Sitasameta Rama Sri Rama In Telugu – సీతాసమేత రామ శ్రీరామ

ఈ పోస్ట్ లో సీతాసమేత రామ శ్రీరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సీతాసమేత రామ శ్రీరామ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: సీతాసమేత రామ శ్రీరామ
సంఖ్య : 516
పుట: 347
రాగం: సాళంగనాట

సాళంగనాట

39 సీతాసమేత రామ శ్రీరామ
రాతి నాతిఁజేసిన శ్రీరామ రామ.

||పల్లవి||

ఆదిత్యకులమునందు నవతరించినరామ
కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రుయాగము గాచినరామ
వేదవేదాంతములలో వెలసినరామ.

||సీతా||

బలిమి సుగ్రీవునిపాలినిధానమ రామ
యిల మునుల కభయమిచ్చినరామ
జలధి నమ్ము మొనను సాధించినరామ
అలరు రావణదర్పహరణ రామ.

||సీతా||

లాలించి విభీషణుని లంకయేలించినరామ
చాలి శరణాగతరక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద వెలసినరామ
తాలిమితో వెలయు ప్రతాపపురామ.

||సీతా||516

అవతారిక:

శ్రీరామచంద్రమూర్తిపై చక్కటి భజననందిస్తున్న అన్నమాచార్యులవారి ఈ కీర్తన నాస్వాదించండి. బహు సులభమైన దీనిలో ఒకే ఒక్క మెలిక ‘ఆదరించి విశ్వామిత్రుయాగము గాచిన రామా’ అనే చోట వున్నది. ఇక్కడ ఆదరించడం అంటే సమున్నతమైన గౌరవం అన్నమాట. శ్రీరాముడు పరమాత్మే కదా! ఆయనకి తెలియనిదొక్కటీ వుండదు. అయినా ఏమీ తెలియని అమాయకుడిలా విశ్వామిత్రునికి గురుస్థానం ఇచ్చి ఆయన చెప్పినదంతా విని ఆయన యాగరక్షణ చేసి ‘రాముడు మంచి బాలుడు’ అనిపించుకొన్నాడు. ఇది బహుశా వావిలిపాడు వీరరాఘవునిపై చెప్పిన కీర్తన కావచ్చును.

భావ వివరణ:

సీతాసమేతుడవు (సీతాదేవితో ఒకే సింహాసనమును అధిష్టించియున్న) రాముడవు అయిన శ్రీరామా! శిలవలె అచేతనస్థితిలోవున్న నాతి అహల్యకు చేతనత్వము ప్రసాదించిన రామచంద్రమూర్తివి నీవే.

ఓ శ్రీరామా? నీవు ఆదిత్య కులమున (సూర్యవంశమున) అవతరించినవాడవు; కోదండ భంజనుడవు (శివ ధనస్సును విరిచిన రఘురాముడవు). విశ్వామిత్రునకు నీ గురుస్థానమును ప్రసాదించి, వినయశీలివైన శిష్యుడవై అనేక అస్త్రములను విద్యలను స్వీకరించి ఆయన యాగరక్షణ నెపమున దానవ దమనకు పునాది వేసితివి. వేదవేదాంతముల మూలపురుషుడవైన తారకరాముడవుగా వెలసిన శ్రీరామబ్రహ్మం నీవే.

ఓ శ్రీరామా! అలనాడు నీ బలమేమిటో సుగ్రీవుని కన్నులకు కట్టించి వానిని తిరిగి నిలబెట్టినవానిపాలి నిధానమవు (ఐశ్వర్యమైతివి); రాక్షసులచే వేధించబడుచున్న మునులకు జనస్థానమున అభయమిచ్చి రాక్షసులు పీడ తొలగించితివి. సేతువును నిర్మించదలచి నయమున నీకు లొంగని సాగరుని అమ్ము మొనకుదెచ్చి వానిని సాధించితివి. దర్పముతో (గర్వముతో) కన్నుమిన్ను గానని రావణుని గర్వమును హరించిన రామభద్రుడవైతివి.

అన్న మరణమునకు తానే కారణమని రోదించుచున్న విభీషణుని ఓదార్చి లంకకు యేలికను చేసితివి. కావలసినవారికి కావలసినంత శరణ్యమునొసగి రక్షించితివి. నేడు బంగారు శిఖరముల బోలిన తిరుమల శిఖరములపై శ్రీవేంకటేశ్వరుడవై చేరితివి. నీవే తాలిమితో (అనుపమ క్షమను ప్రదర్శించు) ప్రతాపపు రాముడవై (వీరరాఘవుడవై వెలసితివి. నీవే రాజారాముడవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment