Miyuneragani Pamarulanu Mammu In Telugu – మియునెఱగని పామరులను మమ్ము

ఈ పోస్ట్ లో మియునెఱగని పామరులను మమ్ము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మియునెఱగని పామరులను మమ్ము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన: మియునెఱగని పామరులను మమ్ము
సంఖ్య : 162
పుట: 109
రాగం: ఆహిరి

ఆహిరి

47 ఏమీ నెఱఁగని మమ్ము నెక్కువసేసి
పామరుల దొడ్డఁజేసె భాష్యకారులు

||పల్లవి||

గతచన్న వేదాలు కమలజునకు నిచ్చి
నాతనికరుణచేత నన్నియుఁ గని
గతిలేకపోయిన కలియుగమున వచ్చి
ప్రతిపాలించఁ గలిగె భాస్యకారులు

||ఏమీ||

లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁగాచి
ఆకుమీఁదఁ దేలినయతనికృప
కాకరిమతములెల్ల గాలి ఁబుచ్చి పర మిట్టే
పైకొనఁగఁ గరుణించె భాస్యకారులు

||ఏమీ||

పంకజపుఁజేయి చాఁచి పాదపుఁబర మిచ్చిన
వేంకటేశుకృపతోడ వెలయఁ దానే
తెంకనే వొడయవరై తిరుమంత్రద్వయాన
పంకమెల్లఁ బోఁగడిగె భాష్యకారులు

||ఏమీ||

అవతారిక:

భాష్యకారుడు అంటే వ్యాఖ్యానం చేసేవాడు అని అర్థం. భగవంతుని లీలలను గురించి సోదాహరణంగా వ్యాఖ్యానించి, భక్తిని పెంపొందింపజేస్తారు భాష్యకారులు. వైష్ణవ పరిభాషలో రామానుజాచార్యుల బిరుదు అది. అన్నమాచార్యులవారి ఈ కీర్తనలో తన గురువుని కీర్తిస్తూ మా భాస్యకారులు మమ్మల్ని దొడ్డవాడిని చేశారు. నిజానికి మేము పామరులమే. ఏమీ యెఱగని మమ్ము “అన్నమాచార్యులవారిని చేసి యెక్కువ చేసి అనుగ్రహించారు అంటున్నారు. “తన్న” అంటే కోల్పోబడిన… లేక… కోల్పోయిన అని అర్థం. ఇట్లా సూటిగ నిఘంటువులో దొరకని చాలామాటలున్నాయి, ఈ కీర్తనలో.

భావ వివరణ:

ఈ భాష్యకారులు (రామానుజాచార్యులవారు) ఏమీ యెరుగని పామరులమైన (అజ్ఞానులమైన) మమ్ము ఆచార్యపదవితో దొడ్డవానిని (గొప్పవానిని) చేశారు.

గతచన్న (గతించిపోయిన, లేక, కోల్పోయిన వేదాలను కమలజునకు (పద్మసంభవుడైన బ్రహ్మకు తిరిగి ఇచ్చిన ఆతని (శ్రీహరి) దయవలన అన్నియు నెఱిగి, గతిలేని (సక్రమమైన ధర్మ మార్గంలేని) కలియుగంలో వచ్చి (అవతరించి) ప్రతిపాదించగలిగె (నిరూపించగలిగెను… అంటే భగవంతుని సాక్షాత్కరింపజేసెను) ఈ భాష్యకారులు.

లోకమెల్ల (భూలోకమంతా) వెల్లనోపోగా (జలప్రవాహంలో మునిగిపోగా) లోననే (తనలోనే) దేవతలకు ఆశ్రయం కల్పించి చిన్నారి శిశువు రూపంలో ఒక మఱి ఆకుపై తేలియుండిన ఆదినారాయణుని దయనుపొంది, కాకరిమతమ ఉలెల్ల (వ్యర్థమైన మతములను) గాలిబుచ్చి (గాలికెగిరిబోవునట్లు చేసి) ఇట్టే పరము (మోక్షమార్గము) పైకొనగా (కలుగునట్లు) చేసినవారే ఈ భాష్యకారులు.

పంకజపు చేయిజాచి (కమలములవలె కోమలమైన తన చేతులను చాచి) తనపాదములను చూపించి మోక్షమార్గం ఇచ్చిన శ్రీవేంకటేశ్వరుని కరునారసవృష్ఠితనపై కురియగా, తెంకనే (సుస్థిరముగా) ఉడయవరై వైష్ణవాచార్యుడై అవతరించారు. ఆపైన తరుమంత్రద్వయముతో (పవిత్రమైన రెండు మంత్రములతో) మా పాపపంకిలమునంతా ఈ భాష్యకారులు తొలగించినారు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment