కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 3
కీర్తన : హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
సంఖ్య : 543
పుట : 365
రాగం : భూపాళం
భూపాళం
38 హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు.
||పల్లవి||
మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు –
వేళాయ నాతండ్రి వేగ లేవే,
॥హరి||
కను దెరవు నాతండ్రి కమలాప్తుఁ డుదయించె కమలాప్తు
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే.
॥హరి||
లేవె నాతండ్రి నీలీలలటు వొగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిననారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు.
||హరి|| 543
అవతారిక:
మధురాతి మధురమైన మేలుకొలుపు కీర్తన నాస్వాదించి తరించండి. అన్నమాచార్యులవారి ఋణం తీరదని అనిపిస్తున్నది కదా! నా తండ్రి మేలుకోరా నా అన్న మేలుకో అని యెన్నిసార్లు బ్రతిమిలాడుతున్నారో చూడండి. జన్మకి ఇట్లాంటికీర్తన ఒక్కటి చాలదా? కొసమెఱుపు యేమిటంటే “వనిత మొకమజ్జనము వడిదెచ్చెను” అనే చరణం నందగోపుడు రేపల్లె గొల్లవారికి యేలిక కదా! వాళ్ళ పనిమనిషి వాళ్ళ అబ్బాయి పళ్ళుతోముకోవడానికి గోరువెచ్చని నీళ్ళు తెచ్చి సిద్ధంగా వున్నదట. మొకమజ్జనము అంటే ముఖమును నీళ్ళతో కడుగుకొనుట.
భావ వివరణ:
ఓ ఆదిపురుషా! హరీ! కృష్ణా ‘మేలుకో నాన్నా! తరువాత తప్పకుండా నా మోము (ముఖమును) ఇటుచూడు. (నా మాట విను తండ్రీ!)
నా యన్న మేలుకొనరా! బడినాడను (నీతో కూడి ఆడుకొందామని) అదే నీతోడి బాలలు మెల్లనే (మన వసారాలో) నిలుచుని నిన్ను పిలిచేరు. లే తండ్రీ! ఇక నిద్దురలు చాలును కన్నా! చద్దికూళ్ళ పొద్దువేళాయె (చద్ది యన్నం తినే వేళయింది నాన్నా!) నా తండ్రీ! వేగ లేవే (తొందరగా
లేచిరావయ్యా!)
అదిగోచూడు… కమలాప్తుడుదయించె (కమలబాంధవుడైన సూర్యభగవానుడు ఉదయించినాడు) నా తండ్రీ! కన్నులు తెరువమయ్యా! మొకమజ్జనకు (నీ ముఖము కడుగుకొనుటకు నీళ్ళను) వనిత (పనిపిల్ల) వడి దెచ్చెను (శ్రీఘ్రముగా తీసికొచ్చింది). ఇవే నీతండ్రి నందగోపుడు, మొనసి (పూనుకొని) ముద్దాడ (గబగబా ముద్దులు పెట్టుకొందామని) యెదురు చూస్తున్నాడయ్యా! ఓ దనుజాంతకా! (పూతన వంటి రాక్షసులను అంతమొందించినవాడా!) ఇక మేలుకోవయ్యా!
నా తండ్రీ! నీవు చేసిన నీ లీలలన్నింటినీ వొగడేరు (పొగడుచున్నారయ్యా!) లేవె (లేచిరావయ్యా!) ఇప్పుడు నీవు ఈ తిరుమల వేంకటకృష్ణయ్యవు, శ్రీదేవీ వల్లభుడవు. అదిగో చూడవయ్యా! ఆవలను (నీవాకిటి బయట) దేవతలు, మునులు, నారదాది భక్తులు సుప్రభాతమును పాడుచున్నారు. ఆకాశములో యెంత గుంపువున్నదో చూడు తండ్రీ! ఇంతమందికి నీ దర్శనం కావాలంటే యెంత సమయం పడుతుంది? లే నాన్నా!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: