Enni Mahimalavade Yi Devudu In Telugu – ఎన్నిమహిమలవాడె యీ దేవుడు

ఈ పోస్ట్ లో ఎన్నిమహిమలవాడె యీ దేవుడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎన్నిమహిమలవాడె యీ దేవుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: ఎన్నిమహిమలవాడె యీ దేవుడు
సంఖ్య : 177
పుట: 119
రాగం: హిందోళవసంతం

హిందోళవసంతం

46 ఎన్నిమహిమలవాఁడె యీ దేవుఁడు
కన్నులపండువలెల్లాఁ గదిసిన ట్టుండెను

||పల్లవి||

పోలింప కర్పూరకాపు పురుషోత్తమునికి
యే లీ నుండెనని యెంచి చూచితే
పాలజలనిధిలోనఁ బవళింపఁగా మేన
మేలిమి మీఁగఁడంటిన మెలుపుతో నుండెను

||ఎన్ని||

తట్టుపునుఁగుకాపు దైవశిఖామణికి
యెట్టుండె నని మరి చూచితే
చిట్టకాన రేపల్లెలో చీఁకటితప్పు సేయఁగా
అట్టిరాత్రులు మేన నంటిన ట్టుండెను

||ఎన్ని||

అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించఁగ
యేలమి శ్రీవేంకటేవు నెంచి చూచితే
కలిమిగల యీ కాంత కౌఁగిటఁ బెనఁగఁ గాను
నిలువెల్లా సిరులై నిండిన ట్టుండెను

||ఎన్ని||

అవతారిక:

ఈ తిరుమలేశుడు యెన్ని మహిమలు గలవాడె! అని ఆశ్చర్యపడుతున్నారు అన్నమాచార్యులవారు. ఆ మహిమలన్నీ కన్నులపండువగా శోభిల్లుతున్నాయని అంటున్నారు. అన్నమయ్యకి ఈ మధురమైన భావలహరియెలా వస్తుందా అనిపించి, ఏడుకొండలవాడే ఆ భావలహరిని ఆయనలో యెగసిపడేలా చేస్తాడు అని సమాధానపడ్డాను. శ్రీమహాలక్ష్మియైన అలమేల్మంగ ఈ స్వామి కౌగిట్లో కరిగే తరుణంలో ఆవిడ ఒంటిమీద నగలన్నీ ఈయనకు అంటుకున్నాయట. భళి భళీ! నీ వూహ భావాతీతమయ్యా! అన్నమయ్యా!

భావ వివరణ:

ఈ దేవదేవుడు యెన్ని మహిమలు కలవాడో యేమని చెప్పగలను? అవి కన్నులపండుగలై అన్నీ నన్ను దగ్గరై అలరించుచున్నవి.

ఈస్వామికి కర్పూరపు వంటిపై మెత్తారు. ఆకలింప (ఆరంగారంగవేసిన) ఆకాపు ఈ పురుషోత్తమునికి ఎలావున్నదంటే… పాలసముద్రములో, పవ్వళించినందున అలల తాకిడికి అంటిన లేతలుంగారు రంగు మీగడ బాగా అంటుకొని మెలపుతో (మెత్తినట్లుగా) వున్నది.

పునుగుపిల్ల నుంచి తీసిన సుగంధద్రవ్యము తట్టుపునుగు. దేవతలందరిలో శిఖామణి (తలమానికమైన) ఈ స్వామి నిమజ్జనానంతరం తట్టు పునుగు కాపు వేస్తారు (మెత్తుతారు). మరి పరికించి చూచితే అది యెట్లా వుంటుందంటే… చిట్టకాన (శృంగారలీలగా) అలనాడు రేపల్లెలో ఈ శంగారరాయుడు అనేక “చీకటి తప్పులు” సేసినందున ఆ రాత్రులన్నీ ఈయన వంటిపై ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని, అందాలమేనిపై ఆ తట్టు పునుగుకాపు ఇంకా అందము పెంచుతున్నది. నేడు అలమేల్మంగతో చేరిన ఈ మహానుభావుడు అట్టె (అదిగో) యెలావున్నాడంటే… కలిమికాంత (శ్రీమహాలక్ష్మియైన) ఆదేవిని ఈ శ్రీవేంకటేశ్వరుడు బిగి కౌగిట జేర్చగా, పెనగులాడెడి, ప్రేయసి ఒంటిపై నగలన్నీ ఈ చిలిపి శ్రీనావాసునికి అటుకొన్నవా అన్నట్లుంది. అందుచేతనే ఈయనకు నిలువెల్లా సిరులై (నగలై) నిండిపోయినవా అన్నట్లుంది. ఇకపై చెప్పే శక్తి నాకు లేదు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment