Annitipainunnatlu Haripai Nundadu Mati In Telugu – అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి

ఈ పోస్ట్ లో అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
సంఖ్య : 124
పుట : 83
రాగం: నారాయణి

నారాయణి

48 అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా

||పల్లవి||

పులుగు నర్చిం చొకఁడు పూఁచెనాగత మెరిఁగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుట యరుదా

॥అన్ని॥

మావోడ నమ్మొకఁడు మహాజలధి దాఁటి
నానార్ధములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకొని నమ్మినవాఁడు
పూని భవవార్ధి దాఁటి పుణ్యమందు టరుదా

॥అన్ని॥

దీపమువట్టి యొకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపుల నన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశు భక్తుఁ
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా

॥అన్ని॥

అవతారిక:

ప్రహ్లాదునికి అందరిలోనూ హరియే కనుపించేవాడు. అన్నిటిలో వున్నది హరియే అని దృఢముగా నమ్మిన వానికే అది సాధ్యము. వారి వారి అభీష్టాలు నెరవేరుటతో మానవులు రకరకాల సాధనలను చేస్తారు. ప్రాపంచిక విషయాలలో కడతేరటం యేమంతకష్టం కాదు. శ్రీహరి శరణాగతుఉ వైకుంఠమ ఏ పొందగలరు; భవసాగరాన్ని సునాయాసంగా తరించగలరు; ముక్తిని కూడా పొందగలరు, ఎందుకంటే వారు పరంజ్యోతియైన శ్రీవేంకటేశ్వరుని భక్తులు కదా! అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

అయ్యో! మతి (నామనస్సు) అన్నిటిపైన వున్నట్లు హరిపై నుండదు. ఏమి దౌర్భాగ్యము!! భక్త ప్రహ్లాదునివలె ఆ శ్రీహరిని కన్నుల యెదుట ప్రత్యక్షం చేసికొనుట అరుదా (అసంభవమా?) ఏమాత్రమూ కాదు.

ఇదివరలో ఒకడు గరుత్మంతుని అర్చించి ఆయన అనుగ్రహంతో ఆగతము (జరుగబోవునది) తెలిసికొని తానే ఘనుడనని విఱ్ఱవీగినాడు. అతడే అట్లయిన, ఆ గరుత్మంతుని అధిపతియైన జలజాక్షుడు శ్రీహరిపాదముల నర్చించువాడు, ఇలలో పరమార్థము నెరుగుట ఒక గొప్ప విషయమా?

మానివాడ (కొయ్యతో చేసిన ఓడ) నెక్కి మహాసముద్రములను దాటి రకరకములైన సంపదలను పొందుటకు అనేక నటనలు చేస్తాడు ఒకడు. వాడికే అటువంటి విశిష్టత కలిగితే ఇక శ్రీనాథుని పాదముల నాశ్రయించినవాడు భవసాగరమును దాటి పుణుడగుట అరుదా (అసంభవమైన విషయమా?) ఏమాత్రమూ కాదు.

ఒకానొకడు దీపమును తన చేత ధరించి తెగని చీకటి (అంతులేని అంధకారమును) అధిగమించి తన కళ్ళతో అన్నీ చూడగలిగి సుఖములననుభవించాడు. అటువంటప్పుడు పరంజ్యోతి అయిన శ్రీవేంకటేశ్వరుని భక్తుడు, ఓపి (ఓపికతో) ముక్తిని పొంది సర్వోన్నతుడవటం అరుదా (అసంభవమా?) ఏమాత్రం కాదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment