ఈ పోస్ట్ లో దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 3
కీర్తన: దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
సంఖ్య : 422
పుట: 284
రాగం: నారాయణి
నారాయణి
41 దేవ నీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
శ్రీవిభుఁడ నీవేకాదా చిత్తములోనయ్యా.
||పల్లవి||
దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదు:ఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా.
||దేవ||
విని కిందరి కొకటే విషయాలు నొకరీతే
మునిఁగేటిజాతిభేదములివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే
పెనఁగేటిగుణముల పెక్కు జాడ లేలయ్యా.
||దేవ||
అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింక సేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా.
||దేవ||422
అవతారిక:
అన్నమాచార్యులవారి కీర్తనలలో పల్లవి చాల చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. “ఓ దేవదేవా! శ్రీకాంతుడా! పైకి చూడటానికి జరిగేవన్నీ నీకు పక్షపాత బుద్ధి వున్నదా అనే భ్రమ కలిగిస్తాయి. లేకపోతే అనుక్షణం భ్రమల లోనే వుండే ఈ లోకులలోని ‘వెల్తి’ (తక్కువ భాగ్యమో, యెక్కువ భాగ్యమో) యెందుకు కలుగుతున్నాయి? మరి మా అందరి చిత్తములో అంతర్యామివి నీవొక్కడివే అయితే ఈ హెచ్చుతగ్గులెందుకు వస్తున్నాయి?” మా శారీరక ధర్మాలు ఒక్కటే శారీర దారుఢ్యాలు వేరు, వినేది ఒకటే అర్థమయ్యేది వేర్వేరు, ఆకలి వొకటే అరుగుదల వేర్వేరు. ఒకడిది మంచి గుణం ఒకడిది చెడ్డగుణం యెందుకిలా? యేమిటి నీ మాయ?
భావ వివరణ:
ఓ దేవదేవా! నీ పక్షపాత వైఖరియో లేక తిరిగేలోకుల వెల్తియో (భ్రమలకు లోనయ్యే లోకుల యొక్క భాగ్యప్రాప్తిలోని విభేదమో) తెలియకుండా వున్నది. మా అందరి చిత్తములో అంతర్యామిగా నీవే వుండగా ఓ శ్రీవిభుడా! ఇలా యెందుకు ఒకరు గొప్ప ఒకరు తక్కువ అవుతున్నారు?
దేవా! ప్రపంచంలో మానవులందరికీ రేయింబవళ్ళు ఒక్కలాగే వుంటాయి కదా? మరి వారి సుఖదు:ఖాలు ఒకేలా యెందుకుండటంలేదు? హెచ్చుతగ్గులెందుకు? అన్ని జీవుల భవము (పుట్టుక) ప్రాణములు ఒక్కటే కదా? మరి లోకంలో పాపపుణ్యములనుభవించడంలో తేడా యెందుకు వస్తున్నది?
ప్రభూ! అందరి వినికి (వినేశక్తి) ఒక్కటే… విషయాలు (విషయములపై ఆసక్తీ) ఒక్కటే, మరి, మునిగేటి (అంతులేని) జాతిభేదము యెందుకు కలుగుతున్నది. అనయము (నిరంతరం) మన చూచే శక్తి ఒక్కటే… ఆకలిదప్పులూ ఒక్కటే కాని మనలో పెనవేసుకొన్న గుణాలలో తేడాలన్నీ యెందుకు వుంటున్నవి?
ఓ శ్రీవేంకటేశ్వరా! మా అందరిలోనూ అంతర్యామిగా చరించేది. నీవొక్కడివే, మరి మాకు వేర్వేరు చింతలు, వేర్వేరు చిలుగులు (ఉపద్రవములు) యెందుకు కలుగుతున్నాయి? ఏమిటి నామాయ? ఏమిటీ విచిత్రం? అందుకే నీకు శరణు అంటున్నాను. ఓ అయ్యా! అందుకే నీవు నన్ను నిరంతరం కాపాడుతున్నావు తండ్రీ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: