Narayanuda Ninamamai Mantrinchivesi In Telugu – నారాయణుడ నీనామమె మంత్రించివేసి

ఈ పోస్ట్ లో నారాయణుడ నీనామమె మంత్రించివేసి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నారాయణుడ నీనామమె మంత్రించివేసి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: నారాయణుడ నీనామమె మంత్రించివేసి
సంఖ్య : 494
పుట: 332
రాగం: సామంతం

సామంతం

75 నారాయణుఁడ నీ నామము మంత్రించివేసి
పారేటియీజంతువులభ్రమ విడిపించవే.

||పల్లవి||

మదనభూతము సోఁకి మగువలుఁ బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళఁ జించుకొంటా
కొదలు కుత్తికలనుఁ గూసేరు జీవులు.

||నారా||

పంచభూతములు సోఁకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుఁబూసుకొంటాను
అంచెల వీడెపురస మందు నిందు గురియుచు
యెంచి ధనముపిశాచాలిటైరి జీవులు.

||నారా||

తమితోడ మాయాభూతము సోఁకి బహుజాతి-
యెముకలుఁ దోలు నరా లిరవుచేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ జేర కెక్కడైన
తముఁ దా మెరఁగరింతటాఁ జూడు జీవులు.

||నారా||494

అవతారిక:

‘పారేటి’ జీవులు అంటే జీవనసంగ్రామంలో కకావికలై పరుగులు పెడుతున్న జీవకోటి (మనబోటివాళ్ళం) అన్నమాట. ఎందుకు వీళ్ళంతా పరుగులు పెడుతున్నారు? భ్రమకులోనైనందువల్ల. స్త్రీ మీద భ్రమ, ధనంమీద భ్రమతో, మాయ అనే భూతంపట్టి వాళ్ళు పరమాత్మ అంశ అనే జ్ఞానం లేక ‘నేను’ అంటే ఎముకలు నెత్తురు మాంసం నరాలు వున్న 60 కిలోల దేహం అనుకొంటున్నారు. మరి ఇక వాళ్ళు నారాయణుడైన శ్రీవేంకటేశ్వరుని చేరితే ఏమవుతుంది? తామెవరో తెలుసుకోగలుగుతారు.

భావ వివరణ:

ఓ శ్రీమన్నారాయణుడా! నీనామమును “మంత్రించి” ప్రయోగించినచో, పారేటి (జీవనయానంలో పరుగులు పెడుతున్న) యీ జంతువుల భ్రమలన్నీ విడిపించవే (తొలగించవయ్యా!)

ఈ జీవులకు ‘మదన భూతము’ సోకినది (మన్మథుడు అనే భూతం పట్టుకొన్నది). ఆడామగా అనే వివక్ష లేక విరిదలలై (తొలగిన విచక్షణ కలవారై) అంగమొలలై (దిగంబరులై) పెదవులు రక్తాలు చిమ్మేదాకా వీర్చి (చిమ్మించి) గోళ్ళతో గీరి, కొదలి (అతిశయించి) అవతలివారి పొందుకోసం గొంతుకలు కోసుకునే దాకా తెగిస్తారు. ఎంత దౌర్భాగ్యం!!

ఈ జీవులకి ప్రకృతిలో నున్న పంచభూతములు సోకి వశులను చేసికొని భ్రమలకు గుఱిచేసి అజ్ఞానులను చేస్తున్నవి. మన్ను పూసుకొనేవాడు ఒకడైతే తాంబూల రసాస్వాదనతో బ్రతికేవాడు ఇంకొకడు. ధనపిశాచి పట్టి జీవులు ఇటైరి. ఉచ్ఛము నీచమూ లేదు. ధనంకోసం చేయరాని పనులు చేస్తారు. ఎంత హేయమైన బ్రతుకులు!!

తమితోడ (అతి ఆసక్తిగల) ఈ జీవులకు భూతం పట్టింది. దానిపేరు “మాయా భూతము”. దానివల్ల ఈ జీవుడు వాడెవరో తెలుసుకోలేకున్నాడు. ఓ శ్రీవేంకటేశ్వరా వాడు ‘నేను’ అనుకొంటున్నది తన దేహాన్ని అనేభ్రమలో వున్నాడు. దేహంలోని తోలు, నరాలు, యెముకలు వాడి జాతి అని అనుకొంటున్నాడు. నేను అంటే జీవుడు. వాడు నిజానికి పరమాత్మ ప్రతిరూపమే. కానీ మాయవాడిని ఆవరించి, అజ్ఞానియై అనేక భ్రమలకులోనై అరిషడ్వర్గ పీడితుడై దాని పర్యవసానంగా జననమరణాల విషవలయంలో చిక్కాడు. వీడికి ఏడుకొండలవాడి దయకలిగేదాకా ఈ భ్రమలు తప్పవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment