ఈ పోస్ట్ లో కౌసల్యానందనరామ కమలాప్తకులరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
సంఖ్య : 275
పుట: 185
రాగం: సాళంగనాట
సాళంగనాట
54 కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
భాసురవరద జయపరిపూర్ణ రామ
||పల్లవి||
మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు
జనించి తాటకఁ జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి
అనుమతి పరశురామునిచేఁ గైకొంటిని
॥కౌస॥
సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి
అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి
చొప్పుతో మాయామృగము సోదించి హరియించి
కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటిని
॥కౌస॥
సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించీ
చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా
॥కౌస॥275
అవతారిక:
కౌసల్యానందనుడైన శ్రీరాముని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. సూర్యవంశతిలకుడైన ఈయన శోభాయమానమైన వరములనిస్తాడట. పరిపూర్ణమైన జయమునిస్తాడట. ఇదివరలో చెప్పినట్లే ఇది కీర్తనే కాక రామాయణ పునశ్చరణ కూడా. అన్నమయ్యకు రామకథ ఆదినుంచి చెప్పటమే అలవాటు. ఈ రాముడు అనుమతి పరశురామునిచేగైకొనెనట. అంటే.. దుష్టశిక్షణకు అనుమతిని పొందాడన్నమాట. నాయనా! నా అవతార లక్ష్యం పరిసమాప్తమయింది, దుష్ట క్షత్రం నశించి ధర్మరక్షణ క్షాత్రానికి తెరలేచింది, ఇక ధర్మరక్షణ భారం నీదే అని అనుమతినిచ్చాడట రామునికి పరశురాముడు.
భావ వివరణ:
కౌసల్యానందనుడవైన (కౌసల్యాదేవికుమారుడవైన) రామా! నీవు కమలాప్తకుల (సూర్యవంశమున జన్మించిన) రామచంద్రుడవు భాసురవరదుడవు (శోభాయమానమైన వరములనను గ్రహించువాడవు). పరిపూర్ణమైన జయమునిచ్చు రామయ్యవు.
మునుపు (ఇదివరలో) నీవు దశరథరాముడవై తమ్ముల మువ్వురితో జన్మించావు. తాటకను సంహరించి విశ్వామిత్రుని జన్నము (యజ్ఞమును) గాచినావు (రక్షించినావు) వెనుకొని (తదనంతరము) శివధనస్సును విరిచి సీతాదేవిని పెండ్లాడినావు. పరశురామునిచే అనుమతిగైకొని దుష్టశిక్షణకు శ్రీకారం చుట్టితివి. అవతారావిష్కరణకు పూనుకొన్నావు.
చుప్పనాతి అని పేరుగాంచిన శూర్పనఖను శిక్షించి స్త్రీయని వదలినావు. సొరిది (ఆక్రమములో) అనేక మంది ఋషులను రక్షించినావు. ఆవెనుక ఖరదూషణాదులను సంహరించితివి. చొప్పుతో (ఆవిధముగా) మాయామృగమును (మాయలేడిని) సోదించి హరించితివి (వెదకి సంహరించితివి. హనుమంతునికప్పి (బ్రాహ్మణునివలె వచ్చిన హనుమంతుని గుర్తించి బంటుగా నేలుకొంటివి.
సొలసి (పరిక్రమించి) వాలిని అడచితివి (సంహరించితివి) సుగ్రీవుని గూడుక (కూడుకొని) జలధిని బంధించి సేతువును నిర్మించి, లంకను జయించితివి. వెలయ (అతిశయించి) రావణాసురుని గెలిచి విభీషణునికి మన్నింపుతో లంకారాజ్యప్రదానము చేసితివి. ఆపై అయోధ్యలో పట్టాభిషిక్తుడవైనావు. ఓ శ్రీవేంకటేశ్వరా! అదయ్య నీరామ గాధ. ఇది విని తరించామయ్యా!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: