Kushika Maharaju Katha In Telugu – కుశిక మహారాజు కథ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…కుశిక మహారాజు కథ.

కుశిక మహారాజు కథ

ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుశిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుశికుడు ఎదురేగి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి “మహాత్మా! మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవియ్యండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి” అని అర్థించాడు. చ్యవనుడు “రాజా! నీ వినయవిధేయతలకు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా?” అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుశికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు.

రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకొన్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పఱచినాడు కుశికుడు. భోజనానంతరము చ్యవనుడు “రాజా! నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మాని నా పాదసేవ చేయండి. నా అంతటనేను లేవనంతవరకు నన్ను లేపకండి” అని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యం అని కుశికుడు అతని అర్ధాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు.

ఇలా 21 దివసములు గడిచాయి. మఱునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదుర పోయాడు. కుశిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత “రాజా! నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుందును. మీరిద్దరు నా రథమును గుఱ్ఱములకు బదులుగా లాగవలెను” అన్నాడు. కుశికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రక్తం వచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథంమీద వెళ్ళాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుశికుడు అతని భార్య మనస్సులలో కొంచెంకూడా కోపంగానీ వినుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు “రాజా మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. జీపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి”.

వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి! కుశికుడు “మహాత్మా! నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎఱుగుట ఎవరి తరము”? అని అన్నాడు. మఱునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుశికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచి “రాజా! మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చెద కోరుకొనుము” అని అన్నాడు.

కుశికుడు “మౌనివరేణ్య! నీ సేవా భాగ్యము దొఱకుటే మాకు వరము. మీ దయే చాలు. మాకింకే కోరికా లేదు” అన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు “ఓ రాజా! మీ వంశమునేకాక ఈ విశ్వాన్నే తరింపచేసే మునిమనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయ్యి పరమాత్మ అయిన శ్రీ రామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు” (కుశికుని కొడుకు కుశనాభుడు. అతని కొడుకు గాధీరాజు. ఆయన పుత్రుడే విశ్వామిత్రుడు).

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

సాధుసేవ యొక్క ప్రాధాన్యత శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుశిక దంపతులు బోధించారు. వారు 21 దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుశిక దంపతులు ధన్యులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment