ఈ పోస్ట్ లో బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
సంఖ్య : 58
పుట: 39
రాగం: బౌళి
బౌళి
73 బోధింపరే యెరిఁగినబుధులాల పెద్దలాల
శ్రీధరునిమాయలలోఁ జిక్కితిమి నేము.
||పల్లవి||
దైవమును నొల్లము ధర్మమును నొల్లము
దావతిసంసారముతో తగులేకాని
భావపుభవబంధాలభయమూ నెరఁగము
వేవేలు విధులే కాని వేగిలేచి నేము.
||బోధిం||
ముందు విచారించము మొదలు విచారించము
పొందేటిసతులతోడిభోగమేకాని
చెందినమనసులోనిచింతలను బాయము
మందపుమదమే కాని మాపుదాఁకా నేము.
||బోధిం||
పరమూఁ దడవము భక్తీఁ దడవము
అరిది ధనముమీఁది ఆసలేకాని
ఇరవై శ్రీవేంకటేశుఁ డేలుకొనెఁ దానే నన్ను
నిరతి నెరఁగనైతి నే నించుకంతాను.
||బోధిం||
అవతారిక:
“ఓ పెద్దలారా! మేము శ్రీధరుని మాయలో చిక్కుకుపోయామయ్యా! దిక్కు తెలీటంలేదు. మాకు యేమి చెయ్యాలో చెప్పండయ్యా!” అంటున్నారు జాలిగా అన్నమాచార్యులవారు. దేవుణ్ణి నమ్మం, ధర్మం ఒప్పుకోము, భవబంధాలలో అల్లాడిపోతున్నాం. ముందు విచారించము, మొదల విచారించము యెంతసేపూ వనితాభోగమే. మందపుమదమే మాపుదాకా, పరము వద్దంటాము. భక్తిసున్నా. ఏమిటీ దౌర్భాగ్యం!! తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన ఇది. జాగ్రత్తగా చదవండి.
భావ వివరణ:
ఓ పెద్దలారా! బుధులారా! (పండితులారా!) మీరు అన్నీ యెరిగినవారు కదా! నాకు బోధింపరో (బోధపరచండయ్యా!) నేము (మేము) శ్రీధరుని మాయలలో చిక్కుకుపోయాం.
మేము దేవుని వొల్లము (అంగీకరించము). ధర్మమునంగీకరించము. దావతి సంసారముతో (దుఃఖభాజన ప్రపంచపు తగులే (అనుబంధములే) కాని, భవబంధాల భయంలేనేలేదాయెను. అనేక మార్గాలనవలంభిస్తాము కాని, వేగిలేచేము (ప్రతిదానికీ తొందరే). మాకేమి చేయాలో తెలియుటలేదు.
మాకున్న ఇంకొక దురలవాటు ముందుగా విచారించము (కార్యము ప్రారంభమునకు ముందుగ ఆలోచన చేయము). మొదలు విచారించము (కార్య ప్రారంభమునందును ఆలోచించము). మాకు లభించిన భామలతో భోగాసక్తే కాని ఇంకొక ఆలోచనేవుండదాయెను. ఈ వ్యవహారాలవల్ల మనస్సులో యెప్పుడూ దిగుళ్ళే, ఆలోచనలే. వాటిని బాయము (వదలము). మాపుదాకా (ముసలివాళ్ళమై జవసత్వాలు వుడిగేదాక ) మందపు మదమే (దట్టమైన గర్వమే…) కాని మరొకటి లేదు. మేము భ్రష్టులమైపోయాము.
అవన్నీ అటుంచి, పరము మోక్షము) అంటే యేమిటో తడవము (చలించము) భక్తి గురించిన ఆలోచనేలేదు. అరిది ధనముపై ఆసలే (అరుదుగా లభిస్తుందని ధనముపై వ్యామోహమే)… కాని భగవంతుని మాటే తలవము. ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకనాడు శ్రీవేంకటేశునికి ఈ జీవిపై దయపుట్టింది. ఆయన ఇరవై (నా తలపులలో నెలకొని) తానే నన్ను యేలుకొనె. నేను ఇంచుకంతా, నిరతినెరుగనైతి (కొంచెము కూడా అత్యాశ లేక) జీవించుట ప్రారంభిచితిని. ఆ విధంగా ధన్యుడనైతిని.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: