Sinnavadavani Nammaselladuninnu In Telugu – సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను

ఈ పోస్ట్ లో సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను
సంఖ్య : 15
పుట: 11
రాగం: భైరవి

భైరవి

88 సి (చి)న్న వాఁడవని నమ్మ సెల్లదు నిన్ను
సిన్నైన యాటదెల్ల సిక్కు సీరై పోయను

||పల్లవి||

అవుర బాలకిసు రాయఁడ నీవు సంటిపాలు
సవులంటా నెత్తురెల్ల సప్పరించఁగా
కవకవ నవ్వి నవ్వి కన్నులు దేలగిలఁగ
సవరన్ని (ని) యాటదెల్ల సప్పుసారై పోయను

||సిన్న||

రారా గోపాలకిసునరాయ నీవదె గొల్ల-
వారి మగుపల సూవు (పు) వల్లె వేయఁగా
సూరఁబోయె రేపల్లె సొక్కని యా గుబ్బెతల-
సేరలంతల కన్నుల సిన్ని సిన్ని సిగ్గులు

||సిన్న||

కిన్నెర వెంకటగిరి కిసునరాయఁడ నీవు
వన్నెలుగ వీధి వీధి వాయించఁగా
మిన్ను దాఁకి లోకానకు మేఁటియైన లకిమమ్మ
నిన్ను సేరి సరుగన నిలుసుండే సొక్కెను

||సిన్న||

అవతారిక:

జానపదుల బాణీలో సాగిన కృష్ణలీలామృతం వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో ఆయన వాడిన బాలకిసున రాయడు, సిక్కుసీరై పోయను, సప్పుసారైపోయను వంటి మాటలు జానపద సాహిత్యంలో వుంటాయేమోకాని నేటి తెలుగు పాఠకులకు సుపరిచితాలు కాదు. ఈ బాలకృష్ణుని చిన్నవాడని నమ్మటానికి వీలులేదట. నేడు ఈ వెంకటగిరి కిసునరాయడు వీధివీధిలో కిన్నెర వాయిస్తుంటే లకిమమ్మ ఆయనను సేరి సరుగున నిలుసుండిందట. ఈ పాటికి మీకూ కొంత బుర్రకెక్కింది కదా!

భావ వివరణ:

ఓ కిసునరాయా! (కృష్ణరాయా!) నిన్ను చిన్నవాడవని నమ్మసెల్లదు. (నమ్మకూడదు). సిన్నైన యాటదెల్లా (యుక్తవయసు వచ్చిన ప్రతి ఆడపిల్లా) | నీమూలంగా, సిక్కు సీరై పోయను (సిగ్గుతో చితికిపోయింది).

అవుర బాలకిసునరాయడ (ఔరా! బాలకృష్ణరాయా!) నీవు సంటిపాలు (స్తన్యము) రుచిగావుంటుందని పూతన స్తనము చప్పరించి నెత్తురంతా పీల్చేస్తే అది కవకవ (వికటంగా నవ్వినవ్వి కళ్ళు తేలేసింది. సవరని యాటదెల్ల (అందమైన ఆ యువతి పూతన) సప్పుసారైపోయను (చచ్చి శవమై పోయింది).

ఓ గోపాల కృష్ణరాయా! నీవు అదిగో ఆ గొల్లవాడలో మగువల చూపులు వల్లెవేయగా (చూపులతో చూపులు కలిపి చిలిపి సంకేతాలీయగా), సూరబోయె రేపల్లె (సిగ్గుతో రేపల్లె చితికిపోయింది). గుబ్బలవంటి కుచగిరులున్న గొల్లెతల చేరడేసి కన్నులు ‘సిన్ని సిన్ని సిగ్గులు’ చిమ్మినవి.

ఓ వేంకటగిరి కిసునరాయ (వేంకట కృష్ణరాయా!) నీవు వన్నెలుగ (అందముగా) వీధివీధిలోనూ కిన్నెర (వీణ) వాయించగా అది, మిన్నుదాకి (ఆకాశంలో మారుమ్రోగి) జగదేకసుందరియైన ‘లకిమమ్మ’ (లక్ష్మీదేవి) నిన్ను చేరి సరుగున (నీ పక్కన) నిలుసుండే సొక్కెను (నిలబడి యుండగానే పరవశంతో నిద్రించినది).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment