Kesava Dasi Nati Gelichiti Nannitanu In Telugu – కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను
సంఖ్య : 432
పుట : 325
రాగం : సింధుభైరవి

సింధుభైరవి

33 కేశవదాసి నైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరాలికనేల వెదక ॥

||పల్లవి||

నిచ్చలు కోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుచేయ నీతీర్ధమే చాలు
పచ్చిపాపాలణచ నీ ప్రసాదమేచాలు
యెచ్చు కొందు వుపాయాలు ఇకనేల వెదక ॥

॥కేశవ॥

ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిషి కావగ తిరుమణి లాంఛనమే చాలు
మెనసెను దిక్కుదెస ఇకనేల వెదక॥

॥కేశవ॥

నెలవైన సుఖమియ్య నీ ధ్యానమేచాలు
అల దాపుదండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు యికనేల వెదక ॥

॥కేశవ॥

అవతారిక:

తనని తాను కేశవునికి ‘దాసి’ వలె భావించుకొని అన్నమాచార్యులవారు పాడుతున్న చక్కటి కీర్తననాస్వాదించండి. స్వామీ నేను నీవే దిక్కని నమ్మిన దాసిని. నాలో లోపాలు లేవని నేరాలు లేవని నేనను. కానీ అవన్నీ నేను ఈ మానవశరీరం ధరించటం చేత దేహానికి ప్రకృతి సిద్ధమైన నేరాలు. వాటిని ఈనాడు యెంచినందువలన వుపయోగమేమి వుంటుంది? నేను నీ నామ సంకీర్తనతో బ్రతుకుతున్నాను, నీ అర్చన, దాస్యము, కైంకర్యములతో వైష్ణవ దీక్షలో బ్రతుకుతున్నాను నాకు ఇతరములేవీ వద్దు, వద్దు, వద్దు. అంతే… అంటున్నారు.

భావ వివరణ:

ఓ కేశవా! నేను నీదాసినైతిని. అందుచేత అన్నిటా (ఇహపరములు రెంటినీ) గెలిచితి (సాధించగలిగాను). నేను, నాలో లోపాలు లేవని కాని నేరాలు చేయని వాడిని అనిగాని అనలేను. కాని అవి యీ శరీరపు నేరాలు నేను మానవ శరీరధారినైనందువలన దానికి సహజమైన నేరాలు. ఇక వాటిని వెదకనేల? అయినా వాటిని యెదుర్కొనటానికి నా ప్రయత్నాలు నేనూ చేస్తున్నాను.

నేను సదా నీ నామస్మరణతోనే బ్రతుకుతాను. నా కోరికలు తీర్చుటకు అది చాలదా? నీ తీర్థమైన చోటునే వుంటాను. నన్ను నిర్మలుని చేయటానికి అది చాలదా? నేను చేసే పచ్చిపాపాలు బాహాటంగా కనిపిస్తున్న పాపకర్మలు. అణగద్రొక్కుటకు నీ ప్రసాదము చాలదా? ఎచ్చుకొందు వుపాయాలు (ఎక్కువ తక్కువ కిటుకులు) అవసరమా? అక్కర్లేదు నిన్ను నమ్మితే చాలు.

నీకైంకర్యము (శరణాగతి) చాలు నేను ఘనుడను అనిపించుకొంటాను. నీ ముద్రలు (రెండు భుజములపైన ధరించే శంఖ చక్రముద్రలు) చాలును. మొనసి (పూని) అవే నీ ఆయుధాలవలెనే నన్ను రక్షిస్తాయి. మనిషి కావగ (రక్షించి కాపాడుటకు) నేను నానొసట ధరించే నీ తిరుమని లాంఛనము (పంగనామాలు) చాలును వాటితోనే నా మార్గము వెలుగులీనుతున్నది.

ఓ ప్రభూ! నీ దాస్యము నెలవైన (సుప్రతిష్టమైన) సుఖమునిస్తుంది. అలదాపుదండకు (ఆపైన తోడు నీడై కాపాడుటకు) నేను చేసే నీ అర్చనయే చాలును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఇన్నిటా (ఇన్ని విధములైన) నీసేవలు మాకు వున్నవి కదా!) ఎలమి (మా వికాసమునకు) ఇలపై అన్యములైన వుపాయముల వెదకుటెందులకు? నీవు మాకు చాలును తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment