ఈ పోస్ట్ లో వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 3
కీర్తన: వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
సంఖ్య : 535
పుట: 359
రాగం: సాళంగనాట
సాళంగనాట
40 వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా.
||పల్లవి||
తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలు
వేలుపుల రాయఁడైన విష్ణుని నెఱఁగరా.
||వేద||
తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జల ధమ్ము మొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కనపుదైవమైన విష్ణుని నెఱఁగరా.
||వేద||
భేదించె రావణాదిభీకరదైత్యులనెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీది వీది మెరసేటి విష్ణుని నెఱఁగరా.
||వేద||535
అవతారిక:
“వేదవట్టు” అంటే వేద ప్రవచనము చేయటం. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు వేదము తెలిసిన పండితులతో అంటున్నారు ‘ఇంకా యేమి వేదప్రవచనాలు చేస్తారు? యేమి వెదుకుతారు? యేమేమి చదువుతారయ్యా! మీకీ మాత్రం తెలియదా? వేదాంత వేద్యుడు విష్ణువుగాక వేరెవరున్నారు?’. ఈ కీర్తనలో జలధమ్ము అంటే ‘జలధియమ్ము’ అని భావించాలి. పెనువేలు అంటే బొటనవ్రేలని అర్థం. అనంతకోటి బ్రహ్మాండాలను తన బొటన వేలికింద నొక్కివేయగలడట ఈ విశ్వరూపుడు మరేమనుకొన్నారు?
భావ వివరణ:
ఓ అయ్యలారా! యిక వేదవట్టి (వేద ప్రవచనములు చేసి) యేమి వెదకెదరయ్యా! యేమి చదివేరు? వేదాంతము వేదాంతము ద్వారా, వేద్యుడు (తెలియదగినవాడు) యెవరు? విష్ణువే కదా! ఈ సంగతినెరుగరా? ఏమి వింత!!
మీరు ఆయన కృష్ణావతారం గురించి వినలేదా? ఆ శ్రీకృష్ణుడు అదె గరుత్మంతునిపైనెక్కి తోలె (వెడలినాడు). బాణాసురనెదుర్కొని చిత్తుచేశాడు. వడి (వేగముగా) కంసునిపై నెగసి (దండెత్తి) వాలెను (మీదపడ్డాడు). కేలుచాచి (చేయిచాచి) చక్రాయుధాన్ని అందుకొని శిశుపాలుని కెడపె (పడవేసెను). అట్టి లీలలు చేసిన వేలుపులరాయుడు (దైవశిఖామణి) యైన విష్ణువునెరుగరా? ఏమి ఆశ్చర్యము!
ఈయన తొల్లి (కృతయుగంలో) బలీంద్రుని (బలి అను దానవేంద్రుని) పాతాళమునకు క్రుంగునట్లు తలపై కాలుంచి త్రొక్కెను. ఈయన త్రేతాయుగములో మొక్కలా (శౌర్యముతో) జలధిని (సాగరమును) అమ్ముమొనకు దెచ్చే (బాణముయొక్క మొనకు తెచ్చి శరణాగతుని చేసెను. పక్కన భవిష్యత్తులో ఈయన తన పెనువేల (బ్రొటనవేలితో) బ్రహ్మాండమునే పగులించె బ్రద్దలు కొడతాడు. ఓ అయ్యలారా! వెక్కసపు దైవమైన (సర్వాధికుడైన దేవుడు) విష్ణువునెరుగరా?
ఈయనే శ్రీరాముడై రావణుడు మొదలైన భయంకర దైత్యులను సంహరించాడు. తన పాంచజన్యశంఖమును వున్నతముగ పూరించి జయధ్వానములు చేసెను. యుగయుగాలలో ఇవన్నీ చేసి అలసిన శ్రీమహావిష్ణువు ఈ కలియుగంలో సేదతీరుటకు (విశ్రాతికి) శ్రీవేంకటాద్రిమీద శ్రీ వేంకటేశ్వరుడై నిలిచినాడు. అదిగో తిరు వీధులలో మెరసేటి (కాంతులు వెదజల్లుతున్న) ఈ విష్ణుదేవుని ఎరుగరా? ఏమి విచిత్రం!!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: