Vari Vari Bhagyamulu Vrasivunnavi Nosalla In Telugu – వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల

ఈ పోస్ట్ లో వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
సంఖ్య : 270
పుట: 181
రాగం: రామక్రియ

రామక్రియ

52 వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల
ధీరతతో నేది మేలో తెలుసుకోరో

||పల్లవి||

అట్టే కొందరు మతము లన్నియు నేకమని
పట్టవర్ధనము నెత్తిఁబెట్టి చూపిరి
జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని-
పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి

||వారి||

కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని
అంది వట్టిలలాటశూన్యము చూపిరి
కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని
ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి

||వారి||

చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు
అలమేలుమంగపతి యై యున్నవాఁడు
యిలవీర నీదాసుల కిట్టిభాగ్య రేఖలు
వలసినవారికెల్లా వ్రాసినాఁ డితఁడు

||వారి||270

అవతారిక:

“ఎంత మాత్రమున నెవ్వరు తలచిన అంతమాత్రమె నీవు” అనే అన్నమాచార్యుల వారి కీర్తనలో అన్న విషయాన్నే ఈ కీర్తనలోనూ ప్రస్తావిస్తున్నారు. ఎవరి భాగ్యంయెట్లా వుంటుందో వారి నొసటిపై విధాత వ్రాసి భూమిపైకి పంపిస్తాడని పెద్దవాళ్ళు చెబుతారు. ఎవరికేది మేలో ఏమిచెయ్యాలో ఎవరికివారే ధైర్యంతో ఆలోచించి తెలుసుకోవాలి అని అంటున్నారు శ్రీవేంకటేశుని దాసులు భాగ్యరేఖలు మాత్రం వారికెట్టాకావాలో అట్లా వ్రాస్తాడట.. ఆవిధాత. ఎందుకని? ఆయన దిష్ట అందుకని. దిష్ట అంటే అదృష్ట ప్రదాత అని చెప్పుకోవచ్చును. ఇది జటిలమైన కీర్తన అని విడిగా చెప్పనక్కరలేదు కదా!

భావ వివరణ:

ఓ ప్రజలారా! వారి భాగ్యములు (ఎవ్వరికి ప్రాప్తించెడి భాగ్యములు) వారి నొసళ్ళ (అవ్వారి నుదుటి భాగములలో) వ్రాసివున్నవి, (విధాత చేత పుట్టుకనాడే వ్రాయబడినవి). ఈ విషయాన్ని ధీరతతో తెలుసుకోరో! (ధైర్యంతో తెలుసుకోండయ్యా!) ఈ ప్రపంచంలో వేర్వేరు మతస్థులు వేర్వేరు నమ్మకాలతోవుంటారు.అ ట్టె (అదేవిధంగా) కొందరు మతములన్నియు ఏకమని (ఒక్కటేనని) పట్టవర్ధనము (నొసటిపై ధరించు ఒకరకమైన బొట్టు) నెత్తిబెట్టి (నుదుట ధరించి) చూపిరి. జట్టి (నిర్ణయించి) కొందరు జీవులు, జంగమే (శివుడే) లింగమ రూపంలో వుంటాడని జీవితాంతంలో పుట్టుకలన్నీ బూడిదయ్యేవేనని నమ్మి తమ శరీరమంతా భస్మము వ్రాసుకొని జీవిస్తారు. అది వారి నమ్మకం మనమెలా కాదనగలము? కొందరు శూన్యవాదులున్నారు. వారు పాపపుణ్యాలు రెండూ లేవంటారు. అసలు భగవంతుడే లేడు అంటారు. కొట్టకొనలయము (చిట్టచివరికి చావు తప్పదు కాబట్టి, మంచివాడు చెడ్డవాడు ఇద్దరూ చావక తప్పదు కనుక, ఏమీ అవసరంలేదని, వట్టి లలాటము (బోసిగావున్న నుదురుతో బొట్టులేకుండా శూన్యముగావున్న నొసలు) చూపిరి. కందువ (సామర్థ్యంగల) కొందరు లక్ష్మీపతియైన శ్రీహరియే అంతరాత్ముడని తమ నొసటిపై ఎచూర్ణము (తిరుచూర్ణము, పంగనామాలుగా ధరించి చూపిరి.

ఇప్పుడు శ్రీవేంకటేశ్వరుడు దిష్టము వలె (అదృష్టప్రదాతగా) చెలగి (అతిశయించగా) సిరులరాణియైన అలమేల్మంగమ్మ పతియైయున్నవాడు. అందుకని ‘యిల’ (ఈలోకంలో) వీర (వీరే… అంటే… అదేవీ ఆవిడ భర్తా) నీదాసులకు (హరిదాసులకు) ఇట్టి భాగ్యరేఖలు, వారికెల్లా వలసిన విధముగా (వారు కోరిన విధముగా) ఇతడు విధాత రూపంలో వారి భాగ్యం వారి నొసళ్ళపై వ్రాస్తాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment