Okarigaanaga Nodabadadu Manasu In Telugu – ఒకరిగానగ నొడబడదు మనసు

ఈ పోస్ట్ లో ఒకరిగానగ నొడబడదు మనసు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఒకరిగానగ నొడబడదు మనసు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: ఒకరిగానగ నొడబడదు మనసు
సంఖ్య : 534
పుట: 359
రాగం: సాళంగనాట

సాళంగనాట

42 ఒకరిఁ గానఁగ నొడఁబడదు మనసు
సకలముహరియని సరిఁదోఁచీని.

||పల్లవి||

అంతరాత్మ శ్రీహరి యతఁ డొకఁడే
జంతువులన్నియు సమములే
బంతులఁ బాత్రాపాత్రము వెదకిన
అంతట హరిదాస్యమేపో ఘనము.

||ఒక||

జగమును నొకటే చైతన్య మొకటే
తగినపంచభూతము లొకటే
నగుతా నెదిరిని నన్నును నెంచిన
మొగి నాపై హరిముద్రలె ఘనము.

||ఒక||

కారు స్వతంత్రులు కడపట నొకరును
యీరీతి నౌఁగాము లిఁక నేలా
శ్రీరమణీపతి శ్రీవేంకటేశుఁడే
కారణము శరణాగతియే ఘనము.

||ఒక||534

అవతారిక:

హరిహరుల మధ్య అంతరం యెలా సాధ్యం? రెండూ పరమాత్మ రూపాలే. రక్షణ భారం హరిదైతే లయం చేసే బాధ్యత హరుడిది. ఇది పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నా, కొందరు అజ్ఞానులు హరిహరదూషణ చేసి పాపం మూట కట్టుకుంటున్నారు. జగమున నున్నది చైతన్యమొక్కటే అని హితబోధ జేస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. ‘సకలము హరిమయమని సరిదోచీని’ అంటున్నారు. ఈసృష్టిలో ఆపరాత్పరుడు తప్ప యెవ్వరూ స్వతంత్రులు కారు. అందరూ ఆయన ఆజ్ఞానువర్తనులే. ఇక ఔగాములేల అంటున్నారు. అంటే మేలుచేసేదెవడు? కీడుచేసేదెవడు అన్నీ ఆ నామాలవాడే, మనిషి మానవత్వంలేకపోతే జంతువే కదా! రెండుకాళ్ళ జంతువు.

భావ వివరణ:

ఓ ప్రజలారా! నా మనస్సు ఒకరిన్ (వేరే ఇంకొకరిని కానగ (దర్శించుటకు) ఒడబడదు (అంగీకరించదు). నాకు సకలము హరియని సరిదోచీని (సరిగా అనిపిస్తున్నది). అయినా సత్యమేమిటో వినండి.

మన అందరిలో అంతరాత్మ రూపంలో వున్న శ్రీహరి ఒక్కడే. జంతువులు అన్నియూ సమానమే. మనస్సు అనేది ఒకటి వుండుటచేత మనిషి మేలైన జంతువయ్యాడు. తన మనస్సులో శ్రీహరిని నిలపగలిగితే పాత్రత (యోగ్యత) కలుగుతుంది. లేకపోతే వాడూ యోగ్యతలేని ద్విపాదపశువే కదా! వంతుల (పంతముతో) వెదకితే అపాత్రుడైన ద్విపాదపశువును పాత్రుడైన ఘనుని చేయగలిగిన దేమిటి? హరిదాస్యమే..పో. (కేవలం శ్రీహరిదాసునిగా జీవించటమే).

ఈ జగత్తంతా ఒక్కటే. ఇందులో వుండే చైతన్యము (కదిలేశక్తి) కూడా ఒక్కటే. పంచభూతములు (భూమి, నీరు, కాంతి, గాలి మరియు ఆకాశము) ఏదో ఒక రూపంలో ప్రతిదాంట్లో వున్నాయి. వుండాలి కూడా. కాబట్టి అవి కూడా ఒక్కటే. మరి అటువంటి పాంచభౌతిక శరీరధారినైన నన్ను ఘనుని చేసిందెవరు? నా పైన వున్న ఈ హరిముద్రలే (శంఖ చక్ర ముద్రలు, తిరునామము). నగుతా (నవ్వుతూ) యెదురుగా అవి లేకుంటే నాలో లెక్కించుటకు ఇంకా యేమున్నది?

ఒకసారి ఆలోచించండి. మనం కావాలనుకొని పుట్టామా? కావలసినప్పుడు కావలసినచోట కావలసిన విధంగా చావగలమా? కడపట (చివరికి) ఒక్కడికైనా ఆ స్వాతంత్రం (ఛాయిస్) వున్నదా? మరి ఇంతోటి దానికి “ఔగాము” లేల? మేలైనదేమిటి కీడైనదేమిటి?) మనకి మేలు జరిగినా హరివల్లనే, కీడు జరిగినా హరివల్లనే. అన్నిటికీ కారణం శ్రీపతియైన వేంకటేశ్వరుడే. మరి అలాంటప్పుడు ఈ పగయెందుకు? ద్వేషమెందుకు? ఆయనను శరణంటే అదే ఘనము కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment