Kalasaa Puramukada Gachkunnadu In Telugu – కలశాపురముకాడ గాచుకున్నాడు

ఈ పోస్ట్ లో కలశాపురముకాడ గాచుకున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కలశాపురముకాడ గాచుకున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : కలశాపురముకాడ గాచుకున్నాడు
సంఖ్య : 216
పుట: 145
రాగం: మాళవి

మాళవి

55 కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు
వలసినవరాలిచ్చీ వాయునందనుఁడు

||పల్లవి||

మాయాబిలముచొచ్చి మగుడి యంబుధిలోని-
చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి
ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని
వాయువేగానవచ్చిన వాయునందనుఁడు

||కల||

కడలిదరినుండిన కపులతోఁ గూడుకొని
వడదీరఁగా మధువనము చొచ్చి
బడి రామునికి సీతాపరిణామమెల్లాఁ జెప్పె
వడిగలవాఁ డితఁడు వాయునందనుఁడు

||కల||

రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆ విభుని సీతఁ గూర్చి అయోధ్యనుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు

||కల|| 216

అవతారిక:

కలశాపురములో వెలసిన హనుమంతునిపై చక్కటి కీర్తన చెబుతున్నారు అన్నమాచార్యులవారు. వాయుసుతుడైన ఈ హనుమంతుడు తన భక్తులకు కావలసిన వరములనిస్తున్నాడు. ఆయన అందుకోసమే కాచుకొనివున్నాడు అంటున్నారు. ఆ హనుమంతుడు సీతను రామచంద్రుని కలిపి అయోధ్యనుంచే శ్రీవేంకటేశుని గొల్చి శిష్టరక్షణకై వావిరి నిలుచున్నాడట. అంటే ‘అధికుడై” నిలుచున్నాడట. పనిలోపనిగా హనుమంతుని ప్రతాపాన్ని వివరించే రామాయణ అంతర్గత కథలను వుటంకిస్తున్నారు.

భావ వివరణ:

ఈ వాయునందనుడైన హనుమంతుడు, కలశాపురము వద్ద కాచుకొని యున్నాడు. (నిరీక్షించుచున్నాడు). శ్రీరామ భక్తులకు, తనను నమ్మిన భక్తులకు ఆయన లెక్కకు మించిన వరములను అనుగ్రహించుచున్నాడు.

సీతాన్వేషణ సమయంలో మాయాబిలం (గుహ)లో ప్రవేశించిన వానరులు దిక్కుతోచక అల్లాడుతుంటే, ఆపద్భాంధవుడై ఆదుకొన్నదీ హనుమంతుడే. మగుడి (తదనంతరం) అంబుధి దాటే సమయంలో ‘సింహిక’ నీడ వలె తననాక్రమించి రామకార్య విఘాతమునకు వొడిగడితే దానిని చంపివేశాడు. లంకలో లంకిణిని ఒక్క గుద్దుతో మట్టి కరిపించాడు. అంతలో జగన్మాత జానకీదేవిని అశోకవనంలో చూచి రామకార్యం నెరవేర్చి వాయువేగాన తిరిగివచ్చి కపివర్యుల ప్రాణాలు నిలబెట్టాడు. ఈ వాయునందనుడు జగజ్జెట్టి.

ఆపైన కడలి దరి నుండిన కపులతో (సముద్రం ఒడ్డున తనకోసం నిరీక్షిస్తున్న వానరులతో) గూడుకొని (కలసి) వడదీరగ (అలసటనుపశమించుటకు) మధువనము ప్రవేశించి నానా అల్లరి చేశాడు. అటు పిమ్మట సత్వరమే రామునికి సీతాదేవి పరిణామము (వర్తమానము) నెల్లా వివరించాడు. ఈ వాయునందనుడు వడిగలవాడు (చాలా వేగము కలవాడు).

ఆ వెనుక జరిగిన రామరావణ యుద్ధంలో ఈయన పాత్ర మరువలేనిది. రావణాది రాక్షసులనందరిని రామునిచేత సాధింపించినవాడు (నెగ్గుటకు దోహదపడినవాడు) ఈయనే. ఆ విభునికి (శ్రీరామచంద్రునకు) సీతను గూర్చి (కలిపి) అయోధ్యలోవుంచి (పునః ప్రతిష్ఠించినాడు). నేడు ఈ కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై నిలిచిన తన రాముని గొల్చుచున్నవాడై ఈనాటి ఆవశ్యకతననుసరించి శిష్ట రక్షణకై (సన్మార్గులను సంరక్షించుచూ ఈ వాయునందనుడు కలశాపురములో వావిరి (అధికుడై) నిలుచునియున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment