రెండు చెక్కిళ్ళూ) ఉద్రేకంతో గడగడమని వణుకుతున్నాయి. అందుచేత ఈ శ్రీనరసింహము యొక్క జడలు (జూలు) పైకి క్రిందికి కదలుచున్నది.

ఈ శ్రీనరసింహము వంకరలు తిరిగిన పంజాగోళ్ళతో వాటివైపు చూసుకొంటూ (రక్తం అంటినదోలేదోనని) చింక చూపులు (భీతహరిణేక్షణములతో) చూస్తున్నాడు. ఈ శ్రీనరసింహము యొక్క హూంకారమునకు, వుదధులు (సాగరములు అన్నియును కలచీ (కల్లోలమైపోతున్నాయి.) ఈ స్వామి అంకెల శ్రీపతి (తన ప్రియసతి శ్రీలక్ష్మిని తన తొడపైననే కూర్చుండబెట్టిన శ్రీనాథుడు.

ఈస్వామి తనతొడపైనున్న హిరణ్యకశిపుని మేను (శరీరాన్ని) తన వదనము వడి తిప్పుచూ (తన మొగమును వేగంగా అటూ ఇటూ కదలించుచూ) చిద్రుపలు చేసెను. (చిన్న చిన్న ఖండములుగా చేసినాడు). ఇంత ఘోర భీభత్సం చేసిన ఈ శ్రీనరసింహము చెదరక (ఏమాత్రమూ చలించక) అదివో శ్రీవేంకటాద్రినెక్కి యిటు (ఈవిధముగా) శ్రీవేంకటేశ్వరుడై నిలిచియుండి, మనబోంట్లను అనుగ్రహిస్తున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment