ఈ పోస్ట్ లో సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 5
కీర్తన: సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ
సంఖ్య : 66
పుట: 45
రాగం: పాడి
పాడి
81 సుతుని నరకునిఁ జంపఁ జూచినాఁడవు సుమ్మీ
మతి నన్నుఁ దలఁచక మానిన నీకాన
||పల్లవి||
ఎత్తుక నీతోడఁబట్టు హిరణ్యకశిపుని
నెత్తురు దాగితి సుమ్మీ నేఁడే రాకుంటే
ఉత్తలాన నేడనైనా నుండుదువో యని భీతి
బిత్తరముగాఁ బెట్టితి పెట్టరాని యాన
||సుతుని||
కప్పుక మేనమామ కంసుని ప్రాణానకు
తప్పినవాఁడవు సుమ్మీ తడసితేను
ఇప్పుడిట్టే నీవు రాని యీరసానఁ బ్రియములు
చెప్పలేక పొడిచితి చెడుగైన యాన
||సుతుని||
సిరుల మేన మరఁది శిశుపాలు నీ విట్టే
పొరిగొంటివి సుమ్మీ పోయితే నీవు
తిరువేంకటేశ నిన్నుఁ దివిరి కూడి (డే?) వని
కరుణఁ బెట్టితి నీకుఁ గపటాన నాన
||సుతుని||
అవతారిక:
పరంధాముని నిందాస్తుతితో ప్రార్థించిన భక్తాగ్రేసరులు కోకొల్లలు. బాధతాళలేక నిందించినా అది స్తుతితోనే ముగుస్తుంది. ఈ కీర్తన ప్రత్యేకత యేమంటే అన్నమయ్య. వ్యావహారిక దృష్టిలో ‘కొడుకు’ను చంపిన క్రూరుడు, ‘అన్నను’ చంపిన అతి జిత్తులమారి, మేనమరిదిని చంపిన కఠినుడు నన్ను కాపాడతాడో లేదోనని యేవేవో ఒట్లు పెట్టి నన్ను కాపాడమని వేడుతున్నాను ఇవన్నీ ‘కపటపు ఆనలే’ ప్రభూ! ఎలాగైనా నీదయ పొందాలనే నా ‘ప్రయత్నం’ అంటున్నారు పరమాత్మతో. ఇటువంటి కీర్తన మనసును కరిగిస్తుంది.
భావ వివరణ:
ఓ దేవదేవా! నీవు కఠినాత్ముడవు. నీసుతుడైన నరకుని (వాడు శ్రీహరికీ భూదేవికి, హిరణ్యాసుర వధానంతరం పుట్టిన కొడుకు) చంపజూచి, వాడిచావు వాడి తల్లి అంశతో జన్మించిన సత్యభామ చేతితో జరిపించావు). నన్ను దయతలచక మానితే నీకు ‘ఆన’ (ఒట్టే సుమా!)
నీవు నరసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి చంపి వాడినెత్తురు నేలరాలరాదని వాడి నెత్తురు త్రాగినావు. ఇంతాజేసి వాడు నీతోడబుట్టిన అన్నయే కదా! వాడు చెల్లెలుదితి కొడుకైతే, నీవు అక్క అదితి కొడుకువి. ఉత్తలాన (తొందరపాటుతో) యెక్కడైనా నాకోసం పొంచివున్నావేమోనని భీతిచే బిత్తరజెంది పెట్టరాని ‘ఆన’ బెట్టితినయ్యా! నన్ను క్షమించు. నీవు నన్ను చంపితే అంతకంటే నేకోరునదేమున్నది తండ్రీ!
నీవు మేనమామను చంపిన గొప్ప మేనల్లుడవని అందరూ యెరిగినదే కదా! మామూలుగా చంపవచ్చును కదా! వాడిని (కంసుని) ఆకాశవాణిద్వారా హెచ్చరికపంపి మేనల్లుళ్ళని చంపిన క్రూరుడన్న పాపం అంటగట్టి, వాడిని ప్రాణానకు తప్పినవాడవు (ప్రాణాలు తీసినవాడవు). ఈరసార (కొద్దిగా ఈర్ష్యతో) ప్రియములు చెప్పలేక, తొందరపడి ఇప్పుడు నేను యేవేవో ‘ఆన’లు (ఒట్లు) పెట్టేను. అంతే స్వామీ! వాటిని లెక్కజేయకు.
స్వయముగ నీ మేనమరిది శిశుపాలుని సుదర్శన చక్రంతో పొరిగొంటివి (తలనరికేవు). సభలో తరిమితరిమి చంపినావు. అందుకు నూరుతిట్లు నిన్ను తిట్టినపాపము వాడి చేత చేయించావు. పోయితే నీవు (ఇకపోతే నీవు) తిరువేంకటేశ్వరుడవై తివిరి (ప్రయత్నముతో నన్ను కూడేవని (అనుగ్రహింతువని) నీకు కపటపు ఆనలు పెట్టాను స్వామీ! నన్ను కరుణతో చూస్తే చాలు తండ్రీ! నీకు ఆనలు పెట్టే ధైర్యం నాకెక్కడిది ప్రభూ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: