కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అభయదాయకుడ వదెనీవే గతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అభయదాయకుడ వదెనీవే గతి – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 2
కీర్తన : అభయదాయకుడ వదెనీవే గతి
సంఖ్య : 420
పుట : 283
రాగం : బౌళిరామక్రియ
బౌళిరామక్రియ
37 అభయదాయకుఁడ వదె నీవే గతి
యిభరక్షక నను నిపుడు గావవే
||పల్లవి||
భయహర దైతేయభంజన కేశవ
జయ జయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింక లుడుపవే.
||అభ||
బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్ష
కంధరవర్ణుఁడ గతి నీనామమె
అంధకారముల నణఁచి మనుపవే.
||అభ||
దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నావిన్నప మిదియే.
||అభ॥ 420
అవతారిక:
శ్రీమన్నారాయణుని పై శ్రావ్యమైన కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. సర్వులకు అభయప్రదాతవైన ఓ గజేంద్రవరదా! నీవే నాకు దిక్కు ఇప్పుడు నన్ను రక్షించరాదా స్వామీ! అని వేడుకొంటున్నారు. “కింకలుడపవే” – అంటే కినుకదూరం చేయవయ్యా అని అర్థం. కోపము అనే వ్యాధిని పోగొట్టమని భావన. కంధరవర్ణడు అంటే నీలమేఘశ్యాముడని అర్థం. తతచక్రాయుధము అంటే వ్యాపించే స్వభావంగల సుదర్శన చక్రం ఆయుధముగాగలవాడని అర్థం. ఇట్లా అడుగడుగునా అర్ధాలు తెలియని మధురమైన కీర్తన ఇది. సావధానుడు – అంటే యేమిటో వూహించండి.
భావ వివరణ:
ఓ ఇభరక్షకా! (గజేంద్రవరదా!) ఇపుడు నన్ను రక్షించగా నీవే దిక్కు నీవు అభయప్రదాతవు. దీనజనోద్ధారకుడవు. నన్ను కాపాడుము తండ్రీ! ఓ భయహరా! నీవు దైతేయభంజనుడవు (అసురాంతకుడవు); కేశియను రాక్షసాంతకుడవు. సర్వేశ్వరుడవైన ఓ నృసింహా! జయము జయము. మీకు ఇదే నియతము (నియమము). నీచరణములే గతి. క్రియగా (అదేపనిగా) మమ్ము పరిపాలించి మా కింకలుడపవే (మానవులమైన మాకుండే దుర్గుణమైన కోపమును నిర్మూలింపుము ప్రభూ! తన కోపమె తన శత్రువన్నారు కదా!
భవ బంధములను సడలించు పాపవినాశనా! నీవు సింధురవరదుడవు (గజేంద్రవరదుడవు) శ్రీతరక్షకుడవు (ఆశ్రయించినవారిని రక్షించే వాడవు). కంధరవర్ణుడవు (నీమేఘశ్యాముడవు). ఓదేవదేవా! అట్టి నీనామమే మాగతి మా అజ్ఞానాంధకారమును అణచి మనుపవే (రక్షించవయ్యా!)
ఓ దైవశిఖామణీ! తతచక్రాయుధ (వ్యాపించు శక్తిగల చక్రాయుథా!) శ్రీవేంకటేశ్వరా! సావధానుడవైన (హెచ్చరికతోవుండె నీ శరణ్యమే మాగతి. వేవేల విధములైన నా విన్నపములు ఇవియే ప్రభూ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: