Vaishnavula Sommu Nenu Varu Nisommulinte In Telugu – వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే
సంఖ్య : 185
పుట : 124
రాగం : సాళంగనాట

సాళంగనాట

14 వైష్ణవులసొమ్ము నేను వారు నాసొమ్ములింతే
విష్ణుఁడ నీవెట్టైన వివరించుకోవయ్యా

॥పల్లవి||

నెఱి నీబంటనా హరి నీకంటే బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక

||వైష్ణ||

ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక

||వైష్ణ||

శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నేడీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక

||వైష్ణ|| 185

అవతారిక:

విశిష్టాద్వైత మత దీక్ష స్వీకరించిన అన్నమాచార్యులవారు, బుజములపై శంఖచక్రముల ముద్రలు ధరించారు. తిరునామం నుదుటిపై ధరించారు. వైష్ణవ సిద్ధాంత ప్రచారకులై రోజుకి, కనీసం ఒక్క కీర్తన శ్రీవేంకటేశ్వరునిపై చెప్పారు. ఈ నాటికీ నాబోటి అనామకులను సైతం ఆ నామం అనుమానం లేకుండా రక్షిస్తున్నది. ఎందుకంటే.. వైష్ణవులంతా స్వామివారి సొమ్ము. అందుకే అన్నమయ్య “ఓ విష్ణుడా! నీవు యెట్లా అన్వయించుకొనినా పర్వాలేదు, నేను వైష్ణవుల సొత్తును. వారు నీసొత్తు” అని తేల్చిపారేశారు. స్వామీ! నిన్ను నాకు ఆ వైష్ణవులు పట్టిచ్చారయ్యా! అంటున్నారు.

భావ వివరణ:

ఓ విష్ణుదేవా! నేను వైష్ణవదీక్షను స్వీకరించినందున వైష్ణవుల సొమ్మునైతిని. మరి ఆ వైష్ణవులు నీసొమ్ము. అనగా నీదాసులైన వైష్ణవులకు నేను దాసుడను. ఆ విధంగా నేను నీకు చెందినవాడినే. దీనిని నీవెట్లు వివరించుకొనినా నీఇష్టమే.

ఓ హరీ! నెఱి (న్యాయంగా) నీబంటునయ్యేవాడినే కాని, నీదాసులువున్నారే వారికి వారి బలంతోపాటు నీ బలంకూడా తోడవటం వల్ల, వారు నీకంటే బలవంతులు. అటువంటప్పుడు నాకెప్పుడూ యెదురుగా వుండేవారి దాస్యం చేయుట నాకు మంచిది కదా! నేను ఇంతకు పూర్వం నిన్నెరుగను. తొల్లి (మొట్టమొదట) మా గురువులే నీ గుర్తులు చూపించితే నిన్ను గుర్తుపట్టగలిగాను. లేకపోతే నీవెవవరవో నాకేమి తెలుసు?

ఓ విష్ణుదేవా! నేను వేరే నీకు మొక్కవలసిన పనిలేదు. ఎందుకంటే, ఇంతకు ముందే నీశరణము పొందిన మా గురువులు నీపాదాలను మానెత్తినయెప్పుడో పెట్టేశారయ్యా! మాకు వైష్ణవ దీక్షనిచ్చింది అట్లాగే కదా! ఆ దీక్షే లేకపోతే నీవు యెక్కడ మేము యెక్కడ? మా రెండు భుజముల మీద నీ శంఖ చక్రముల ముద్రలు వేశారు. మాగురువులావిధంగా మన సంబంధాన్ని సంచితము చేశారు (కూడబెట్టారు) గానీ (లేకపోతే) నీవు నాకెట్లు తెలిసేవాడివి?

ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ నాడు నేను నీ సేవచేస్తున్నమాట నిజమే. కానీ నేను మొదట వారిని సేవించినందువల్లనే, నేను నిన్ను సేవించటం అన్నది జరిగింది. నాకు వారు భావమొక్కటిగా (అన్యధా శరణం నాస్తి అను ఒకే ఒక భావనతో) నిన్ను నాకు మాగురువులు పట్టిచ్చారు. అందువల్లనే మాకు ఆవలీవల పరమార్థము (ఇహపరములు రెండిటి పరమార్ధము దక్కినది). కాక నేను నిన్నెట్లెరుంగుదునయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment