ఈ పోస్ట్ లో నమో నమో దశరథనందన మమ్ము రక్షించు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
నమో నమో దశరథనందన మమ్ము రక్షించు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 4
కీర్తన : నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
సంఖ్య : 301
పుట: 202
రాగం: మాళవశ్రీ
మాళవశ్రీ
91 నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
కమనీయ శరణాగతవజ్రపంజరా
||పల్లవి||
కోదండదీక్షాగురుఁడ రామచంద్ర
ఆదిత్యకుల దివ్యాస్త్రవేది
సోదించుమారీచునితలగుండుగండ
ఆదినారాయణ యసురభంజనా
॥నమో॥
ఖరదూషణశిరః ఖండనప్రతాప
శరధిబంధన విభీషణవరదా
అరయ విశ్వామిత్రయాగసంరక్షణ
ధరలోన రావణదర్వాపహరణ
||నమో||
పొలుపొంద నయోధ్యపురవరాధీశ్వర
గెలుపుమీరిన జానకీరమణ
అలఘుసుగ్రీవాంగదాదికపి సేవిత
సలలిత శ్రీవేంకటశైలనివాసా
||నమో|| 301
అవతారిక:
దశరథనందనుడైన శ్రీరామచంద్రమూర్తిని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో కూడా రామాయణ ఘట్టములను | వర్ణిస్తూ రాముని నామాలను సన్నుతిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనా యజ్ఞంలో ఈ దీక్షితులు సమర్పిస్తున్న ఈ కీర్తన సంఖ్య 1000. సహస్రాక్షుడు, సహస్రబాహువు, సహస్రముఖుడు, సహస్రరూపుడు అయిన ఆ “సాసముఖుని” సహస్రకీర్తనల వివరణతో అర్చించగలుగుతున్నాను. ఈ జన్మకిది చాలు. అన్నమయ్య అన్నట్లు “ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి, యిదిగాక వైభవంబికవొకటి కలదే”!
భావ వివరణ:
దశరథనందునడవైన ఓ శ్రీరామచంద్రా! నమో నమో! నీకు వేలకొలది వందనములు. మమ్ము రక్షింపుము తండ్రీ! నీవెవ్వరివి ప్రభూ “కమనీయ శరణాగత వజ్రపంజరుడవు” (నీ శరణార్థులకు మనోజ్ఞమైన వజ్రపు కవచము వంటి రక్షకుడవు).
ఓ రామంచంద్రా! నీవు నీదాసులు రక్షణకై యెప్పుడూ కోదండమును ధరించియే వుంటాను, అనే దీక్ష నిర్వహించిన దీక్షితుడవు. ఆదిత్యకులములో (సూర్య వంశములో) జన్మించిన సకల శస్త్రాస్త్రపారంగతుడవు. మాయలేడివలె వచ్చిన మారీచుని సోదించు (వెదుకునట్టి) తలగుండు గండవు (శిక్షగా తలపై పెట్టుకొని తిరిగే పెద్దబండ వంటి మొనగాడివి). అంటే మారీచునివంటి కపటుల పాలిటి యముడివి అని భావము.
ఖరదూషణుల తలలను ఖండించి పదివేల మంది రాక్షసులను క్షణంలో మట్టుబెట్టావు. శరధిని బంధించి (వారధి నిర్మించి) విభీషణునికి వరదుడవైన ప్రతాపశాలివి. విశ్వామిత్రుని యాగమును సంరక్షించిన | జగజ్జెట్టివి. పుడమియందు జన్మించి, రావణాసురని చంపగలిగి కూడా “నేడుపోయి విశ్రాంతి తీసికొని తిరిగి రేపటికి తేరుకొని రా!” అని వదలివైచి వాడి గర్వాన్ని సమూలంగా హరించిన వీరాధివీరుడవు.
కీర్తితో అయోధ్యాపురాధీశ్వరుడవై యేలిన చక్రవర్తివి. గెలుపుమీరిన (కీర్తికాంత, భూకాంత, శ్రీకాంతలను కూడా గెలిచిన) జానకీరమణుడవు. కపిసేనలో అలఘులైన (ఉద్దండులైన) సుగ్రీవుడు అంగదుడు మొదలైన వారందరిచే సేవించబడినవాడవు. ఇంతే కాదు స్వామీ! నీవు సలలితము (దివ్యసౌందర్యోపేతమైన) శ్రీవేంకటశిఖర నివాసివైన మా దైవము శ్రీవేంకటేశ్వరుడవూ నీవే.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- జగములేలేవాడవు జనార్దనుడవు
- వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ