Tagu Munulu Rushulu Tapamulu Seyaga In Telugu – తగు మునులు ఋషులు తపముల సేయగ

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తగు మునులు ఋషులు తపముల సేయగ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తగు మునులు ఋషులు తపముల సేయగ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : తగు మునులు ఋషులు తపముల సేయగ
సంఖ్య : 315
పుట : 213
రాగం : ధన్యాసి

ధన్యాసి

35 తగు మునులు ఋషులు తపములు సేయఁగ
గగనము మోచియుఁ గర్మము దెగదా.

||పల్లవి||

ధరణీధర ముందరధర నగధర
చిరకౌస్తుభధర శ్రీధరా
కరిఁ గాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా.

||తగు||

భవహర మురహర భక్తిపాపహర
భువన భారహర పురహరా
కవిసినవురుతను గద్దను మెచ్చితి –
వివల నీదయకు నివియా గురుతు.

||తగు||

శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁగృపకుఁ బాత్రము లివియా.

||తగు॥ 315

అవతారిక:

ముల్లోకాలలోను శ్రీహరిని వేడని వారెవరు? ఎంతోమంది ఋషులు, మునులు యెన్నెన్నో తపములు చేశారు ఆకాశాన్ని అందుకొనేంత కీర్తిని సంపాదించారు. కాని వారి కర్మములు పరిపక్వంచెంది తెగితేకాని వారికి నీ కృప కలుగదు. నీకృప వారికి యేజన్మలోనైనా యేక్షణాననైనా కలుగవచ్చును. అజ్ఞానంతో వారు నీకు అపకారం చేసినా వారు యెంత హీనస్థితిలోవున్నా పరిగెత్తి వారిని చేరి వారిని అక్కున చేర్చుకొంటావు. అన్నీ నీ అభయానికి పాత్రములే. కరిగాని, కాకిగాని, వుడతగాని, గద్దగాని, ఆవులుగాని, కోతులుగాని.. ఒక్కటనేమిటి యేదయినా నీ సంతతే, నీదే అనే కరుణ చూపిస్తావు. అందుకే నీవు జగత్పితవు అంటున్నారు అన్నమాచార్యులవారు. సాధ్యమైనంత వివరించటానికి ప్రయత్నించాను.

భావ వివరణ:

ఓ దేవదేవా! అనేకమంది ఋషులు, మునులు తగిన విధములుగా నీకోసం తపములనాచరించారు. కాని అందరికీ నీకృప కలిగిందా? ఆకాశాన్ని కొనే కీర్తి సంపాదించవచ్చు గాక! కాని కర్మము దీరక (పరిపక్వముకాక) నీకృప సిద్ధిస్తుందా?

ఓ భూరమణా! మందరగిరిధరా! నగధరా! (గోవర్ధనధారీ) ప్రఖ్యాతి చెందిన కౌస్తుభమణని ధరించినవాడా! శ్రీధరా! (శ్రీకాంతా!) నీలీలలనేమని వర్ణించను ప్రభూ! అలనాడు కరిని రక్షించావు (గజేంద్ర వరదుడు), కాకిని రక్షించావు (కాకాసురుని శిక్షింపబూనియు శరణంటే రక్షించాడు శ్రీరాముడు). నీ కరుణకు పాత్రులవ్వాలంటే హీనాధికములైన యేదైనా అర్హమే.

ఓ భవహరా! (పుట్టుక లేక చేయగల దేవా!) మురహర! (ముర అను అసురుని నిర్జించిన దేవా!) భక్త పాపహరా, ప్రపంచమున పాపుల భారమును నివారించువాడా! పురహరా! (త్రిపురాసురులను హరించినవాడా! నీ దయకు అర్హత యెవ్వరికైనా కలుగవచ్చును. ఆనాడు నీ రామావతారంలో, కవిసిన వుడుతకు (పరుగులు పెట్టి తన శరీరానికి ఇసుకను అంటించుకొని సేతువుపై విదిలించి సేతు నిర్మాణానికి తనదవంతు కృషి చేసిన ఒక చిన్ని ఉడుతకు మోక్షమిచ్చావు). గద్దయైన గరుత్మంతుని నీవాహనం చేసికొని గరుడ గమనుడవయ్యావు. వాటిని మెచ్చావు. అవల (ఆవిధంగా) వాటి జాతి మొత్తం ఈనాటికీ నీ గుర్తులను తమ శరీరంపై ధరించియున్నాయి.

ఓ శ్రీవేంకటాచలపతీ! శేషాద్రివాసా! గరుడాద్రివాసా! భూధరా! భూతపతీ! (సర్వ భూతముల ఆధారా!) నీ పావనమైన కృపకు పాత్రాపాత్ర భేదము లేదు. అందరికీ జీవనాధారమైన గోవులను కాచి గోవిందుడివైనట్లే, నిరుపయోగమైన కోతులకు కూడా క్రమశిక్షణ నేర్పి రామదండు చేశావు. ఎనలేని కీర్తినిచ్చావు. కరుణామూర్తీ! ఇంతకంటే యే నిరూపణలు ఇంతకంటే యే నిరూపణలు కావాలి తండ్రీ, నీవు కరుణాంతరంగుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment