ఈ పోస్ట్ లో మొలనూలి గొల్లెత మురియుచును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
మొలనూలి గొల్లెత మురియుచును – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 5
కీర్తన: మొలనూలి గొల్లెత మురియుచును
సంఖ్య : 372
పుట: 252
రాగం: శుద్ధదేశి
శుద్ధదేశి
82 మొలనూలి గొల్లెత మురియుచును
వలవంతఁ దిరిగీని వాడవాడలను
||పల్లవి||
సంపెఁగలతురుముతో చల్లలమ్మీనిదివొ
వంపుమోము గొల్లెత వాడలను
యింపులకోరికె తో నిందిరాపతి యెదుట
జంపుల నటనలతో సాళగింపుచును
||మొలనూ||
నొసలికస్తూరితోఁ గన్నుల నవ్వీనిదివో
వసివాడు గొల్లెత వాడలను
కసరుచు హరిమీఁదికాఁకల కోపముతో
యెసరుఁజెమట గోర యెమ్మెలఁ జిమ్ముచును
||మొలనూ||
చెలవంపుటుంగరాల చెయి వీచీనిదివో
వలపుల గొల్లెత వాడలను
కలికియై తిరువేంకటవిభుకౌఁగిట
అలసిన నటనల నల్లంతనేఁగుచును.
||లలల||
అవతారిక:
ఆ గొల్లెత మొలనులు (స్త్రీలు ప్రత్యేకముగా ధరించు మొలత్రాడు) ధరించినదై మురిపెముతోనున్నదట. ద్విగుణీకృతమైన అందంతో ఆమె వాడవాడలా విరహవేదనతో తిరుగుతున్నదట. ఆమె సంపెంగపూలు కొప్పులో తురిమింది. నొసటిమీద కస్తూరీ తిలకం ధరించింది. ఉంగరాల చేతిని విలాసంగా వూపిందట. తరువాత వేంకటపతి సందిట నర్తించి అలసినదట. ఇది సరస శృంగార కీర్తన. అన్నమాచార్యులవారి శృంగార భక్తి నభూతో నభవిష్యతి.
భావ వివరణ:
మొలనూలు (స్త్రీలు ధరించునట్టి మొలత్రాడు) ధరించిన ఆ గొల్లెత (గొల్లభామ) మురియుచును (సంతోషంతో మురిసిపోతూ) వాడవాడలా (పల్లెలోని తన పేటంతా) వలవంత దిరిగీని (మదనవేదనతో తిరుగుచున్నది).
ఆ గొల్లెతవంపు మోము గొల్లెత (గుండ్రని ముఖముగల గొల్ల భామ). ఆమె చల్లలమ్ముతుంది. ఆమె తలలో సంపెంగపూలు ధరించినది. ఆమె ఇందిరాపతియైన శ్రీకృష్ణుని వలచినది. మధురమైన కోరికలతో రగులుచున్న ఆమె కదలాడుచున్న ‘చెంపసరాలు’ ధరించి కలివిడిగా ఆ గొల్లవాడంతా తిరుగుచున్నది.
ఆమె తన నొసట (నుదురుపై) కస్తూరి తిలకమును ధరించినది. తన కన్నులతోనే ఆమె మనోహరంగా నవ్వుతున్నది. వాడ అంతా కలియతిరుగటచే వసివాడిన (అలసిన). ఆమె ముఖము నీరసముగానున్నది. హరిమీద (కృష్ణునిపై కసరుచు (విసుగుకొనుచు) కాకకోపముతో (మండించే క్రోధముతో) ఆ గొల్లెత, యెసరుజెమట (వేడిచెమటను) చిమ్ముచున్నది.
వలపులను చిందిచుచున్న ఆ గొల్లెత వాడ అంతా కలయతిరుగుచున్నది. చెలువంపుటుంగరములను (సొగసైన అంగుళీయకములను) వేళ్ళకు ధరించిన ఆమె తన చేయి (చేతిని) ఇదిగో ఎలా వీచుచున్నదో చూడండి. ఆమె కలికియై (అందాలరాసియై) శ్రీవేంకటేశ్వరుని కౌగిట కరిగి నర్తించుచు అటూఇటూ యేగుచు (నడచుచు) మిక్కిలి అలసినది.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: