మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Sri Mahalakshmi Ashtakam Telugu Lyrics
మహాలక్ష్మ్యష్టకమ్
శ్లో॥ 1
నమస్తేస్తు మహామాయే, శ్రీ పీఠే సురపూజితే।
శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ ఓ మహామాయ రూపిణీ! నమసుమములు
నీవు శ్రీపీఠ వాసివి దేవవినుత
శంఖ చక్ర గదా హస్త! జనని! జేతు
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు
తా॥ ఓ మహామాయా స్వరూపిణి నీకు నమస్కారము. నీవు శ్రీపీఠ నివాసినివి. దేవతలందరిచే కొని యాడబడి పూజించబడు దానవు. ఓ శంఖ చక్ర గదాధరీ తల్లీ! మహాలక్ష్మీ నీకు వందన మొనరించెదను.
శ్లో॥ 2
నమస్తే గరుడా రూఢీ, డోలాసుర భయంకరి।
సర్వ పాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ దండములు గరుడారూఢ తల్లికిత్తు
భయము డోలాసురునికి నీవలన కలిగె
సర్వ పాపముల్ నీవల్ల సమసిపోవు
వందనం మహాలక్ష్మి శ్రీవనిత కిపుడు
తా॥ గరుత్మంతుని అధిరోహించు తల్లికి వందనము చేతును. నీవలన డోలాసురునికి భయము కలిగినది. నీవలన అన్ని పాపములు నశించును. తల్లీ! మహాలక్ష్మీ నీకు వందనమొనరించెదను.
శ్లో॥ 3
సర్వజ్ఞే సర్వవరదే, సర్వ దుష్ట భయంకరీ
సర్వ దుఃఖహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ సర్వమును దెలిసిన తల్లి సర్వ వరద
సర్వ దుష్ట భయంకరి జనని నీవె
సర్వ దుఃఖముల్ బాపెద వుర్వియందు
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు
తా॥ సర్వము తెలిసిన ఓ తల్లీ నీవు అందరినీ అనుగ్రహించుదానవు. దుర్మార్గులందరికీ నీవు
భయంకరివి. ఈలోకంలో దుఃఖములన్నీ తొలగించు దానవు. ఓ మహాలక్ష్మీ నీకు ఇదే నమస్కరించు చున్నాను.
శ్లో॥ 4
సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయిని।
మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే
తే॥ సిద్ధి బుద్ధుల జేకొన జేయు దేవి
భుక్తి ముక్తులనీ లక్ష్మిబూని యిచ్చు
మంత్రముల అధీష్ఠానమీ మాత నిజము
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు
తా॥ సిద్ధిబుద్ధులను కలుగజేయు దేవి తిండి మోక్షములన ఈ లక్ష్మి పూనుకుని అందించును. ఈ తల్లి మంత్రములకు అధిష్ఠానదేవత ఓ మహాలక్ష్మి నీకు ఇపుడు నమస్కరించు చున్నాను.
శ్లో॥ 5
ఆద్యన్తరహితే దేవి, ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే, మహాలక్ష్మి నమోస్తుతే
తే॥ ఆది అంతముల్ లేనిదా ఆదిశక్తి
యోగ మెరిగిన దాయమ్మ యోగలభ్య
ఈమె విష్ణుప్రియయును మహేశ్వరీమె
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు
తా॥ ఆ ఆదిశక్తికి ఆదియు అంత్యములు లేవు. యోగముచే లభించు ఆ దేవి యోగ విద్య నెరిగిన తల్లి. ఈమె శ్రీమహావిష్ణువుకు ప్రియురాలు మహేశ్వరి. ఆ మహాలక్ష్మికి ఇదే నమస్కరించు చున్నాను.
Mahalakshmi Ashtakam Telugu
శ్లో॥ 6
స్థూల సూక్ష్మ, మహారౌద్రే, మహాశక్తే మహోదరే।
మహాపాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ స్థూలమైనది భీకరి సూక్ష్మముయును
పెద్ద యుదరము పెనుశక్తి వెలయుచుండె
పాపములద్రుంచ జననియు పావనియును
వందనం మహాలక్ష్మిశ్రీవనిత కిపుడు
తా॥ స్థూలమైనదియు సూక్ష్మమైనదియు పెద్ద ఉదరము గలదియు, మహాశక్తియు అయిన సర్వపాప సంహారిణి పరమపావని, ఓ మహాలక్ష్మి నీకు వందనము సమర్పిస్తున్నాను.
శ్లో॥ 7
పద్మాసనస్థితే దేవి, పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశ్వరి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే
తే॥ పద్మమే ఆసనంబైన పద్మజనిత
వెలసె పరబ్రహ్మ రూపిణై తలచిచూడ
సర్వజగతికి మూలమౌ జనని ఈమె
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు
తా॥ పద్మము ఆసనమైన ఈ దేవి పద్మమునుంచి పుట్టినది. ఈమె పరబ్రహ్మరూపిణై వెలసి యున్నది. సర్వజగత్తుకి ఈమె తల్లి. అట్టి ఓ మహాలక్ష్మి నీకు ఇదే నా నమస్కారము.
శ్లో॥ 8
శ్వేతాంబరధరే దేవి, నానాలంకార భూషితే।
జగత్ స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ రమ్యమౌ పెక్కునగలు అలంకరించి
శ్వేత వస్త్రధారిణియైన శ్రీలతాంగి
జగము నిలిపిన ఈ తల్లి జగతి జనని
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు
తా॥ పలు సుందరాభరణాలచే అలంకరించబడిన ఈమె తెల్లని వస్త్రమును ధరించిన తరుణి. జగత్తునంతటిని ఉద్ధరించు ఈ తల్లి జగజ్జనని. ఓ మహాలక్ష్మి నీకు నమస్కరించెదను.
శ్లో॥ 9
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం, యఃపఠేద్భక్తి మాన్నరః।
సర్వసిద్ధి మవాప్నోతి, రాజ్యం ప్రాప్నోతి సర్వదా॥
తే॥ తాము ఈ మహాలక్ష్మ్యాష్టకమును ప్రీతి
భక్తి శ్రద్ధతో చదువరే ప్రార్ధనందు
సర్వసిద్ధులు కలుగును జయము కల్గు
రాజ్యభోగములీ మహాలక్ష్మి యిచ్చు
తా॥ ఈ మహాలక్ష్మి అష్టకమును ప్రేమగా భక్తిగా శ్రద్ధగా తమరు ప్రార్ధనలొ పఠించినచో సర్వ సిద్ధులూ కలుగును. విజయములు కలుగును. ఈ మహాలక్ష్మి రాజ్యభోగముకూడా కలుగ జేయును.
శ్లో॥ 10
ఏకకాలే పఠేన్నిత్యం, మహాపాప వినాశనమ్॥
ద్వికాలేయః పఠేన్నిత్యం, ధనధాన్య సమన్వితః॥
త్రికాలంయః పఠేన్నిత్యం, మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీర్భవేన్నిత్యం, ప్రసన్నా వరదా శుభా॥
(ఇన్ద్రకృత శ్రీమహాలక్ష్మ్యష్ఠక స్తోత్రం సంపూర్ణమ్)
తే॥ పఠనమొకసారి నిత్యము పాపముక్తి
రెండుసార్లైన ధనధాన్య ‘మెండు’ కలుగ
మూడు మారుల శత్రుల ముప్పు దొలగు
శ్రీమహాలక్ష్మి సర్వదా చేయు శుభము
తా॥ ఈ అష్టకము ఒకసారి పఠించిన ప్రతిదినమూ పాప విముక్తి కలుగును. రెండు పర్యాయములైనచొ సమృద్ధిగా ధనధాన్య లాభము, మూడు మారులకు శత్రుభయనాశనము చేసి శ్రీమహాలక్ష్మి సర్వదా శుభములిచ్చుగాక.
(ఇది ఇంద్రుడు చెప్పిన శ్రీమహాలక్ష్మి అష్టకము)
మరిన్ని అష్టకములు: