ఈ పోస్ట్ లో ఘనుడాతడా యితడు కలశాపురముకాడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఘనుడాతడా యితడు కలశాపురముకాడ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
సంఖ్య : 302
పుట: 204
రాగం: గుండక్రియ
గుండక్రియ
72 ఘనుఁడాతఁడా యితఁడు కలశాపురముకాడ
హనుమంతుఁ డితఁడా అంజనాతనయుఁడు.
||పల్లవి||
పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె
అడరి దానవుల హనుమంతుఁడు
బెడిదంపుఁ బెనుదోఁక బిరబిరఁ దిప్పి మొత్తె
అడఁగ మాల్యవంతు హనుమంతుఁడు
||ఘనుఁ||
దాకాల మోఁకాలఁ దాటించెఁ గొందరి
ఆకాశవీధినుండి హనుమంతుఁడు
పైకొని భుజములఁ బడఁదాఁకెఁ గొందరి
ఆకడ జలధిలోను హనుమంతుఁడు.
||ఘనుఁ||
ఆరుపుల నూరుపుల నందరిఁ బారఁగఁ దోలె
ఔరా సంజీవికొండహనుమంతుఁడు
మేరతో శ్రీవేంకటాద్రిమీఁదిదేవునిబంటు
ఆరితేరినబిరుదు హనుమంతుఁడు.
||ఘనుఁ||302
అవతారిక:
కలశాపురంలో తనయెదుటనున్న ఘనమైన హనుమంతుని యెదుట అన్నమాచార్యులవారు ఈ కీర్తనను వినిపిస్తున్నారు. ఆనాడు లంకలో రాక్షసమూకనుయెట్లు చీల్చి చెండాడినాడో వర్ణిస్తున్నారు. నేటి మన దుస్థితి యేమంటే అచ్చతెలుగు కీర్తనకి, సంకరతెలుగులో వివరణ ఇచ్చుకోవలసిన వస్తున్నది. “ఆరుపుల నూరుపులనందరి బారగ దోలె”… ఆయన హూంకారముతో కూడిన గట్టి నిశ్వాసవదిలి అందరూ కకావికలై పారిపోయేట్లు చేశాడట. ఇట్లా అడుగడుగునా తేలికగా తెలియని తెలివైన తెలుగు తికమకలు దిట్టంగావున్నాయి ఈ కీర్తనలో.
భావ వివరణ:
ఆనాడు లంకలో అన్ని ఘనకార్యములను చేసిన ఆ ఘనుడైన హనుమంతుడు ఆతడా, యితడు (ఈ కలశాపురంలో మనయెదుటనున్న ఆంజనేయుడు). ఏమి ఆశ్చర్యము!
ఈయన సీతాన్వేషణలో లంకలోని రాక్షసులను యెట్లు చితక్కొట్టాడో వినండి. ఆయన తన మోచేతితో కొందరిని కుమ్మి చంపాడు. కొందరిని చేతిలోపలి భాగంలో నొక్కి చంపాడు. అడరి (ఆ విధంగా అతిశయించి) ఆ హనుమంతుడు దానవులను చంపాడు. అప్పుడు మాల్యవంతుడనే రాక్షసుడు ఆయనపైకి వెళ్ళాడు. బెడిదంపు (భయంకరమైన) పెనుతోక (పెద్దతోకతో) బిరబిర తిప్పి అణిగిపోయేట్లు మొత్తి వాడిని ఆ హనుమంతుడు చంపేశాడు.
తన కాలు (దాగుకాలు) కాలివెనుక భాగంతో) తో తన్ని కొందరిని, మోకాలితో కుమ్మించి కొందరిని తాటించినాడు (కొట్టినాడు), ఆ హనుమంతుడు. ఇదంతా ఆయన ఆకాశవీధిలోనే చేశాడు. ఆ కడ (అప్పుడు) కొందరిని పైకొని (మీదపడి) భుజములతోపడదోసి జలధిలో చంపేశాడు. హనుమంతుని మారణకాండనేమని వర్ణింతుము?
అనంతరం ఆ హనుమంతుడు “ఆరుపుల నూరుపుల నందరి బారగదోలె” (తన హూంకారముతో కూడిన గట్టి నిస్వాసముతో అందరినీ చిందరవందరగా పారిపోయేట్లు చేశాడు. ఔరా సంజీవి కొండను తెచ్చిన ఈ హనుమంతుడు జగజ్జెట్టి. మేరతో (ఆ క్రమంలో) వేంకటాద్రిమీది దేవుడైన వేంకటేశ్వరుని బంటు అనే ఆరితేరిన బిరుదుతో ఈ హనుమంతుడు శోభించుచున్నాడు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: