Ramakrishna Nivu Nande Rajyameluchundudhuvu In Telugu – రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
సంఖ్య : 432
పుట : 291
రాగం : లలిత

లలిత

20 రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే

||పల్లవి||

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవుఁ గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే

||రామ||

ఘనకిరీటము దేను గరుడని నంపినట్టు
అనుఁగుఁగపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే.

||రామ||

పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినట్టు
అండనే ముందరఁ గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేఁట వచ్చి మరలితి-
వుండ(డు?) చోటనుండి నన్ను వూడిగాన కంపవే.

॥రామ॥ 432

అవతారిక:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవూ నీవు అక్కడ క్షేమంగా ప్రజలనేలుకోండయ్యా! ఇక్కడ ఈ కలియుగంలో మీరేం చేస్తారు? మీ మీ చోట్లకి (అయోధ్య, ద్వారకకీ) పదవే… అని చమత్కరిస్తున్నారు అన్నమయ్య. మీరు అక్కడకు పోయి, నన్ను మాత్రం వేంకటాద్రికీ, శేషాద్రికీ శ్రీవేంకటేశ్వరుని వూడిగం చేయమని కాస్త అనుగ్రహంతో పంపండయ్యా! విభీషణుణ్ణి, సుగ్రీవునీ, హనుమంతుని, గరుత్మంతుని, ఉద్ధవుని, వానరసేనను యెక్కడికెక్కడికో పంపారు కదా! అట్లాగే నన్నూ తిరుమలలో వుండరా అని పంపించండి అంటున్నారు. “అండనే ముందర కంత కంపినయట్లు” – అంటే యేమిటి? చదవక తప్పదు… భావవివరణ.

భావ వివరణ:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవున్ అందే రాజ్యమేలుచుండుదువు (నీవూ నీవూ అక్కడే ప్రజారంకముగా రాజ్యమేలుచుందువు). ఇక్కడ యేమిసేసేవు? నీ ఇరవుకు (మీమీ స్థానాలకు) నీవు అయోధ్యకు నీవు ద్వారకకు, పదవే (వెడలుడయ్యా!)

లంకలో విభీషణుని వద్దకు లక్ష్మణుని పంపి పట్టాభిషిక్తుని చేయించినట్లున్నూ, సుగ్రీవునికి కిష్కింద నేలుటకు పంపినట్లున్నూ, వాయునందనుడైన హనుమంతుని సంజీవని తెచ్చుటకు పంపినట్లున్నూ, మమ్మల్ని కూడా వేంకటాద్రి పొంతనుండి (దాపున నుండుటకు) నియోగించరాదా ప్రభూ!

నీ కిరీటమును తెమ్మని ఆనాడు గరుత్మంతుని పంపినట్లున్నూ, పట్టాభిషేకానంతరము అయోధ్య నుండి వానరసేనను తిరిగి కిష్కింధకు పంపివేసినట్లున్నూ, వేదన చెందుచున్న గోపికలవద్దకు ఓదార్చి హితబోధ చేసిరమ్మని నందవ్రజమునకు ఉద్ధవుని పంపించినట్లున్నూ, అనుపు శేషాద్రి నుండి (శేషాద్రినుండమని ఆనతీయుచూ నన్ను కూడా పంపించరాదా తండ్రీ!

నీ పెండ్లి పద్మావతితో జరుగుతుంది చూచుటకు విచ్చేయుడని పరుషలను (నీ భక్తులను) పిలువనంపినట్లున్నూ, అండనే కంతకు అంపినట్లు ముందరే నన్ను కూడా పంపించు స్వామీ! (పెండ్లిలో ఉప్పు పప్పు బియ్యమూ ఒక పెట్టెలో పెట్టి తీసికొనిపోయి మగ పెండ్లివారికి అందిస్తారు. ఆ పనికి ఆంతరంగికులను నియోగిస్తారు. దాన్ని కంతకు పంపడం అంటారు.) వెండియు (మరియు) ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు వేటకు వెళ్తే తిరుమలను చూసుకోవటానికి నీవూడిగపువాడిగా నన్ను వుంచుకోరాదా తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment