Kundanampumai Golleta Ta In Telugu – కుందణంపుమై గొల్లెత తా

ఈ పోస్ట్ లో కుందణంపుమై గొల్లెత తా- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కుందణంపుమై గొల్లెత తా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : కుందణంపుమై గొల్లెత తా-
సంఖ్య : 92
పుట : 63
రాగం: ఆహిరి

ఆహిరి

85 కుందణంపుమై గొల్లెత తా
నెందును బుట్టని యేతరి జాతి

||పల్లవి||

కప్పులు దేరేటి కస్తురి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి

॥కుంద||

దుంప వెంట్రుకల దొడ్డతురుముగల
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్రిణి జాతి

॥కుంద||

వీపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి

॥కుంద||

గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
భారపుటలపుల పద్మిణిజాతి

॥కుంద||

అవతారిక:

కావ్యనాయికలను శృంగారశాస్త్రం నాలుగురకాలుగా వర్ణించింది. పద్మినిజాతి స్త్రీ, హస్తిణి, చిత్రిణి, శంకిణి అని చెప్పబడిన వీరిలో ప్రతి యువతి తన శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఆ జాతికి చెందిన స్త్రీగా నిశ్చయింపబడినది. ఈ కీర్తనలో అన్నమాచర్యులవారు నలుగురు గొల్లెతలను ఆ విధంగా విభజించి బంగారు శరీరఛాయతోనున్న గొల్లెత తానెందును. బుట్టని యేతరిజాతి చిన్నది అంటున్నారు. అంటే యేమిటి? సరసశృంగారంకాస్త గూఢంగా వుంటే అందం కదా! భావవివరణ జాగ్రత్తగా చదవండి. కొసమెరుపేమంటే, నలుగురికీ ఆ నల్లనివాడంటే వుల్లములో జల్లే.

భావ వివరణ:

కుందణంపుమై (బంగారు శరీరచ్ఛాయగల) గొల్లెత (ఆ గొల్లభామ) | తాను యెందును (ఏజాతిలోనూ) పుట్టని యేతరిజాతి (అతిశయముగల స్త్రీ). అనగా వూహాసుందరి.

కప్పులుదేరేటి కస్తూరి (నల్లని కస్తూరీ పరిమళముగల) బాహు మూలములామె ప్రత్యేకత. ఆమె కొప్పెర గుబ్బల (వున్నత కుచయుగళము) గల గొల్లెత. ఆమె చల్లలమ్ముటకు పోతుంటే ఆమెమట్టెల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. అప్పని ముందట (హరియెదుట) ఆ హస్తిణీజాతి గొల్లెత నడయాడుచున్నది.

ఆమె తల వెంట్రుకలు, దుంపలు కట్టి (కుచ్చులు కట్టి) పెద్ద కొప్పుతో వున్నది. | ఆమె నడుస్తుంటే గుంపెనగా (అట్టహాసముగా) వుంటుంది. ఆమె కదులుతుంటే ఆమె చెవులకు దరించిన జంపులు (చెంపసరములు) నర్తించుతాయి. చల్లలమ్ముటకు ఆమె మధురానగరంలో నడుస్తుంటే శ్రమవల్ల ఆమె చెంపలు చెమటను చెమరించుచున్నవి. ఆమె తప్పకుండా చిత్తిణీజాతి స్త్రీయే సుమా!

ఇదిగో ఈ గొల్లెతను చూడండి. ఉద్రేకమున ఈమె వీపుపై నఖక్షతములను సైతము జేయగలదు. ఈమె చూపులే చురచురమనునట్లు కోపాగ్నితో వుంటాయి. ఆమె నడుస్తుంటే పరుగెడునట్లుంటుంది. ఈమె చల్లలమ్ముటకు చాపేటి యెలుగున (పెద్ద గొంతుతో కేకలు వేస్తూ అమ్ముతుంది). ఈ జవ్వని శంకిణిజాతి గొల్లెత.

ఈ గొల్లెతను చూశారా? ఈమె అతిశయించిన గారవము (గౌరవము) తో శ్రీవేంకటేశ్వరుని కౌగిటిని యెన్నడు విడువదు. తిరుమలేశునిపై ఆమె యెనలేని కూరిమి (వలపు) కలిగి వుంటుంది. ఈ గొల్లెత యెప్పుడు చల్లలమ్ముటకు పోయినా తనవెంట ఆ రమణుడే వుండాలని ఆశపడుతుంది. ఆమె భారపు (అధికమైన) అలసటను (శ్రమను) తట్టుకోలేదు. ఆమె ఆయనకు ప్రియమైన పద్మినీజాతి స్త్రీ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment