Aevvarum Ganani Vamdu Yashoda Gane Natte In Telugu – ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
సంఖ్య : 316
పుట : 213
రాగం : శంకరాభరణం

శంకరాభరణం

36 ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె

||పల్లవి||

ఘనయోగీంద్రులమతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె.

||ఎవ్వ||

అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికలపాలఁ జిక్కినాఁ డట్టె.

॥ఎవ్వ||

యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టే
అంది కృష్ణావతారముయినట్టిదేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె.

||ఎవ్వ|| 316

అవతారిక:

ఒకరోజు యశోదకు కృష్ణయ్య అల్లరి వినిపించడం లేదేమిటబ్బా! అని కొడుకును రహస్యంగా చూద్దామని మెల్లిగా నక్కి చూసిందట. అక్కడ పడుకొన్నది ఆవిడ కొడుకా? ఆయన, పరమేష్ఠితండ్రి, ఆదినారాయణుడు. కొంచెం తెరుచుకొనియున్న ఆస్వామినోట్లోంచి లోకాలన్నీ కనిపిస్తున్నాయట. దిమ్మతిరిగి పోయిందావిడకి. ఆయన ఎవ్వరూచూడలేని శ్రీమన్నారాయణుడు. భయంతో చేతులు జోడించిందా గొల్లది. చటుక్కున లేచి “అమ్మా”! అన్నాడు. అంతా కలలాగా మరచిపోయింది ఆ వెట్టితల్లి. అన్నమాచార్యులవారి ఈ అద్వితీయ కీర్తనకి ఈ పిట్టకధే మూలభూతి. దీనిని భావించి తరించండి.

భావ వివరణ:

ఆహా! ఏమి ఈ యశోద భాగ్యము! ఎవ్వరూ గాననివాడు (అగోచరుడై యెవ్వరికీ కనుపించని పరమాత్మ) ఈమె పొత్తిళ్ళలో పవ్వళించినాడే!! ఈ దేవదేవుడే, పితామహుడైన బ్రహ్మకే కన్నతండ్రియా? అట్టె (అతిసులువుగా) బాలుడయ్యెను. ఏమి ఆశ్చర్యము.

ఘనులైన యోగీశ్వరుల మదిలోకూడా కట్టుబడనివాడు, ఓహెూ! ఈనాడు రేపల్లెలో ఒక పనిలేని రోటికి కట్టబడినాడే!! సుకుమారమైన ఆయన పాదములెలావుంటాయో చూడాలని తహతహలాడే దేవతలకు తన అరిపాదములను చూపనట్టిదేవుడు ఈరోజు రేపల్లెలో ఒక కొయ్య బండికి చూపించి సూటిగా తన్నాడే!! ఏమి ఆ శకటాసురుని అదృష్టము!!

అమృతము కొరకై క్షీరసాగరమును చిలికించి, నిస్వార్ధంగా దేవతలందరికీ పంచిపెట్టించిన పురుషోత్తముడు, తానే తమితో (ఆసక్తితో) గోపికల ఇండ్లలో వెన్నదొంగిలించుచున్నాడే!! గుమురై (గుమిగూడిన) దేవదానవ కోట్లకు కూడా చిక్కని శ్రీమన్నారాయణుడు, నేడు బృందావనమున గొల్లభామలకు భ్రమకలిగినవానిలా చిక్కినాడే!! ఏమివింత!

ఇందుగలడు, ఇందులేడు అని ఇదమిద్ధంగా యెంచి చూపశక్యముకాని సర్వాతర్యామి ఈ రేపల్లెవాడలలో యెంత అందముగా ఆడుచున్నాడో చూడండి. ఆనాడు (ద్వాపరయుగమున) కృష్ణావతారమునంది పైలీలలన్నీ చేసినట్లే నేటి కలియుగంలో, యిందున (ఈ తిరుమలలో) శ్రీవేంకటాద్రి నెక్కి శ్రీవేంకటేశ్వరుడై నిలిచియున్నాడే!! ధన్యోస్మి తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment