ఈ పోస్ట్ లో ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 4
కీర్తన : ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము
సంఖ్య : 405
పుట : 272
రాగం: భూపాళం
భూపాళం
92 ఇవియే పో ప్రద్యుమ్న యిహపరసాధనము
భవజలధులతేప పరమయోగులకు
||పల్లవి||
వామన గోవింద విష్ణు వాసుదేవ హరి కృష్ణ
దామోదరాచ్యుత మాధవ శ్రీధరా
నీమహిమ గానలేము నిన్నెంచఁగలేము నీ –
నామజపమే చాలు నాలుక (కు) సులభము
||ఇవి||
అనిరుద్ధ పురుషోత్తమాధోక్షజ ఉపేంద్ర
జనార్దన కేశవ సంకర్షణా
నినుఁ దలఁచఁగ లేము నిన్నుఁ దెలియఁగ లేము
నునుపై నీనామమే నోటికి సులభము
||ఇవి||
నారాయణ పద్మనాభ హృషీకేశ
నారసింహ మధుసూదన త్రివిక్రమ
నీరూపు భావించలేము నిక్కపు శ్రీవేంకటేశ
ఆరయ నీనామజప మన్నిటా సులభము
||ఇవి||405
అవతారిక:
ప్రద్యుమ్నుడు అంటే ‘ప్రకృష్టమైన ‘ద్యుమ్నము’ కలవాడు. అనగా అతిశయించిన బలముకలవాడని అర్థం. మన్మథుని కున్న పర్యాయపదం అది. శ్రీమన్నారాయణుని కేశవనామాలలో కూడా ప్రత్యుమ్నునిపేరు చూస్తాము. శ్రీహరి కూడా అతిక్రమించ సాధ్యంకాని బలము కలవాడు కావున ఆయననూ ప్రద్యుమ్నుడు అంటారు. “ఓ ప్రద్యుమ్నా! పరమ యోగులకైనా భవసాగరమును దాటించే తెప్ప ఇవియే. ఇహమున సుఖము పరమున మోక్షము ఇవ్వవలెనంటే ఇవియేపో సాధనములు” . అంటున్నారు అన్నమాచార్యులవారు. భజన సాంప్రదాయంలో సాగే కీర్తన పాడితే కేశవనామాలు చదివినట్లే. మీదే ఆలస్యం…
భావ వివరణ:
ఓ ప్రద్యుమ్నా! (అతిశయించిన బలము కలవాడా) ఇహపరసాధనములు | (బ్రతికుండగా ఈలోకములో సుఖము చనిపోయాక పైలోకములలో మోక్షము సాధించు మార్గము) ఇవియేపో (ఇవియే సుమా!) పరమయోగులైన వారికి, భవజలధి తేప (సంసార సాగరమును దాటించగల నావ ఇదియే కదా!)
ఓ వామనమూర్తి! గోవిందుడా! విష్ణుదేవా! వాసుదేవా! శ్రీహరీ! శ్రీకృష్ణా! దామోదరా! (ఉదరమునకు తల్లి యశోదచే దామముతో కట్టబడినవాడా!) అచ్యుతా! మాధవా! శ్రీధరా! (లక్ష్మీవల్లభా!) నీమహిమను | గాలేము (తెలుసుకొనలేము). నిన్ను ఇటువంటివాడని అంచనావేయలేము. మరి ఇక యేమి చేయగలం? నాలుకకు అతి సులభమైన పని నీ నామమును జపించుట. అది చాలునాకు.
ఓ అనిరుద్ధా! (పరులచేత అడ్డగింపలేనివాడు) పురుషోత్తమా! అధోక్షజా! (ఇంద్రియములను జయించిన వారికి మాత్రమే కనబడువాడు) ఉపేంద్రా! జనార్ధనా! కేశవా! సంకర్షణా! (ప్రళయకాలమందు అందరినీ అంతముజేయువాడు) నిన్ను దలచలేము (నీగురించి ఆలోచించలేము). ఇక నిన్ను యెట్లు తెలియగలము? నునుపైన (పట్టుకోవటానికి తేలికైన) నీ నామము నోటితో సులభముగా పలికెదను ప్రభూ!
ఓ నారాయణుడా! పద్మనాభుడా!, హృషీకేశా! (ఇంద్రియములకు అధిపతి) నారసింహ! మధుసూదనా! త్రివిక్రమా! నీరూపము విశ్వరూపమైనందువలన యెట్లుండునో వూహింపజాలము. కానీ నేడు మాకన్నులయెదుట నిజముగా కనుపించుచున్న నిక్కపు వేంకటేశ్వరుడవు నీవే తండ్రీ! దర్శించి జపించుటకు అతి సులభమైన నీనామజపమును అన్నిటా స్వీకరింతును. ఎందుకంటే సులభమైన తరుణోపాయము ఓం నమో వేంకటేశాయ! అనడమే సుమా!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- జగములేలేవాడవు జనార్దనుడవు
- వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ