Timmireddy Makuniche Distamaina Polamu In Telugu – తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
సంఖ్య : 52
పుట : 35
రాగం : సామంతం

సామంతం

15 తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము

॥పల్లవి||

నిండినట్టిమడుగులనీరువంకపొలము
కొండలు మోఁచిన పెద్దగొబ్బరపుఁబొలము
అండనే పొలమురాజులుండేటిపొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము

||తిమ్మి||

ఆసపడి వరదానమడిగినపొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కే మునులకు రచ్చైనపొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము

||తిమ్మి||

మంచి గురుతైన రావిమానిచేనిపొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళిపొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైనపొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటిపొలము

||తిమ్మి|| 52

అవతారిక:

ఇది అత్యద్భుతమైన దశావతారవర్ణన కీర్తించే అన్నమాచార్య కీర్తన. ఎంతో మేధాశక్తి వుంటేనే కాని ఈ కీర్తన అర్థంకాదు. తిమ్మన్న అంటే వేంకటేశ్వరుడు తిమ్మిరెడ్డి అంటే పరమాత్మ అయిన శ్రీవేంకటేశ్వరుడు. బొమ్మిరెడ్డి అంటే జీవాత్మయైన అంతర్యామి అంటే క్షేత్రజ్ఞుడు. దిష్టమైన పొలము అంటే (భాగ్యముకొద్దీ సంప్రాప్తించిన సాగుచేయదగిన మాగాణి వంటి క్షేత్రము లేక శరీరము). మా భాగ్యము కొద్దీ ఆ శ్రీవేంకటేశ్వరుడు మాకు ఈ దేహాన్నిచ్చి మాజీవాత్మకు ఒప్పగించి “వొరే దీనిని సక్రమంగా సాగుచేసుకోండిరా” అన్నాడు… ఇదీ ఈ కీర్తన పల్లవి. ఇకపై ఓపికగా చదివి భావ వివరణ నాస్వాదించండి.

భావ వివరణ:

తిమ్మిరెడ్డి (పరమాత్మ) మాకు దిష్టమైన (మా భాగ్యముననుసరించి) ఒక పొలము (క్షేత్రము) సాగుచేసికొనమని, బొమ్మిరెడ్డికి (అంతర్యామియైన క్షేత్రజ్ఞునికి) ఒప్పగించినాడు. ఇక చూసుకోండి ఎన్నిరకాల పొలములు సాగులోకి వచ్చాయో.

“నిండినట్టి మడుగుల నీరువంక పొలము” ఎప్పుడూ నిండుగా నీరువుండే చోట నీట్లో వుండేదేహము.. – (అంటే మత్స్యావతారము.) “కొండలు మోచిన పెద్దగొబ్బరపు పొలము” నిస్వార్థముగా పరులకోసం పెద్ద కొండను మోసిన దేహం… – (అంటే తాబేలు లేక కూర్మావతారం.) “అండనే పొలము రాజులు వుండేటి పొలము” సూకరములుండే దేహము – (అంటే వరాహావతారము). “చెండివేసి మాకులెల్లా చెలగిన పొలము”. మాలిన్యమును లేక పాపమును చెండాడి విజృంభించిన దేహము – (అంటే నరసింహావతారము).

“ఆస పడి వరదానము అడిగిన పొలము” యాచించి వరమును పొందిన దేహము – (అంటే వామనావతారము). “బాసలతో కడునెత్రుపట్టమైన పొలము” ప్రతిజ్ఞ పట్టి ఎంతో నెత్తురు పారించిన దేహము – (అంటే పరశురాముడు). “మునులకు రచ్చై రాసికెక్కిన పొలము” మునులకు రక్షణయై విఖ్యాతిగాంచిన దేహము – (అంటే శ్రీరామావతారము). “వేసరక నాగేట వేగిలైన పొలము” విసుగులేక నాగలి ధరించు ఉద్రేకియైన దేహము – (అంటే బలరామావతారము).

“మంచి గురుతైన రావిమాని చేని పొలము” అశ్వత్థవృక్షం క్రింద మంచి ప్రసిద్ధినొందిన దేహము – (అంటే బుద్ధావతారము). “వంచిన గుఱ్ఱము దోలే వయ్యాళిపొలము” అణుకువ గలిగిన గుఱ్ఱమునెక్కి విహారముచేసిన దేహము – (అంటే కల్కి అవతారము). “యెంచగ శ్రీవేంకటేశు నిరవైన పొలము” ప్రసిద్ధికెక్కిన శ్రీవేంకటేశ్వరుడై నెలకొనిన దేహము. మరి ఆ అద్భుతమైన పొలము యెట్లాంటిదంటే లోకులందరూ దానిని పంచుకొని, శరణని బ్రతుకుతున్నారు. అవును కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment