Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీరాముడు (లేదా శ్రీరామచంద్రుడు) హిందూ మతంలో ప్రముఖమైన దేవుడు. ఆయనను విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పూజిస్తారు. రాముడు ఐక్య వేదాన్తం, ధర్మ పరిపాలకుడు, సత్యవ్రతుడు, క్షమాశీలతగల వ్యక్తి, గొప్ప భర్త, ప్రేమపూర్వక భక్తుడు మరియు క్షమాశీలతగల రాజు అని పిలుస్తారు. శ్రీరాముడు దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడిగా అయోధ్యలో జన్మించాడు. రాముడి కథ ప్రధానంగా రామాయణం అనే మహాకావ్యంలో వర్ణించబడింది. వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణం, 24,000 శ్లోకాలతో, రాముడి జీవితాన్ని మరియు ఆయన యాత్రలను వివరిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీరాముడు మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
ధీరునకు వనధి గంభీరునకు
శుంభత్సారంభ గాంభీర్యా! శ్రీరామా
(పున్నాగవరాళి రాగం – మిశ్రచాపుతాళం)
చ 1) ధీరునకు వనధి గంభీరునకు
దుష్ట సంహారునకు ఘనమణి హరునకునూ,
హర కర్పూర నీ హర హీర పటీర
రాళి కీర్తి విస్తారునకునూ
॥జయ మంగళం నిత్య శుభ॥
చ 2) మంగళము రామునకు మహిత శుభధామునకు
మంగళము సీతా సమేతునకునూ
మంగళము సుర మకుట మణి లలిత పాదునకు
మంగళము క్షీరాబ్ధి మందిరునకూ
॥జయ మంగళం నిత్య శుభ॥
చ 3) అద్యునకు బ్రహ్మది వేద్యునకు
దుర్మదభేద్యునకు ప్రజరుజా వైద్యునకునూ
సద్యోఫల ప్రదున కాద్యంత రహితునకు
విద్యా విలేక జన హృద్యునకూ
॥జయ మంగళం నిత్య శుభ॥
చ 4) జైత్రునకు సౌమిత్రి మిత్రునకు
భక్తవన చైత్రునకు నవపద్మ నేత్రునకునూ
మిత్ర వంశాబ్ది సన్నిత్రునకు సుర వినుత
పాత్రునకు జగదవని సూత్రునకునూ
॥జయ మంగళం నిత్య శుభ॥
నిరాకారా నిరంజనా నీకు హారతి
నీహార సాకార నిర్మలానందా! శ్రీరామా
(పూరి కళ్యాణ రాగం – త్రిశ్రగతి తాళం)
పల్లవి: నిరాకార నిరంజనా నీకు హారతీ
మా రామచంద్రునకు మనసు హారతీ నా మనసు హారతీ
॥ నిరాకార
చ 1) పంచభూతములను ఐదు
ప్రమిదల గాను చేసినాను
మించిపోయే గుణము తీసి
మంచి వత్తి వేసినాను
అహంకారమనే గుణము తీసి
అక్షతలు చేసినాను
కామమనే గుణము తీసి
తరచి చమురు పోసినాను
చ 2) మాయ అనే తెరను తీసి దక్షిణగా ఉంచినాను
దూషణమనే గుణము తీసి ధూపముగ వేసినాను
కామ క్రోధములను తీసి కైవత్తిగ వెలిగించినాను
ప్రేమయనే గుణముతీసి నైవేద్యము చేసినాను
||నిరాకార||
బాలుడా నీకిదే హారతీ
శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీరామచంద్రా నీకు కర్పూర హారతి – వలె
(శంకరాభరణ రాగం – మిశ్రచాపు తాళం)
చ 1) బాలుడా నీ కిదే హారతి
సుగుణ బాలుడవై వర్థిల్లుమా
చాలగ దేవదేవులు కొలచుచు
శాశ్వత సుఖముల నొందుమా
॥బాలుడా||
చ 2) విద్యాధికుల వెలయుచు విద్యల
వేదమె నేర్చి సుఖింపుమా
ఘనమతినై విద్యా గురువుల యెడ
కడు భక్తిని చెల్లింపుమా
॥బాలుడా||
చ 3) ఆయుర్భాగ్యము నొంది ధరిత్రిని
అఖిల సుఖముల నొందుమా
కృత్యం బైన సనాతనంబు మును
హితమతి తోడ చరింపుమా
॥బాలుడా||
చ 4) జననీ జనకుల అజ్ఞల నెల్ల
సతతము తలను ధరింపుమా
పాయని దేహారోగ్య సుఖముల
నిత్యముగ బడసి వర్థిల్లుమా
॥బాలుడా||
చ 5) బంధు జనాదరంబు నీకు ఇల
పాత్రుడవై చరియింపుమా
బంధ విమోచన పరామాత్ముని
కడు భక్తిని చెల్లింపుమా
॥బాలుడా||
మంగళ మనరేమీ రంగనా మణులారా
రంగు హొరంగు చెలరేగిన శ్రీరామా
కాంభోజి రాగం – త్రిశ్రగరి ఆదితాళం)
పల్లవి: మంగళ మనరేమీరంగనామణులారా!
పొంగుచు దాసుల బ్రోచిన స్వామికి
చ 1) దశరథ పుత్రునకు దశముఖ శత్రువునకు
శశివదనునకు విశద చారిత్రునకు
॥మం॥
చ 2) పుండరీకాక్షునకు కుండల శయనునకు
చండ విక్రమునకు ఆంజనేయ సఖునకు
॥మం॥
చ 3) ఘననిభ తేజునకు మునిజన పూజ్యునకు
అమరనుత సేవ్వునకు జానకీనాథునకు
॥మం॥
చ 4) మదన సుందరునకు సదమల గాత్రునకు
సదయ సద్భక్తునకు ఉదయగిరి నిలయునకు
॥మం॥
మంగళం ధీరునకు
సారభీర ధీరోదారునకు సూర్యరాయ
అరభి రాగం – త్రిశ్రగతి ఆదితాళం)
చ 1) మంగళం ధీరునకు అబ్ధి గంభీరునకూ
దుష్ట సంహారునకూ ఘన మణీహారునకు
హారతి కర్పూర – నీ హార హార పటీర
తారాళి కీర్తి విస్తారునకు మంగళం||
చ 2) మంగళం రామునకు మహిత శుభనామమునకు
మంగళం సీతా సమన్వితునకు మంగళం|
సుర మకుట మణి కలిత పాదునకు మంగళం
క్షీరాబ్ధి మందిరునకు జయ మంగళం||
చ 3) అద్యునకు బ్రహ్మదివేద్యునకు దుర్మదా
భేద్యునకు ప్రజరుజా వైద్యునకు సర్వపాప
హరునకు సద్యఃఫల ప్రదునకు ఆద్యంత
రహితునకు విద్యా వివేక జన హృద్యునకు
చ 4) జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన
చైత్రునకు నవపద్మ నేత్రునకునూ మిత్ర
వంశాబ్ది సన్మిత్రునకు సురవినుత పాత్రునకు
జగదావన సూత్రునకు జయ మంగళం|
మంగళ మిదిగో మందర ధరా
సంకందన సుందర వందితా శ్రీరామా
(హరి కాంభోజిరాగం – మిశ్రచాపుతాళం)
చ 1) మంగళ మిదిగో మందర ధరా
మధుసూదనా పలు! మాట లింతేనా
॥మం॥
చ 2) మత్స్యావతార! కూర్మావతార
రక్షించుము రా రామావతారా
॥మం॥
చ 3) కర్పూర హారతి! కరుణతో గైకొను
కౌశల్య తనయా! కరి రాజ వరదా
॥మం॥
చ 4) గోవిందా శౌరీ! గోపాల కృష్ణా
గోవర్ధ నోద్ధార! కాచి రక్షించరా
॥మం॥
రంగా! నీకిదే మంగళం
రంగదుత్తుంగ నానందతరంగా రంగ!
(మోహనరాగం ఆదితాళం)
పల్లవి: రంగా నీకిదే మంగళం – కస్తూరి రంగా నీకిదే మంగళం
చ 1) రంగ ఖగరాట్ తురంగ కలుష వి
భంగా తవ మోహనాంగా వయ్యారి
॥రంగా॥
చ 2) హరే విబుధ విహారీ ఉభయ
కావేరీ తీర విహారీ వయ్యారి
॥రంగా॥
చ 3) అన్నా యితరుల నన్నెవరు-నీ
కన్న నన్ను బ్రోవుచున్నా-వయ్యారి
॥రంగా॥
చ 4) లీలా శేషాంశు లీలా కరుణాల
వాలా జగత్పరిపాలా-వయ్యారి
॥రంగా॥
చ 5) అయ్యా వరము మాకియ్య నిను నమ్మి
తయ్య నను బ్రోవుమయ్య-వయ్యారీ
॥రంగా॥
చ 6) హాసా మహ చిద్విలాసా శేషాచల
దాశార్చిత పరమేశా-వయ్యారి
॥రంగా॥
రమా రమణ గొనుమా
క్షమా సుమా రామా!
(ఆనందభైరవి రాగం ఆదితాళం)
పల్లవి: రమా రమణ గొనుమా జయ హారతి గొనుమా
అను పల్లవి కౌశల్య సుకుమార కమలా మనోహరా
దశరథ వరపుత్ర శశిశేఖర మిత్రా
॥రమా॥
చ 1) ఈశా పరమేశా జగధీశా దాస జన హృదయ
వాసా చిద్విలాస సర్వలోక వాసా శ్రీనివాసా
చ 2) రామా రఘు రామా రణభీమా
రామా రఘు వంశాంబుధి సోమా
నీల మేఘ శ్యామా నిగమాంత గుణనీమా
తారకరామ స్కందపురి రామా
రామ రామ యని రమణులు స్మరియించి
భూమ క్షేమానంద సీతా శ్రీరామా
(సురట రాగం – మిశ్రచాపుతాళం)
ఘల్లు ఘల్లు మని-వలె
చ 1) రామ రామ యని రమణులు స్మరియించి
రంగైన రాఘవునకు శృంగార గాత్రునకు హరివిల్లు
విరచియు అతివను పెండ్లాడి
అతిఘోర వనములో మసలిన రామా
॥మంగళమ మంగళం||
చ 2) రాతి నాతిగ జేసి రాక్షసులు వధియించి
ఆదివిష్ణుడవయి అవతరించిన స్వామి
ఆ పాప కర్మునిచే అతివను గోల్పోయి
అక్కడ వనములో వెతలు చెందిన స్వామి
॥మంగళమ మంగళం||
చ 3) గురువు ఆజ్ఞకు నాడు అతి బద్ధుడై యుండి
రంగైన తాటకిని సంహరించి, మౌని
జన్నము గాచి సౌమిత్రి జాడగాంచి
సకల సంతోషముతో నీరజనేత్రా
॥మంగళమ మంగళం||
చ 4) నారదు తుంబురులు నృత్యముగానము చేయ
బ్రహ్మరుద్రాదులు పలువిధముల పాడ
దశరథ మహరాజు నిండా దీవెనలిచ్చి
సకల సంభ్రమముతో శోభిల్లు రామా
॥మంగళమ మంగళం||
చ 5) రామ రామ యని రమణులు స్మరియించి
రంగైన రాఘవునకు శృంగార గాత్రునకు
నిగమ గోచర రామ నిత్య పరంధామ
నీకు అర్పణము గాను నీరాజనమ్ము
॥మంగళమ మంగళం||
సీతా రామ జయ మంగళం
దశరథ తనయా జయ మంగళం
రాజీవలోచన జయ మంగళం
చ 1) కౌశల్య వర కుమార ఘనత మీరగ భానువంశ
పాలకా నీకు వజ్రాల హారతు లివిగో
||రామ||
చ 2) ముని వెంట వేగ వెడలి తాటకి మద మణచి
యజ్ఞమును గాచిన స్వామీ నీకు ముత్యాల హారతు లివిగో
||రామ||
చ 3) శృంగారమున సీతకు మంగళ సూత్రము కట్టిన
రంగగు రామా నీకు మంగళ హారతులివిగో
||రామ||
చ 4) ముత్యాల తలంబ్రాలు ముదముతో సీతకు బోసిన
సత్యస్వరూపునకు చంద్రాల హారతి యిదిగో
||రామ||
చ 5) నాలుగోనాడు నాగవల్లి కిపుడు
బలి గావించిన స్వామీ మీకు పచ్చల హారతు లివిగో
||రామ||
చ 6) మెచ్చి సీత నప్పగించి సంతోషించిన
స్వామీ నీకు నీలాల హారతి లివిగో
||రామ||
చ 7) జనకుని కూతురిని జానకిని పెండ్లాడిన
వీర రామచంద్ర నీకు వజ్రాల హారతులివిగో
॥రామ||
రామా! కర్పూర హారతి గైకొనుమా
రవికుల జలథి సోమా రాజలలామా
శ్రీరామా (సింధుభైరవి రాగం – ఆదితాళం)
పల్లవి: రామా కర్పూర హారతి గైకొనుమా
చ 1) సోదరు లిద్దరు లేడి కోసము వేగ
ఆ మాయ రావణుడు అ సీతను కొనిపోగ
॥రామా॥
చ 2) పర్ణశాలకు పోయి వెదకి చూచిన గాని
తరుణి గానక తల్లడిల్లితి శ్రీరామా
||రామా॥
రామచంద్రాయ జనకరాజ మనోహరాయ
ధీరాయ! శుభాయ! నందరాయ! శ్రీరామా
(నవరోజ్ స్వరాలు – త్రిశ్రగతి తాళం)
చ 1) రామచంద్రాయ జనక
రాజతనయ మనోహరాయ మామ కాభీష్ట దాయ
॥మహిత మంగళం||
చ 2) కౌశలేద్రాయ మంద హాసదాస పోషకాయ
వాసవాది వినుత సర్వ
॥దాయ మంగళం||
చ 3) చారు కుంకు మోపోత చందనాది చర్చితాయ
సారకటక శోభితాయ
॥భూరి మంగళం||
చ 4) లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సదృశ దేహాయ
॥చారు మంగళం||
చ 5) దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
భావ గురువరాయ
॥భవ్య మంగళం||
చ 6) పుండరీ కాక్షాయ పూర్ణ చంద్రావనాయ
ఆండజ వాహనాయ
॥ఆతుల మంగళం॥
చ 7) రాజ విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్ర కాశితాయ
॥శుభమంగళం||
చ 8) రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరి పరాయ
॥చారు మంగళం||
రామచంద్రా నీకు కర్పూరహారతిస్తును
సుగుణ గుణ సాంద్రా! శ్రీరామచంద్రా!
(శంకరాభరణ రాగం – మిశ్రచాపుతాళం)
చ 1) రామచంద్రా నీకు కర్పూరహారతి గైకొనుమా
పాము మీదను పవళించిన
స్వామి నిన్నిక మరువను
||రామ||
చ 2) ఎన్ని విధముల నన్నుతించిన కన్నులకే కనిపించవా?
నన్నుగన్న తండ్రి నీకే విన్నవించిన బ్రోవవా
||రామ||
చ 3) కోపమేలను దాపుచేరితి పాపములు నెడబాపరా
తామరసాక్ష నీదు పదములు
తప్పకను భజియింతురా
||రామ||
చ 4) పన్నగ గజరాజు నేలిన భక్తవత్సలు డందురూ
నన్ను రక్షణ సేయకుండిన నమ్మా నీ కథలన్నియూ
||రామ||
ధీరునకు వనధి గంభీరునకు
ధీరసమీరా! సారసమీరా! శ్రీరామా
(పున్నాగవళి రాగం – మిశ్రచాపు తాళం)
చ 1) ధీరునకు వనధి గంభీరునకు
దుష్టసంహారునకు ఘనమణీ హారునకునూ
హర కర్పూర నీహార పటీర
తారాళి కీర్తి విస్తారునకునూ
॥జయ మంగళం నిత్య శుభమంగళం ॥
చ 2) మంగళము రామునకు మహిత శుభధామునకు
మంగళం సీతా సమేతునకునూ
మంగళం సుర మకుట మణీలలిత పాదునకు
మంగళం క్షీరాబ్ధి మందిరునకూ
॥జయ మంగళం||
చ 3) ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు
దుర్మద భేద్యునకు భవరుజా వైద్యునకునూ
సద్యోఫల ప్రదున కాద్యంత రహితునకు
విద్యా వివేక జనహృద్యునకూ
॥జయ మంగళం||
చ 4) జైత్యునకు సౌమిత్రి మిత్రునకు
భక్తవన చైత్రునకు నవపద్మ నేత్రునకునూ
మిత్రవంశాబ్ది సన్మిత్రునకు సుర వినుత
పాత్రునకు జగదావన సూత్రునకునూ
॥జయ మంగళం ॥
సీతా సమేతాయ
సీతాఖ్యాత సంప్రీతా సీతా
(అఠాణా రాగం – జుంపె తాళం)
చ 1) సీతా సమేతాయ శ్రితమనోల్లాస
నీతి వాక్యాయ అతి నిర్మలాయ
రాతి నాతిగ జేసి రక్షంచి జగములను
దాతవై బ్రోచు దశరథ సుతాయ
॥జయ మంగళం నిత్యశుభ||
చ 2) మౌనితో చనుదెంచి దుష్టరక్షణము చేసి
శివుని విల్విరిచి సీతను వరియించి
అయోధ్యపురికి భువినెన్నగ
జనుదెంచి కౌశల్యా గారాలపట్టికిపుడు
॥జయ॥
చ 3) రామచంద్రున కపుడు రాజ్యాభి షేకంబు
చేయవలెనని రాజు చెప్పగాను
తామసంబున కైక తన వరమ్ములిమ్మనగ
బూమిపై వ్రాలిన పుణ్యదాసుడు
॥జయ॥
హారతి గైకొను అరమరచేయక
గురుతర సుందరవర వదనా! శ్రీరామా
(యమునా కళ్యాణి రాగం తాళం)
పల్లవి: హారతి గైకొను అరమర చేయక
ఆశ్రిత పాలా శ్రీరామచంద్ర
॥హారతి ||
చ 1) శివుని విల్లు విరచి సీతను పెండ్లాడి
పరశురాముని భంగపరచిన శ్రీరామా
॥హారతి ||
చ 2) లక్ష్మణ సోదర తక్షణమేగియు
ఈ స్థితిలోన ఇక దయ చూడు
॥హారతి ||
చ 3) అచ్యుతా! అహల్యా శాప పరిహారా
సీతా మనోహరా శ్రీరామచంద్రా
॥హారతి ||
హారతి గైకొనుమా శ్రీరామచంద్రా!
రవికుల చంద్రా! సత్కీర్తి సాంద్రా
(కన్నడ రాగం – ఆదితాళం)
పల్లవి: హారతి గైకొనుమా శ్రీరామచంద్రా
చ 1) కర్పూర హారతి కరుణతో గైకొను
కనికర ముంచుమా కౌశల్య తనయా
॥హారతి ||
చ 2) మంగళ హారతి మహిమతో గైకొని
మరి మరి మము బ్రోవ దశరధ తనయా
॥హారతి ||
శ్రీరామా గొను కర్పూర హారతిదిగో
గారా మారగ జేచితికోరా శ్రీరామా
(సింధుభైరవి రాగం – ఆదితాళం)
పల్లవి: శ్రీరామా గొను కర్పూర హారతిదిగో
సీతాదేవికి ముత్యాల హారతిదిగో
చ 1) నిత్య నిరామయ భృత్యుల బ్రోవరారా
సత్య స్వరూపా గొను సర్వేశ హారతిదిగో
||శ్రీరామా||
చ 2) బ్రోవా నందన సుంత ఆది మధ్యాంత శూన్య
వాద భేద విహీన పరమాత్మా హారతిదిగో
||శ్రీరామా||
చ 3) వేంకట శివగురుని శంకలేక బ్రోవ
వేంకట రంగనాయన కిచ్చిన హారతిదే
||శ్రీరామా||
మరిన్ని భక్తి గీతాలు :