Neyyamulallo Nerello In Telugu – నెయ్యములల్లో నేరేళ్ళో – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నెయ్యములల్లో నేరేళ్ళో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నెయ్యములల్లో నేరేళ్ళో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : నెయ్యములల్లో నేరేళ్ళో
సంఖ్య : 179
పుట : 123
రాగం: దేసాళం

దేసాళం

86 నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో

||పల్లవి||

పలచని చెమటల బాహుమూలముల
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి
దులిపేట నీళ్ళతుంపిళ్ళో

॥నెయ్యము॥

తొటతోటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో

॥నెయ్యము॥

గగల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁ కులినుపగుగ్గిళ్ళో

॥నెయ్యము॥

అవతారిక:

జానపదులు కోలాటములాడుతూ పాడే మధురమైన కీర్తన అన్నమాచార్యులవారి ద్వారా ఆస్వాదించండి. అల్లోనేరేడు పళ్ళవలె మధరములైన నెయ్యములు (స్నేహములు) ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళురు చున్నవి. ఇది ఆట ప్రధానమైన కీర్తన. బాహుమూలములలో పలచని చెమటల గురించి వర్ణించగలిగిన సత్తా అన్నమయ్యకు మాత్రమే వున్నదని వేరే చెప్పక్కరలేదు. ఇది సుగ్రాహ్యము అనుకోవడానికి వీలులేని కీర్తన. జాగ్రత్తగా చదివితేకాని అర్థంకాదు, మరి.

భావ వివరణ:

మా నెయ్యములు (స్నేహము) అల్లోనేరేడు పండ్లవలె మధురమైనవి. ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళూరెడ్డి మా అనుబంధం దినదిన ప్రవర్ధమానమవుగాక!

బాహుమూలములలో పరిఢవిల్లిన లే చిత్తడి చెమటల చెలమలలో అందములు అలంకార ప్రాయమైనవి. ఈ నృత్యమువలన చెమట ఇంకా అధికమై, థళథళమను (తళతళమని) మెరయు ముత్యములను చెరుగు సురటి (విసనకఱ్ఱ), దులిపేటి నీళ్ళతుంపరల వలె వున్నవి.

ఈ గోవిందుడు తన విరహంతో ఆమెనెంత బాధిస్తున్నాడంటే, ఆమె కన్నుల నుండి తొట తొటమని కన్నీరు కురియుచున్నది. ఆమె అది తాళలేక అలుక వహించినది. ఆ చిటిపొటి (చిన్న చిన్న) అలుకలు చివరికి చిరునవ్వులై రావిపండురంగులోనున్న నీ వన్నెల అధరమునాస్వాదించి | గుక్కిళ్ళువేయుచూ (గుటకలు మింగించినది). అలుకలు మరింత మధురమైనవి.

ఓ గరగరికల (నిర్మలుడవైన) వేంకటేశ్వరా! నీ కౌగిటిలో పరిమళములు వెదజల్లు మీ ఒంటిపై పూతలు ఒండొరులకు ఎలా వున్నాయంటే మన్మథుని వింటినుండి వెలువడిన కమ్మని పుష్పబాణములు కూడా గురిగా తాకునట్లు మీపై వేసిన ఇనుప గుగ్గిళ్ళవలెనున్నవి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment